10, ఆగస్టు 2023, గురువారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 8*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 8*


పుస్తకాలు చదువులు ఎన్ని నేర్చినా, తల్లితండ్రుల జీవితాల నుండి గ్రహించిన విద్య జీవితంలో రాణించడానికి దోహదపడుతుంది. నరేంద్రుడు కూడా తన తల్లితండ్రుల నుండి ఎన్నో నేర్చుకొన్నాడు. 


సత్ప్రవర్తన అంటే ఏమిటి? దానికి కొలబద్ద ఏది? కష్టాల పరంపరతో జీవితం తల్లడిల్లిపోతున్నప్పుడు సైతం చలించక సన్మార్గంలో జీవించడం, జీవితానికి ఉత్కృష్ట ఆలంబనం భగవంతుడేనని ఎంచి ఆయనను శరణుజొచ్చి జీవించడం లాంటివి తల్లి నుండి నరేంద్రుడు నేర్చుకొన్నాడు.


ఒక రోజు భువనేశ్వరి, నరేంద్రుడితో ...

"నాయనా! సదా పునీతుడవుగా, ఆత్మగౌరవంతో మెలగు. అదే సమయంలో పరుల ఆత్మగౌరవాన్ని పరిగణించి జీవించడమూ అలవరచుకో. సరళ స్వభావిగా, సమతను పాటిస్తూ వ్యవహరించు, కాని అవసరమైనప్పుడు నీ హృదయాన్ని ఉక్కులా చేసుకోవడానికీ సంకోచించకు.” ఇవి అనుభవంతో చెప్పిన మాటలు. 


నరేంద్రుని జీవితంలో అనేక సందర్భాలలో ఈ మాటలు అతడికి మార్గదర్శకాలై ఒప్పారాయి. అందుకే కాలాంతరంలో స్వామి వివేకానంద, "తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు. నా ధీశక్తి యావత్తుకూ కారకురాలు నా తల్లి" అన్నారు.  


ఒక సంఘటన..


ఒకేకసారి తరగతిలో భూగోళశాస్త్ర పాఠం చెబుతున్నారు. ఉపాధ్యాయుడు దేశపటం ఒకటి వ్రేలాడదీసి దాన్లో ఒక ఫలానా నగరాన్ని గుర్తించమని నరేంద్రుణ్ణి ప్రశ్నించాడు. నరేంద్రుడు చూపించాడు. ఉపాధ్యాయుడు అది తప్పు అన్నాడు. దాన్ని తిరస్కరించి, తనదే ఒప్పు అన్నాడు. తన జవాబును తిరస్కరిస్తున్నాడనే కోపంతో ఉపాధ్యాయుడు అతణ్ణి చేతులు చాచమని బెత్తంతో కొట్టాడు. దెబ్బలన్నీ ఓర్చుకొన్నాడేగాని తన జవాబు తప్పు అని మాత్రం అతడు అంగీకరించలేదు.


 కాసేపటి తరువాత పుస్తకం చూసినప్పుడు తన జవాబే తప్పని ఉపాధ్యాయుడు గ్రహించాడు. వెంటనే నరేన్ ను క్షమించమని అడగడమేగాక అప్పటి నుండి అతడిపట్ల గౌరవభావంతో మెలగసాగాడు. ఈ సంఘటనను కూడా తు.చ. తప్పక తల్లితో చెప్పాడు నరేన్. భువనేశ్వరి అతణ్ణి హృదయానికి హత్తుకొని, “నా చిట్టితండ్రీ! న్యాయం నీ వైపు ఉన్నప్పుడు నువ్వు కలతచెందనవసరం లేదు.

 

న్యాయమార్గం కొన్ని సమయాలలో దుర్గమంగానూ, కష్టజనితంగాను

ఉండవచ్చు. కాని నువ్వు న్యాయమని అనుకొన్న దానిని చేయడానికి తటపటాయించవద్దు" అని చెప్పింది. ఈ ఉపదేశం నరేంద్రునికి జీవిత పర్యంతం ఏ పరిస్థితిలోనూ విస్మరించింది లేదు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: