19, నవంబర్ 2023, ఆదివారం

పురుషాంకారం

 బుడుగు - పురుషాంకారం - 


పురుషాంకారం ఈమధ్య పెరిగిపోతోందని మీటింగ్ లో లావుపాటి పక్కింటి పిన్నిగారి నేస్తులందరూ ఆడాళ్ళూ కలిసి చెప్పేసుకుని, స్టేజీ ఎక్కి మైక్ ముందు ఓ అని తెగ మాట్టాడేస్తున్నారు.


పురుషాంకారం-అంటే ఏంటో నాకు తెలీదు. ఏమో నేనేమైనా చిన్నవాన్నా చితక వాన్నా, నా అంత వాడిని నేను.

 


సరే కాస్త నాకంటే పెద్దాడు కదా అని మా నాన్న గోపాళాన్ని అడిగా. ఈ పురుషాంకారం అంటే ఏంటని? మరేం లేదు బుడుగూ- మగవాళ్ళు తామే గొప్పోళ్ళమనీ ఆడవాళ్లు అంటే మా రాధ లాంటి వాళ్ళు తమ మాటే వినాలని అనుకోడం అని టూకీగా చెప్పేసాడు. 


‘ఓహో !’ అనేసి వచ్చేసా నేను.కానీ అలాటి పురుషా0కారం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు అంటే నా బుఱ్ఱకు తెలీలేదసలు...అలా ఎవరైనా ఉంటారా అని నా అవమానం . అవమానం- అంటే  నాకు తెలీదనుకో. 


మా బామ్మ ఏంచెప్పినా అందరమూ వింటాము, లేదా అలా కుదరదు ఇలా చేద్దామని మా రాధ,  గోపాళం, బాబాయ్ చక్కగా చెబుతారు కదా మరి. అమ్మ నవ్వితే ఎంత బాగుంటుందో తెలుసా?మాట్టాడినా కూడా మా రాధ చాలా బాగుంటుంది,అసలమ్మకి కోపం రాదుకూడా. మా గోపాళం కూడా ఏమనడు కదా మా రాధని..


ఇంక మా లావుపాటి పక్కింటి పిన్ని గారి ముగుడు పిన్నిగారు చెప్పిందే వింటాడు వాడికి ఆవిడంటే చాల బయ్యం లే. నేనన్నా కూడా అంతులేని బయ్యము! 


వాడు అప్పుడెప్పుడో ఓసారి దొడ్డి గోడ వెనుక చుట్ట  తాగుతుంటే నేను చూసేసాగా...పిన్నిగారికి చెప్తానని బెదిరించా.


లావుపాటి పిన్ని గారికి

చెప్పొద్దని బ్రతిమాలుకుని కాణీ ఇచ్చాడా. అపుడపుడూ  

వాడి దగ్గర కాణీ, ముక్కాణీ తీసుకుంటుంటా ఇలా బెదిరించడాన్ని బ్లాక్ మెయిల్ అంటారట. మా బాబాయ్ అంటుంటే విన్నా . అదంటే నాకూ తెలియదు. ఒక్కో మారు నాకీ పెద్దవాళ్ళ మాటలస్సలు అర్దం కావు బాబూ....ఎక్కడైనా హౌరా మెయిల్ ఉంటుంది, మెడ్రాస్ వెళ్ళే మెయిల్ ఉంటుంది కానీ ఈ బ్లాక్ మెయిల్ ఏంటో నాకు అసలు తెలియదు!!!


ఆ ఇంతకీ ఏం చెప్తున్నాను? ఈ మధ్య పెద్దాడినైపోతున్నా కదూ గబుక్కున గ్యాపకం రావట్లేదు. ఆ పురుషాంకారం గురించి కదూ! 


ఇంకా అప్పుడెప్పుడో మేం మెడ్రాస్ వెళ్ళామా? మాదీ మెడ్రాసేలే ఓసారెళ్లి ఫదిరోలన్నాం కదా .

అప్పుడు రైల్ లో శశి కనబడింది కదా! దాని ముగుడూ ఎంత బాగా చూసుకున్నాడో శశిని. రైల్ ఆగగానే పరిగెత్తి వచ్చేసేవాడు.అప్పటికీ నేను చెప్పాను-: 


ఉరేయ్ శశి ముగుడూ నేను నీ శశిని బాగా చూసుకుంటా లే ..ఇలా అస్తమానూ పరిగెత్తి రాకూ” అని...అయినా వినడే నామాట- నేనేమన్నా చిన్నవాడినా చితకవాడినా?నా అంతవాడు నేడు లేడు..కానీ నా సంగతి వీళ్ళెవరికీ తెలీటం లేదసలు. లాభంలేదు గభాల్న పెద్దాడినైపోవాలి అనేసుకున్నాను.


అదన్నమాట ఈ పురుషాంకారం లేదు కానీ-స్త్రీ అంకారం మాత్రం బాగా కనిపిస్తోంది.ఎలాగంటే-మా ఇంట్లో అమ్మని అడిగే అన్నీ చేస్తారు. నన్ను మాత్తరం ప్రతీదానికీ వెధవా, బడుద్ధాయి అనేస్తారు ఘబుక్కున. నా అంత వాడిని అలా అనేస్తే నాకు ఎంత అనుమానం? ఒక్కోమారు సీగాన పెసూనాంబ ఎదురుగా కూడా అనేస్తుంటారు . అప్పుడు నాకు చాల ఖోపం వచ్చేస్తుంది కూడా. ఈ పెద్దాళ్ళున్నారే మనల్ని పెద్దగా చూడరసలు .


నాకూ, మా సీగాన పెసూనాంబకీ గొడవో, దెబ్బలాటో అయిందనుకో ఎప్పుడూ నన్ను సపోటా చేసే మాబామ్మ కూడా సీగానపెసూనాంబ కే సపోటా ఇచ్చేసి పాట్రీ మార్చేస్తుంది కూడా.


ఓసారేమైందంటే-వేసంగి సెలవులు కదా మా ఇంటి ముందు కిరికెట్టు అట అడుకుంటున్నాం. మొగ పిల్లలం ఆడుతాం రావోద్దంటే వినకుండా సీగానపెసూనాంబ కూడా ఆడటానికి వచ్చింది. అసలే కొత్తగా వేసిన తార్రోడ్డు మీద దబ్బున పడిపోయింది..


ఇంకేముంది పెద్దగా నోరెత్తి ఆ ఆ అని అరుస్తూ వెళ్తోంది-అప్పుడే బయటికొచ్చిన మా బామ్మ సీగానపెసూనాంబని చూసి ఇంటోకి తీసుకెళ్ళింది. 


కళ్ళు తుడిచి, ముణుకు కి తొక్క లేచిందని కడిగి మందు వేసింది. నేవెళ్లి చూసేసరికి తడిగుడ్డ కడుతోంది. సీగాన పెసూనాంబ ఏడుపాపింది కానీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అమ్మేమో పాలకోవా తినిపిస్తోంది. “ఆడపిల్లలకి అలాటి ఆటలేంటిరా వెధవకానా “అనేసింది మా బామ్మ. 


“వద్దంటే వినకుండా అదే వచ్చింది బామ్మా –“మొన్న మేము ఆడుతుంటే క్యాచ్ చెయ్యబోయి నా వేలికి బాల్ గట్టిగా తగిలింది ఎంత నొప్పెట్టిందో . అయినా ఏడవలేదు తెల్సా ఇంటో ఎవరికీ చెప్పలేదు కూడా -అన్నా...... “వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ లా-పాయింట్ లాగింది-“బామ్మ- బేటు గట్టిదా ? రోడ్డు గట్టిదా?” అంటూ..


నేను చెప్తున్నా రోడ్డే గట్టిది అయితే?అని  అమ్మ. బామ్మా ముసిముసిగా నవ్వేసి –ఇంకా బోల్డు చాకిలేట్టులూ, కోవాబిళ్ళలూ ఇచ్చేసి సీగానపెసూనాంబని వాళ్ళింటికి దిగబెట్టేసింది మా రాధ. 


అవునూ- బేటు గట్టిదా ? రోడ్డు గట్టిదా?అని అన్దేమిటి? పాపం అదింకా ఎప్పుడు పెద్దదవుతుందో? ఏమన్నా అంటే- పురుషాoకారం అంటారెందుకు? అసలు ఆడపిల్లల్కే అంతా సపోటా చేస్తారు..ఏంటో ఇంకా నాకు తెలియని ఎన్నో విషయాలున్నాయన్నమాట!!

కామెంట్‌లు లేవు: