4, సెప్టెంబర్ 2023, సోమవారం

రామాయణమ్ 314

 రామాయణమ్ 314

....

రాక్షసేశ్వరా! నీవు చేసిన పని అధర్మము ,అక్రమము నీ వంటిబుద్ధిమంతులైన వారు ఇటువంటిపనులలో తలదూర్చరు .

.

రామబాణానికి అడ్డులేదు లక్ష్మణశరానికి ఎదురు లేదు.

.

రామకోపాగ్నిలో పడి శలభంలాగా మాడి మసి అయిపోకు! 

.

రామునికి కోపము తెప్పించినతరువాత కూడా సుఖముగా గుండెమీద చేయి వేసుకునినిద్రించగలవాడు

ముల్లోకాలలో 

ఇంతవరకు ఎవడూ పుట్టలేదు ,

ఇక ముందు ఎవడూ పుట్టడు.

.

నీకు హితము చేకూర్చేదీ ,మరియు ధర్మబద్ధమైన మాట నేనొకటి చెపుతాను విను.

.

నేను ఇక్కడికి వచ్చి సీతమ్మను చూసినాను.ఆ మహాసాధ్విని ఆవిడ భర్తకు అప్పగించు.

.

అసంభవమూ,అతిదుర్లభమూ అయిన కార్యాన్ని నేను సాధించాను ! ఇక మిగతావిషయాలు రామచంద్రుడు చూసుకుంటాడు.

.

సీతమ్మ అంటే ఏవిటో అనుకుంటున్నావు ! బంధించి తీసుకు వచ్చాను కదా అని సంబరపడుతున్నావు ,

కానీ అయిదు తలల ఆడత్రాచుపాము అన్నసంగతి గ్రహించలేకున్నావు.

.

నీ తపస్సును ,నీ ధర్మాన్నీ వ్యర్ధము చేసుకుంటున్నావు.

.

తపస్సు చేసి చావులేకుండా వరంపొందానని సంతోషిస్తున్నావేమో ! 

.

సుగ్రీవుడు ...అసురుడు కాడు,అమరుడు కాడు ,దేవ,దానవ,యక్ష ,గంధర్వ,కిన్నర,కింపురుషు,పన్నగ,

ఉరగులలో ఎవడూ కాడు! ఆయన వానరుడు!అతడినుండి నీవు ప్రాణాలు ఎలా కాపాడుకుంటావు ?

.

అధర్మాన్ని నాశనం చేయడానికి ధర్మమే తగిన మార్గాలను వెతుక్కుంటుంది.

.

నీవు ఆచరించిన ధర్మాలకు మాత్రమే ఇప్పటివరకూ ప్రతిఫలం పొందావు ....ఇక ముందు నీ అధర్మానికి ప్రతిఫలం పొందుతావు !.....

.

అని అంటూ ఇంకా కొనసాగిస్తున్నాడు పవనసుతుడు..

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: