7, అక్టోబర్ 2023, శనివారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 57*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 57*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఆధ్యాత్మిక సాధనలు తీవ్రమయ్యే కొద్దీ కొన్ని అతీంద్రియ అనుభవాలను తప్పించుకోలేము. కలలో వచ్చే అనుభవాలు, జాగ్రదావస్థలో జరిగే సంఘటనలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, సరియైన రీతిలో స్వీకరించడానికి ఒక ఉత్తమ గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరం.


నరేంద్రుని కొన్ని అనుభవాలను పరికిద్దాం. ఈ రోజుల్లో రూపంలో తన లాంటి తన 'కవల'ను నరేంద్రుడు చూడసాగాడు. అతడు అచ్చం నరేంద్రుడే!  అద్దంలో కనిపించే ప్రతిబింబం చేసే విధంగా, నరేంద్రుడు చేసేదంతా ఆ 'కవల' కూడా చేసేవాడు. కొన్ని సమయాల్లో ఒక గంటసేపటి దాకా ఆ 'కవల' ఉండేవాడు. ఈ విషయాన్ని నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు తెలియజేశాడు. కాని ఆయన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు; అత్యున్నత ధ్యాన స్థితులలో ఇటువంటి అనుభవాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయని మాత్రం ఆయన చెప్పారు. '


మరొక అనుభవం: ఒక రోజు రాత్రి నరేంద్రుడు తన మిత్రుడైన శరత్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, "ఈ ఇంటిని ఇంతకు మునుపు నేను ఎప్పుడో చూసివున్నాను! ఎటుగుండా ఎటు వెళ్లాలో, ఏ గది ఎక్కడ ఉందో నాకు బాగా పరిచయమైనట్లు తోస్తున్నది, ఏం ఆశ్చర్యం!" అన్నాడు. తమాషా ఏమిటంటే నరేంద్రుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అదే మొట్టమొదటిసారి. దీనిని గురించి కాలాంతరంలో అతడు ఇలా చెప్పాడు:


"చిన్నతనం నుండే కొన్ని చోట్లను, వస్తువులను, వ్యక్తులను చూసినప్పుడు, వారిని మునుపే చూసాను, మెలగాను అనే భావన కొన్ని సమయాలలో కలగడం కద్దు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎంత ప్రయత్నించినా జ్ఞాపకానికి రాదు. అలాగని వారిని అంతకు మునుపు చూడలేదనీ చెప్పలేను. ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతుంది. 


మిత్రులతో మాట్లాడుతూవుంటాను. హఠాత్తుగా వారిలో ఏదో ఒక మాట నా జ్ఞాపకాన్ని రగుల్కొల్పుతుంది. 'ఇదే విషయం గురించి వీరితో ఇదే ఇంట్లో మునుపు కూడా మాట్లాడివున్నాను. కచ్చితంగా ఈ మిత్రుడే అప్పుడూ ఇదే అభిప్రాయం వెల్లడించాడు' అని అనిపిస్తుంది. కాని ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడ, ఎప్పుడు అని మాత్రం జ్ఞాపకానికి రాదు. 


పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకొన్నప్పుడు, ఈ చోట్లను ఈ వ్యక్తులను గత జన్మలలో కలుసుకొని ఉండవచ్చు, ఆ జ్ఞాపకాలే కాస్త అప్పుడప్పుడు వస్తున్నాయని సరి పెట్టుకొన్నాను. కాని ఈ నిర్ణయం హేతుబద్ధంగా లేదు. ఇప్పుడు నాకు నిజం బోధ పడింది. నేను ఈ జన్మలో ఎవరెవరిని ఎక్కడ, ఎప్పుడు ఎలా కలుసుకోబోతున్నాను, మెలగబోతున్నాను అనే విషయాలు నేను జన్మించడానికి మునుపే చిత్రప్రదర్శనలా చూసివుండాలి; ఆ జ్ఞాపకాలే అప్పుడప్పుడు మనస్సులో మెదలుతున్నాయి.”🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: