9, సెప్టెంబర్ 2023, శనివారం

రామాయణమ్ 319

 రామాయణమ్ 319

...

మొదలయ్యింది లంకాదహనం.

.

 ముందుగా తనను ప్రశ్నించిన ప్రహస్తుని ఇంటికి నిప్పు పెట్టాడు ,

ఆతరువాత మహా పార్శ్వుడి కొంపతగలబడ్డది ,

వంజ్రదంష్ట్ర

శుకసారణుల గృహాలవంతు వెంటనే వచ్చింది .

.

ఆ తరువాత ఇంద్రజిత్తు ఇంటికి నిప్పంటించాడు ,జంబుమాలి,సుమాలి,రశ్మికేతువు ,

సూర్యశత్రువు ఇలా వరుసగా రాక్షస యోధుల ఇళ్ళన్నీ అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చాడు.

.

 ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రమే వదిలి పెట్డి వరసపెట్టి అందరి ఇళ్ళు తగులబెట్టాడు మారుతి.

.

అందరి ఇళ్ళూ కాల్చి చివరగా రావణుడి ఇంటికి కూడా తన తోక చివరన ఉన్న అగ్నిని అంటించి సింహగర్జన చేశాడు వాయునందనుడు.

.

మిత్రులిరువురూ వారి పని వారు చేసుకొని పోసాగారు.

.

 అగ్నిదేవుడు వాయుదేవుడు ఒకరికొకరు సహాయపడుతూ లంకనంతా అగ్నిగుండంగా మార్చి వేశారు.

.

ఫెళఫేళార్భాటాలతో ఇళ్ళన్ని కాలి బ్రద్దలై కూలిపోసాగాయి.

.

అటుఇటు పరుగెడుతూ తమ వారిని ఎలా రక్షించుకోవాలో తమనెట్లా కాపాడుకోవాలో దిక్కుతోచక పరుగులుపెట్టే జనం.

.

జనంజనం 

మహాదుఃఖసాగరం!!

.

 హా తాత,

హా మిత్ర,

హా పుత్ర 

అంటూ కేకలు వేస్తూ వీధులలో పరుగెడతున్న జనం ..

.

చంటిపాపడిని చంకన పెట్టుకొని ఒకతి

జుట్టు విరబోసుకొని జారినబట్టలు సవరించుకొనే సమయములేక మరొకతి.

మెట్లమీదనుండి వచ్చే సమయములేక మేడమీద నుండి దూకి ప్రాణాలు కాపాడుకొనేది ఇంకొకతి.

.

ముసలి,ముతక,పిల్లజెల్లా అంతా విపరీతమయిన భయముతో ప్రాణాలుకాపాడుకోవాలనే తపనతో వీధులవెంట పరుగులు పెడుతున్నారు.

.

కాలిన భవనాలనుండి

రాలిన మణి మాణిక్యాలు

.

ఎంత కాల్చినా అగ్నిదేవుడికి తృప్తి కలగటంలేదు .

ఎంతమంది రాక్షసులను చంపినా మారుతికి తృప్తికలగటంలేదు...

ఇరువురికీ తృప్తిలేదు.

.

వలయాలు వలయాలుగా తిరుగుతున్న అగ్ని శిఖలు లంకలో విలయాలను సృష్టిస్తూ ప్రళయవేళను మైమరపిస్తున్నవి.

.

ఎవడీ కోతి 

ఎందుకు చేశాడు ఈ రీతి?

ఏమివీడి నిర్భీతి?

.

వీడు ఇంద్రుడా?

వీడు రుద్రుడా??

వీడు కుబేరుడా ?

కాదుకాదుమనపాలిటి 

కాల యముడు 

అని చర్చించుకుంటూ పరుగులుపెడుతున్నారు  లంకా నగరవాసులు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: