14, అక్టోబర్ 2023, శనివారం

మహాభారతములో - ఆది పర్వము* *ద్వితీయాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *23*


*సర్పయాగము*


*జనమేజయునకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమైయ్యాడు. కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అన్నారు. ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్విక్కులను రప్పించి సర్పయాగానికి ఏర్పాట్లు చేసాడు. ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో  సర్పయాగం మంచిదే కాని ఈ యాగం పూర్తికాదు. మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు. అయినా జనమేజయుడు ఆగకుండా సర్పయాగం ఆరంభించాడు.*


*యాగం మొదలైంది. పాములన్ని యాగంలోపడి మరణిస్తున్నాయి. తక్షకుడు ఇది చూసి కలత చెందాడు. ఇంద్రుని వద్దకు శరణు వేడాడు. ఇంద్రునికి బ్రహ్మ దేవుడు కొన్ని పాములకు అభయం ఇచ్చిన సంగతి తెలుసు. కనుక తక్షకా నీకేమి భయం లేదు అని చెప్పాడు. తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు అర్ధం చేసుకుని ఋత్విక్కులు ఇంద్రునితో సహా తక్షకుని యాగానికి ఆహ్వానిచారు. ఇంద్రుడు భయపడి  తక్షకా నీవు నీ దారిన వెళ్ళు. ఇక నేను నిన్ను రక్షించ లేను అన్నాడు. పెద్ద పాములన్నీ సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలితో అమ్మా పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి. ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఊంది. నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తీకుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. కనుక ఆస్తీకుని పంపి ఈ యాగాన్ని ఆపించు  అన్నాడు. అది విన్న జరత్కారువు ఆస్తీకుని పిలిచి "కుమారా నీ మేనమామ మాట విన్నావు కదా నీవు వెళ్ళి సర్పయాగాన్ని నిలుపు అని కోరింది.*


*ఆస్తీకుడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తీకుడు బయలు దేరి వెళ్ళి జనమేజయునితో జనమేజయా నీ పూర్వీకులైన రఘువు, మాంధాత, దశరధుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి అయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది. సర్వ శాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించ బడుతుంది. వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు. ఆ స్తుతికి సంతోష పడి జనమేజయుడు ఆస్తీకునితో మహాత్మా ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు.  ఆస్తీకుడు జనమేజయా ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు అన్నాడు. గొప్ప తపస్వి అయిన ఆస్తీకుడు కోరాడు కనుక జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు. ఆస్తీకుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు.*

కామెంట్‌లు లేవు: