31, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీధరరావు, ప్రభావతి గార్ల అనుభూతి..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*శ్రీధరరావు, ప్రభావతి గార్ల అనుభూతి..*


*(పదమూడవ రోజు)*


శ్రీ స్వామివారు తన తపోసాధనకు భూమి కావాలని అడగటం..ఆపై అందుగురించి వివరణ ఇవ్వటం అయిన తరువాత ..శ్రీధరరావు దంపతులు "దైవ నిర్ణయం ఎలా వుంటే..అలా జరుగుతుంది..మనం నిమిత్తమాత్రులం!.." అని ఒక నిర్ణయానికి వచ్చేసారు..


శ్రీధరరావు గారి అన్నయ్య కూతురు "కుమారి" మొగలిచెర్ల కు వచ్చింది..కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి..దేవుడూ.. సాధువులు అంటే ఆట్టే నమ్మకం లేకుండా.."మీదంతా చాదస్తం పిన్నమ్మా..అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూవుంటారు" అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది..ప్రభావతి గారికేమో..ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండ లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించాలని..వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలనీ కోరిక..మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకున్నది.. కానీ ఒక షరతు పెట్టింది..మధ్యాహ్నం రెండు గంటల లోపు తిరిగి వచ్చేయాలనీ..తాను సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోవాలనీ నూ..ప్రభావతి గారు "సరే తల్లీ..ఉదయాన్నే ఎడ్ల బండి కట్టిస్తాము..బయలుదేరి వెళ్లి వద్దాము.." అన్నారు..


ప్రభావతి గారు శనివారం తెల్లవారుఝామున లేచి, తమకూ బండితోలే మనిషికి మరో పదిమంది కి సరిపోయేటట్లు గా పులిహోర, దద్దోజనం తయారు చేసుకుని, బండిలో సర్ది.. కొద్దిసేపటిలో బైలుదేరాలని అనుకుంటున్నంతలో..ఒక్కసారిగా మబ్బులు క్రమ్ముకొచ్చి..కుంభవృష్టి కురవసాగింది..బండి వాడు, గబ గబా ఎద్దులను విప్పేసి, కొష్టం లోకి తోలుకెళ్లి పోయాడు..


"పిన్నమ్మా!..ఎక్కడ మీ దేవుడు?..ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం?.." అంటూ కుమారి ఆట పట్టిస్తోంది..శ్రీధరరావు గారు కూడా "ఈ వానలో మనం వెళ్లలేము ప్రభావతీ.." అన్నారు..ప్రభావతి గారు హతాసులయ్యారు.. ఆవిడ మనసులో ఒకటే బాధ.."స్వామీ..నీ ఉన్నావన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే..ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది..సాధువులను.. బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు..అసలు దైవాన్నే నమ్మకపోతే..మనలను మనమే మోసగించుకోవటం అవుతుంది.." అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గది లోకి వెళ్లి..(ప్రత్యేకంగా వారింట్లో దేవుడి గది ఉంది) ఆ లక్ష్మీనారసింహుడిని ప్రార్ధిస్తూ కూర్చున్నారు..


ఇంతలో..వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది..రెండు నిమిషాల తరువాత శ్రీధరరావు గారు గబ గబా దేవుడి గది దగ్గరకు వచ్చి.."ప్రభావతీ!..ప్రభావతీ!.." అని పిలిచారు..ఆవిడ లేచి రాగానే.."కందుకూరు నుంచి అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు దంపత్సమేతంగా వచ్చారు..వాళ్ళు మాలకొండ లో దర్శనం చేసుకుని..మనలను చూసి వెళదామని వచ్చారు.." అన్నారు..ఈలోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేసారు..కొద్దిసేపు మాటాడుకున్న తరువాత, శ్రీధరరావు గారు మాటల్లో..తాముకూడా మాలకొండ వెళదామని అనుకోవడం, ఈ వర్షం వల్ల ఆగిపోవడం.. చెప్పేసారు..ఆ దంపతులిద్దరూ వెంటనే.."మా జీపులో వెళ్ళిరండి..మేమిక్కడ రెస్ట్ తీసుకుంటాము.." అని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను, కుమారి ని కూడా జీపెక్కించేశారు..ఒక్కక్షణం ప్రభావతి గారి కళ్ళముందు నవ్వుతున్న ఆ దేవుడు.. లక్ష్మీనృసింహుడు..కనిపించాడు..మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరారు..


కుమారి కి ఆశ్చర్యంగా ఉంది..దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్లీ మొదలవడం వింతగా ఉంది..ముగ్గురూ మాలకొండ చేరారు..వర్షం సన్నగా పడుతూనే ఉంది..కొండమీద నుంచి జాలువారుతున్న నీటి పాయలు.. కొండచుట్టూ అలుముకున్న మబ్బులు..మెట్ల మీది నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు..ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి..ఆ కొండమీద లక్ష్మీ నృసింహుడి దర్శనం కాగానే..ఒక విధమైన ఉద్వేగంతో.."పిన్నమ్మా..చిన్నాన్నా.. దైవం వున్నాడు..నేనీ క్షణాన చూస్తున్నాను..నిజంగా ఇది దైవ సంకల్పమే.."అన్నది..ముగ్గురూ శివాలయం వద్దకు వచ్చారు.."ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్నా.." అన్నది..


"కష్టం తల్లీ..బహుశా ఆయన ఈ సమయం లో కిందకు దిగిరారు..మనం ఆ పైనున్న గుహల వద్దకు వెళ్లలేము..ఈ వర్షం లో బండల మీద జారుతుంది.." అని నచ్చచెప్పబోతున్నారు...ఇంతలో..


ఆ వర్షంలో..తలపైనుండి నీళ్లు జాలువారుతూ..ముడివీడిన జుట్టు , పాయలుగా విడిపోయి..తెల్లటి శరీరఛాయతో..శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగివస్తున్నారు.. సాక్షాత్తూ పరమశివుడి లాగా గోచరిస్తున్నారు..శ్రీధరరావు దంపతులు అప్రయత్నంగా చేతులెత్తి మొక్కారు..ప్రక్కనే ఉన్న కుమారి..కూడా నమస్కారం చేసింది..శ్రీ స్వామివారు వీళ్ల దగ్గరకొచ్చి.."ఇంత శ్రమపడి రావాలా?.." అన్నారు..ఈ లోపలే కుమారి స్వామికి వారికి మళ్లీ ప్రణమిల్లింది..చేయెత్తి ఆశీర్వదించారు.."మరో వారం రండి!..మనం మాట్లాడుకుందాము.." అన్నారు స్వామివారు..ముగ్గురూ మౌనంగా తలూపి..వెనక్కు వచ్చేసారు..


తిరుగుప్రయాణంలో , జీపులో..కుమారి తన భావోద్వేగాన్ని అణుచుకోలేక పోయింది.."పిన్నమ్మా..మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను..దైవాన్ని దగ్గరగా చూసాను..భవిష్యత్ లో కూడా మీరెలా చెపితే అలా వింటాను..నా వివాహ విషయం లో కూడా..!" అన్నది..శ్రీధరరావు ప్రభావతి గార్లు ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామికి, తపోసాధన లో మునిగిపోయివున్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు..


శ్రీ స్వామివారి సోదరుడు.. పద్మయ్య..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: