11, జులై 2023, మంగళవారం

బ్రహ్మపుత్ర

 సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుడు 'బ్రహ్మపుత్ర' ను తన అంశ తో ఆవిర్భవింప జేసినట్లు కథనం.


పూర్వము  శంతనుడు అనే ఋషి   వుండేవాడు. అయన భార్య అమోఘ.వీరిద్దరూ ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం దైవ చింతనలో నియమ నిష్టలతో తపో జీవనాన్ని సాగిస్తూ వుండేవారు.


వారిని చూసి బ్రహ్మ దేవుడికి సంతోషం కలిగి 

వారికేదైనా మేలు చెయ్యాలని తలచి వారికి తన అంశ తో ఒక కుమారుని ప్రసాదించాడు.తపస్సంపన్ను డయిన 

శంతనుడు తన కుమారుని జన్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు. లోకహితం కోసమే తనకు కుమారుడు కలిగాడని గుర్తించాడు.


శంతనుడు తన కుమారుడిని తెసుకొని కైలాసం, గంధమాదనం, జరుది,శంబకం అనే నాలుగు పర్వతాల మధ్యకు తీసుకొని వెళ్లి అక్కడ వదిలిపెట్టాడు.


బాలుడిని ఆ నాలుగు కొండల మధ్య వుంచగానే అతడు జల రూపంగా మారి 5 యోజనాల ప్రదేశం లో విస్తరించాడు. శంతనుడు ఆ కుండా నికి 'బ్రహ్మకుండం'అని పేరు పెట్టి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.ఆ కుండం లో దేవతలూ, అప్సరసలూ 

స్నానము చేస్తూ వుండేవారు.ఈ బ్రహ్మ కుండమే బ్రహ్మపుత్రా నదిగా మారింది. 


రేణుకా జమదగ్నుల కుమారుడు పరశురాముడు. రేణుకాదేవి రోజూ నదికి వెళ్లి అక్కడి ఇసుకతో కుండను తయారు చేసి ఆ కుండలో నీళ్ళు తెచ్చి తన భర్త సంధ్యా వందనాని కోసం పెట్టేది. 


ఒకనాడు ఆమె కుండలో నీళ్ళు తెస్తూండగా ఆకాశం లో గంధర్వులు నాట్యం చేస్తుండడం కనిపించి వారి వైపు చూస్త్తూ వుండి పోయింది. పర పురుషులను  దీక్షగా చూడడం వల్ల ఆమె ప్రాతివ్రత్యం భంగమై ఆ కుండ పగిలి పోతుంది. మరీ యెంత ప్రయత్నించినా ఇసుకతో కుండ తయారు కాదు.


ఆమె నిరాశతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అప్పుడు జమదగ్ని తన దివ్య దృష్టి తో తెలుసుకొని కోపంతో తన కుమారులను పిలిచి ఆమె తలను ఖండించమని ఆజ్ఞాపిస్తాడు.తల్లిని చంపడానికి  కుమారులేవ్వరూ ఒప్పుకోరు.జమదగ్ని వారి శపిస్తాడు..


అపుడు జమదగ్ని పరశురాముడి కి చెప్తాడు అతడు తండ్రి  ఆనతిని పాటించి తల్లి తల తెగ వేస్తాడు.అతడి పితృభక్తికి మెచ్చుకొని యేదైనా వరం కోరుకోమంటాడు. 


అప్పుడు పరశురాముడు తల్లిని బ్రతికించి తన తన సోదరులకు శాప విముక్తి కలిగించ మంటాడు.జమదగ్ని అలాగే చేస్తాడు. 


పరశురాముడి   కి మా తృ హత్యా పాపం అంటుకుంటుంది. అది పోగొట్టు కోవడానికి ఎన్నో తీర్థాలు,క్షేత్రాలు దర్శించినా పోదు.


జమదగ్ని కుమారుడి ని చూసి జాలిపడి మానస సరోవరం లోని బ్రహ్మ కుండం లో స్నానం చేయమని చెప్తాడు.అందులో స్నానం చెయ్యగానే అతన్ని అంటిన బ్రహ్మ హత్యా పాతకం పోతుంది పరశురాముడు ఈ పవిత్ర నీటి వల్ల  కలిగే పుణ్య ఫలాలను అందరికీ కలిగించాలనే ఉద్దేశ్యం తో తన గొడ్డలితో త్రవ్వి బ్రహ్మ కుండాన్నించి వేరు  చేసి పారేలాగా చేశాడు.


నీరు పారుతూ వెళ్లి కైలాసం లో వున్న లోహిత సరోవరం లోకి చేరింది.పరశురాముడు కైలాసం వెళ్లి అక్కడ త్రవ్వి దారి చేస్తాడు.అది భూమి పైకి ప్రవహించింది.ఈ విధంగా పరశురాముడు బ్రహ్మపుత్రను భూమి పైకి తీసుకొని వచ్చినట్టు పురాణ కథనం.


ఈ నది ఒడ్డున శ్రీకృష్ణుడు 

సత్యభామతో పాటు కొంతకాలం విశ్రమించి ఆ నదిలో స్నానమాచరించి దాని ఫలితంగానే నరకాసురుడిని సంహరించి నట్లు కథనం ఈ నదీ తీరం లోనే శివుడు మన్మథుడిని దహించి పార్వతీదేవికి జ్ఞాన బోధ చేసినాడని చెప్తారు.శ్రీ  మహావిష్ణువు ఈ నదీ తీరం  లోనే మధు కైటభులనే రాక్షసులను సంహరించాడని 

పురాణాలలో చెప్పబడింది.దీని నీరు ఎర్రగా వుండడం వల్ల.దీనికి లౌహిత్య అనే మరో పేరు కూడా వుంది.టిబెట్ లో ఈ నదికి  'తింగ్ పో' అని పేరు. అరుణాచల ప్రదేశ్ లో ;సియాంగ్' అని ఈ నదిని పిలుస్తారు.


అన్ని నదులనూ స్త్రీలుగానే వర్ణిస్తారు.కానీ ఈ బ్రహ్మపుత్ర మాత్రం పురుషుడు గా చెప్పబడ్డది.

కామెంట్‌లు లేవు: