16, ఆగస్టు 2023, బుధవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-20🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-20🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


పద్మావతి తన యిష్టసఖులను వెంటబెట్టుకొని శృంగారవనమునకు విహారమునకై వెళ్ళినది. అందమయిన అనేకానేక రకాల మొక్కలు, వివిధ నామాలతో విలసిల్లే పుష్పాలూ వుండీ ఆ శృంగారవనము శాభాయమానముగా వుంది. చెలులు తోటపని చేసేవారు. ఆ తరువాత కొలనులో చల్ల చల్లని నీటిలో జలకాలాడారు. ఆ తరువాత మధుర ఫలాలు భక్షించారు. ఆనందముగా సంగీతయుక్తముగా పాటలు పాడుకోవడము ప్రారంభించారు. 


దాహముతో నున్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనములో గల కొలనులో నీరు త్రాగి, దాహము తీర్చుకొని ఒక వృక్షచ్చాయకు వెడలినాడు. అప్పుడతనికి పద్మావతి చెలికత్తెలు చేస్తున్న గానము వినబడింది. ఆ గానం వింటూ శ్రీనివాసుడు ఆ పాటలు పాడుతున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. 


పాట వచ్చేవైపే వెళ్ళినాడు. పద్మావతిని, చెలికత్తెలను చూశాడు, వారూ శ్రీనివాసుని చూశారు. 


పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసు డాశ్చర్యపోయినాడు. ఆహా! ఈ కన్య రతిని, పార్వతిని, భారతిని, శ్రీసతిని తలదన్నునంత అందముగ న్నుదే! ఈ వనితపొందు పొందనిచో నా యీ జన్మమేల?


 ఈమె పాదాలు చూడబోతే చిగురుటాకుల్ని మించి వున్నాయి. ఈమె నడుము చూస్తే లేదనిపించే నడుము. ఈమె వక్షోజాలు చేస్తే జక్కువపిట్టలకన్నా బాగున్నాయి. చేతులు కమలాల సుకుమారాన్ని కాదనేలా ఉన్నాయి. 


శంఖములాగా ఉన్నది కంఠము. అధరము దొండపండులాగా ఉన్నది. మల్లె మొగ్గలను మించిన తెల్లదనముతో పలువరుస వున్నది. నువ్వుపువ్వును నీలెక్కే మిటనగల సొగసుతనము గల ముక్కు ఈమె కున్నది. 


శ్రీకారములను మించిన చెవులు కలిగి యున్నదీ వనిత. ఆమె కన్నులా హృదయగతానం దావిష్కారణ దర్పణములై నిర్మలములై ఉన్నవి. ఈమె తీయని మాటలు వీణియమీటల మధురస్వరములను మించి ఉన్నవి’ అని పద్మావతి సౌందర్యాన్ని పదేపదే వర్ణించుకున్నాడు. 


అసలు ఈమె వివాహితయో? అవివాహితయో? కూడా తెలుసుకొనవలసి వున్నది, సరే ఆమెనే అడిగెదను గాక అనుకొని పద్మావతినీ సమీపించబోయెను. పద్మావతి తన చెంతకు వచ్చుచున్న వేటగానిని చూచి బెదిరి చెలులతో ‘‘మీరు వెడలి ఆ వచ్చుచున్న పురుషులెవరో సంగతీ సందర్భము తెలుసుకొనిరండి’’ అని పంపించినది.


చెలెకత్తెలు శ్రీనివాసుని సమీపానికి వెడలి ‘‘అయ్యా మీరెవరో తెలుసుకొనగోరుచున్నాము. మీ నామధేయమేమి? మీరు యిచ్చటికి యెందు వచ్చిరి మార్గము తప్పి వచ్చితిరా! ఈ శృంగారవనానికి పురుషులు రాకూడదని మీకు తెలియదా!’ అని ప్రశ్నించిరి. 


అంతట శ్రీనివాసుడు ‘‘కన్యలారా! మీరు వేసిన ప్రశ్నలన్నింటికి మీ రాజకుమార్తెకు స్వయముగా సమాధాన మివ్వగలవాడను’’ అని అంటూ పద్మావతిని సమీపించినాడు. 


శ్రీనివాసుడు వేటకు వెళ్ళేదారి వేషం ధరించియున్నందువలన అతడు నిజముగా బోయవాడనియే పద్మావతి భ్రమించినది, కోపములో ఆమె మీరీవిధముగా స్ర్తీలుండే వనానికి రావడము సబబా? మీ దేశము యే దేశము?’ అని శ్రీనివాసునిపైప్రశ్నల వర్షం కురిపించినది. శ్రీనివాసుడన్నాడు గదా ‘‘ఓ సుందరీ! నాకెవరూ లేరు. ప్రస్తుతము నాకు బంధువులునూ లేరు. చెప్పుకొనుటకు నివాసమునూ లేదు.


 పూర్వము నాకు నివాస మొకటి వుండేది. ఇప్పుడు సంచారినగుటచే సర్వదేశములున్నూ నావే, పూర్వకాలములో లక్ష్మీ సంపన్నుడిగా నుండిననూ ప్రస్తుతము నేను బీదవాడను, నీవెవ్వరివి? నీ శుభనామమేమి? నీ మాతాపితలెవ్వరు? అని అడిగినాడు. 


జవాబు యివ్వకపోవుట మర్యాద కాదనీ ఆమెకు తెలుసు. అందుచే ‘నా తండ్రి ఆకాశరాజు, నా తల్లి ధరణీదేవి, నా పేరేమో పద్మావతి’ అని చెప్పి. మీరిచ్చటనుండి త్వరగా వెళ్ళుడు. పురుషులు యీ ప్రాంతమున నుండరాదనెను.


 అందులకు శ్రీనివాసుడు ‘సుందరీ’! నీ చక్కదనము చూచిన క్షణమునుండి యిచ్చటనుండి మరలి వెడలుటకు నా మనస్సు ఒప్పుకొనుటలేదు. నీవు లక్ష్మివలె నున్నావు. నిన్ను నేను ప్రేమించుచున్నాను. నన్ను వివాహము చేసుకొనుము’ అన్నాడు. ఒడలు మండిపోయినది పద్మావతికి ‘‘ఓయీ! మూర్ఘ స్వభావుడా! క్రిందు మీదెరుగకు పలుకుచున్నావు. క్రూర స్వభావుడవైన, బోయవాడవైన నిన్ను నేను వివాహము చేసుకొనవలెనా? నీవు మతిభ్రమవలన యీ విధముగా మాట్లాడుచుంటివా? మా తండ్రిగారైన ఆకాశరాజుగారికి యీ విషయము తెలిస్తే యింకేమయినా వుంటుందా? నిన్ను ఖండఖండాలుగా చేస్తారు తెలుసా! లెంపలు వేసుకొని యింటికి వెళ్ళిపో’ అని గర్జించింది. 


శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందులాడుచుండగా ‘‘ప్రేమకు ఆశాశ్వతమైన సంపదలతో సంబంధము వుండదు. ప్రేమ హృదయాలకు సంబంధించినది. అది మమత, అనురాగము, అభిమానము మున్నగువానితో ముడివేసుకొని వుంటుంది. నిన్ను వివాహము చేసుకోకపోతే నేను జీవించలేను. నన్ను కాదనకు!’ అని కొంచెము దర్జాగా వెళ్ళాడు ఒక వూరుకొని లాభము లేదనుకొన్నది పద్మావతి. 


వెంటనే చెలులను పిలచి ‘మీద మీదకు వస్తున్న ఈయనను రాళ్ళతో కొట్టండి’ అన్నది. ఆ చెలికత్తెలందరూ రాళ్ళు తీసుకొని శ్రీనివాసుని కొట్టసాగారు. అందరూ ఒక్కసారిగా కొట్టిన ఆ రాళ్ళ దెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకొనలేకపోయాడు.



 శరీరమంతా రాళ్ళ దెబ్బలవలన రక్తము కారుచుండగా, శృంగారవనమునుండి శ్రీనివాసుడు నిష్క్రమించి, తన నివాస స్థానమగు శేషచలము చేరుకున్నాడు.

నివాసుడు విచారముతో దిగులుపడి రావడానికి కారణము తెలియక గాభరా పండింది వకుళ, తీరా చూస్తే శరీరము నిండా గాయాలూ, రక్తమూను, మహాందోళన పడినది,


 ‘అయ్యో! నాయనా! ఇదేమిటి? ఇన్నిగాయాలేమిటి? ఈ రక్తమేమిటి? నిన్ను కొట్టిన ఆ కరకు గుండెలవాళ్ళెవరు? అయ్యయ్యో! ఎట్లా ఓర్చుకుంటున్నావో నాయనా! నీ తల్లిని నేను అడుగుతున్నాను. ఏమి జరిగినది? విషయము చెప్పు నాయనా! అని అడిగినది. అడుగుతూనే గాయములపై ఏవేవో పసరులూ, ఆకులూ తెచ్చి వేసినది. ఒడలు తడిమి గాయమున్న చోటనల్లా ఆకుపసరు రాసినది. 


శ్రీనివాసుడు వకుళతో జరిగిన విషయములను పూజగ్రుచ్చినట్లు చెప్పాడు. శ్రీనివాసుడు ‘అమ్మా! అదేమిటోనమ్మా! ఆ సౌందర్యరాశిని చూసినప్పటినుండి పెండ్లి చేసుకొంటే ఆమెనే చేసుకోవాలని భ్రాంతి కలిగినది. ఆమె లేకపోతే నేను బ్రతకలేను. ఆమెను వివాహమాడకపోతే యిక నా జీవితమే లేదు’ అని తన హృదయములో నున్నదంతా వెళ్ళగ్రక్కాడు..



శ్రీనివాసుడు చెప్పినది సర్వమూ వినిన వకుళ అతనితో ‘నాయనా! ఎంతటి పొరపాటు చేసితివి? ఆకాశరాజు అంటే సామాన్యుడా! సిరిసంపదలతో తులతూగే మహారాజు, అతనికీ మనకీ వియ్యము ఎలా పొసగుతుంది? కయ్యమైనా, వియ్యమైనా సమానమైన వాళ్ళతోనే మంచిదను పెద్దల మాటలు వినలేదా? నీ మేలుకోరి చెప్పుచున్నాను. ఇక ఆ విషయము మరచిపో, వారితో మనకేమి సంబంధం?’’ అన్నది. 


ఏకస్వరూప గోవిందా, లోక రక్షక గోవిందా, వేంగమాంబనుత గోవిందా, వేదాచల స్థిత గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||20||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: