7, నవంబర్ 2023, మంగళవారం

 బ్రాహ్మీ మూర్తి! విశ్వనాధ!!


శ్రీ వాడపల్లి రామమోహనరావుగారు.సాహితి సౌజన్యంతో.


విశ్వనాథవారిని బ్రాహ్మీమూర్తి అని పండిత లోకం కీర్తించింది. ఈ బ్రాహ్మీమూర్తిమత్వం విశ్వనాథకు కేవలం సంస్కృతాంధ్ర సారస్వతాలలో ఆయనకున్న గొప్ప అభినివేశానికి సంబంధించినది మాత్రమే కాదు.ఆయనలోని ఆలోచనావిధానం పరిపక్వస్థితిని గాంచి రసాలూరుతూ పరిమళాలు వెదజల్లే, భావసమాహారంగా వెలువడిన ఆయన రచనలలో కనబడే  తానెంచుకున్న వస్తువు యొక్క ఔన్నత్యం,భావౌన్నత్యం,భాషా ప్రౌఢిమ ఇవన్నీ కలిసిన ఒకానొక మేలుకలయికగా నిలచిన ఒక మహాతత్త్వం అనిపిస్తుంది. ఇంకా ఆలోచించి చూస్తే అది మాత్రమే కాదేమో అని మళ్ళీ! ఇదంతా ఆయన పూర్వజులనుంచి వచ్చిన మహాసంస్కార ఫలం. ఆయన గురువుల నుంచి నేర్చిన 'సదసద్వివేక చతురత.'  తన తండ్రిగారు శోభనాద్రిస్వామి పిలిచి  అబ్బాయీ!

  "వ్రాసిన రామచంద్రు కధ వ్రాసితివం చనిపించుకో..."

అన్న తండ్రి యాజ్ఞ యును, జీవుని వేదన - ఈ రెండూ కలిసి ఆయనకు సారస్వతాభినివేశమూ,భావౌన్నత్యమూ ఇచ్చేయి. రామాయణ కల్పవృక్ష రచనకు పురికొల్పాయి సరే. కాని ఇక్కడ జీవుని వేదన అన్నది ఇంకా పరిశీలన చేయాల్సి ఉందేమో. ఈ జీవుని వేదన ఇంతటితో ఆగిందా!లేదనిపిస్తుంది. వేదవర్గీకరణ,అష్ఠాదశ పురాణాలు,మహాభారత రచన ఇన్ని చేసిన వ్యాస మహర్షికి జీవుని వేదన శాంతించలేదు. నారదుణ్ణి రప్పించుకుంది.నారదుని సలహా మీద శ్రీమద్భాగవత రచన చేసినప్పుడు గాని ఆయన జీవుడు శాంతించ లేదు. ఎన్నో చారిత్రక ఇతివృత్తాలను తీసుకుని వాటి ద్వారమున  ఉజ్వల ప్రాచీనభారత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు పురాణవైరగ్రంథమాల రూపంలో తెచ్చే బృహత్ప్రయత్నం చేశారు విశ్వనాథ. తన కిష్టమైన వైదిక జీవనవిధానానికి సంబంధించిన ఎన్నో ఇతివృత్తాలను చేపట్టి తత్త్వం,తర్కం అనే రెండు పంచకళ్యాణులను పూన్చిన తన రచనారధాన్ని నడిపారు.జీవితంలోని గహనమైన దుఃఖాలను తవ్వుకుని తవ్వుకుని రచనలు చేశారు. వీటివల్ల జీవుని వేదన పెరిగిందే గాని తరుగ లేదు. ఓ పక్క రామాయణ రచన సాగుతూనే ఉంది. మరో పక్క ఆ జీవుని వేదన పెరుగుతూనే ఉంది.


    మొన్నటి వ్యాసంలో తన కావ్యానంద ప్రధమ ముద్రణ 1972 లో జరిగిందని వ్రాశాను. అంటే అప్పటికి కావ్యానందము రచన ప్రారంభించి సంవత్సరం పై మాటే. నిజానికి ఈ కావ్యవిమర్శనా రచనలు నాలుగు భాగాలు. 

కావ్యానందము

కావ్యపరీమళము

సాహిత్య సురభి

సాహిత్యోపన్యాసములు.


ఈ నాలిగింటిలో కావ్యానందము మకుటాయమానమైన రచన. ఇతర రచనలన్నీ తన జీవితంలో ముందు సాగగా కావ్యానందము తన జీవుని వేదన పరాకాష్టనొందిన సమయానమ్మవారు తనలో చేరి రాయించినదనిపిస్తుంది.


    ఆయన తన కల్పవృక్ష అవతారికలో నన్నయతిక్కనలు తనను ఆవేశించారని రాశారు.కాదేమో!

     ఆయన వచనంలో కాని పద్యంలో కాని వాక్య విన్యాసం,పదాలను తన భావనలకనుగుణంగా సరిపోయేవి - అంటే తన భావనను యధాతధంగా దింపే పదాలను పొందుపరచి చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పేతీరు,ఆ భాష చూస్తుంటే - భాష మళ్ళీ గొప్ప గ్రాంధీకమో,వ్యాకరణపరిష్కృత శిష్టవ్యావహారికమో కూడా పూర్తిగా కాదు.చాలా మామూలు వ్యవహారశైలిలో ఉంటుంది. చెప్తున్నది ఆయన కాదేమో,ఆయన్ను ఆవేశించిన సరస్వతీదేవి చెప్తూంది అనిపిస్తుంది.ఇందులో ఏదో అతిశయోక్తిగా చెప్పాలన్న ఉద్దేశమేమీ లేదు. ఈ గ్రంథం, కావ్యానందం ఒక కథావస్తు సహితమైనది కాదు. కథాబలం వల్ల ఇష్టంగా చదవటానికి కావలసిన అంశాలిందులో లేనే లేవు.రాసిన ప్రతి వాక్యంలోనూ ఒక చంటిపిల్లవాణ్ణి కూర్చోపెట్టి అమ్మ ప్రేమ మీరగా చెప్పిన తీరు ద్యోతకమౌతుంది.కొన్ని కొన్ని వాక్యప్రయోగాలు ఆయనవి ఆనందం వల్లనా,దుఃఖం వల్లనా? ఎందుకు వస్తున్నాయి అన్నది తెలియనీయకుండా కన్నీళ్ళు తెప్పిస్తాయి.ఇది నిజం! ఆయన చేపట్టిన ఏ విషయాన్నైనా దాని మూలభావన నిరూపణకు ఆయన కొనసాగించే భావనాక్రమం,దానికోసం వాడే భాష - ఒకదానికోసం ఒకటి అన్నట్టు దర్శనం అవుతుంది. అది ఎంత ప్రేమాస్పదంగా ఉంది అనిపిస్తుంది.


   నిన్నటి వ్యాసంలో ఆఖరి పేరాలో ఆయన మాటలు చూడండి.."రెండువందల యేండ్లనుండి....పరిమిత సంఖ్యాకులయందైనా దాని యచ్చత్వం అది నిలబెట్టుకొనుచునే యున్నది...ఈ కొత్తమార్పును కూడ తట్టుకొన గలదు. కాని దైవమనుకూలించక...😢 ఈ వాక్యాలలో సారస్వతం ఒకదేవతామూర్తిగా ఆవిర్భవించిన వైనం కనబడుతుంది.ఆ దేవత కన్నీళ్ళు కారుస్తున్నట్టు...


      పోతనగారు. "కాటుక కంటినీరు చనుకట్టుపయిన్ బడ ఏల యేడ్చెదో..."అని ఓదారుస్తున్నప్పుడు శోకమూర్తియైన అమ్మవారు ఇక్కడ గోచరిస్తుంది. అక్కడ. "ఇమ్మనుజేశ్వరాధములకమ్మా" లని అనుకుంటున్నాడేమో అని ఆవిడ ఏడ్చింది.

ఇక్కడ నేరుగా తనను హత్య చేస్తారేమో అని ఏడుస్తూన్నట్టు అనిపిస్తుంది. ఐతే ఇక్కడ ఆవిడ దుఃఖ స్వరూపం వేరు. తను హత్యకు గురైతే తనను నమ్ముకున్న తన బిడ్డలగతేంటనే ఈవిడ దుఃఖం.నేను లేకపోతే మీరెలా బ్రతుకుతార్రా అబ్బాయీ! అన్న తల్లి వేదన. విశ్వ నాథవారి జీవుని వేదన పరాకాష్ట పొందినవేళ స్వయంగా అమ్మవారే వచ్చి తన జీవుని ఆవేశించి పలికించిన పలుకులు కావ్యానందం అనిపిస్తుంది. ఈ గ్రంథంలో ఆఖరు

 వ్యాసం "స్వయంభువు" అన్న శీర్షికన వ్రాసినది. ఇది చాలా ఉత్కంఠ కలిగించే చర్చ. దీనిగురించి మరోసారి వ్రాస్తాను. కాని ఈ వ్యాసం చివర శ్లోకం చూస్తే జీవుని వేదన పరాకాష్ట పొందిన మీదట అమ్మవారు జోకొడితే పొందిన శాంతి వల్ల చిన్నపిల్లవాడి నోటినుంచి వచ్చే '...ఊఊఊ...'అనే శబ్దాలవంటిదనిపిస్తుంది.

 "అర్చామీతి ధియా యదేవకుసుమం భిత్త్వాజనో ముచ్చతే

నధ్యామీతి.ధియా తదేవ వికిరన్ భస్మీకృతో మన్మథః

యశ్చాభ్యాంతర వృత్తి మాత్ర రసికో సాక్షాత్స్వయంభూ పుమాన్

సస్స్వామీ మమదైవతం తదితరో నామ్నా పినామ్నాయతే.


 అమ్మవారు జీవుని ఆవేశించి కొనిపోయి వృత్తి వృత్తిమాత్ర రసికుడైన పరమేశ్వర విభూతి స్వయంభువుగా ఇక్కడ ఆత్మలో ప్రతిష్ఠించుకున్న స్వామి ఎదుట నిలబెట్టింది. పరమశాంతిని పొందిన భావన!


అందుకే విశ్వనాథ బ్రాహ్మీమూర్తి!


                 🌺🙏🌺

కామెంట్‌లు లేవు: