26, డిసెంబర్ 2023, మంగళవారం

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       1* సేవకులు మొదటిసారి నేరం చేస్తే, అది వారి తప్పు. రెండవ పర్యాయం కొనసాగిస్తే అది నీ తప్పు.         2* సప్త సముద్రాలలో పడి ప్రాణాలతో తిరిగి వచ్చినవాడిని చూసాం గానీ సప్త వ్యసనాలలో ఒక్క దానిలో పడి తేలినవాడిని ఇంతవరకు చూడలేదు. ఆ సప్తవ్యసనాలు ఏవంటే 1 స్త్రీ 2 జూదం 3 మద్యపానం 4 వేట 5 వాక్పారుష్యం 6 కఠిన దండన 7 ధనాన్ని వృధా చెయ్యడం.                           4* మబ్బులు బాగా కమ్మి వర్షం రాకడ సంకేతంగా ఆకాశంలో మెరుపు తీగ వెలుగులు విరజిమ్ముతుంది. డబ్బుతోటో, అధికారం లేదా పదవి ద్వారా వచ్చే గౌరవమర్యాదలు మెరుపు తీగల్లాంటివి. మేథస్సు మరియు విద్యకు మాత్రమే శాశ్వత గౌరవమర్యాదలు లభిస్తాయి.                           3* మనిషి అనేవాడు ఈ ఏడింటినీ వదలుకుంటే ఉన్నతిని పొందగలడు. అవి వరుసగా సోమరితనం, గర్వం, చంచల స్వభావం, అనవసర ప్రసంగం, దురభిమానం, త్యాగభావం లేకపోవడం మరియు పెద్దల పట్ల వినయవిధేయతలు లేకుండటం.                          5* దైవం రెండు చేతులు ఎందుకిచ్చాడంటే ఒక దానితో కష్టపడి సంపాదించమని, రెండవదానితో త్యాగబుద్ధి తో దానధర్మాలు చెయ్యమని.                         6* విడువకూడని ఆరు సద్గుణాలు ఇవి. సత్యం, దానం, అసూయ చెందకుండా ఉండటం, కష్టాల్లో సహనం, ధైర్యం మరియు చురుకుగా ( సోమరితనం విడిచి) ఉండటం.                            7* సందేహం ఏర్పడినప్పుడు అడిగేవాడు ఆ క్షణం వరకు మూర్ఖుడే. అంగీకరిద్దాం. అసలు అడగటానికి జంకేవాడు జీవితాంతం మూర్ఖుడే!                                 8* సహనం సమస్త విజయాలకు తల్లివేరు. గుడ్డును నిర్ణీత కాలం వరకు వేచి చూసి కోడిపిల్లను పొందగలం గానీ త్వరపడి పగులగొట్టి కాదు కదా!                            9* ఒక సంవత్సరం లోనే కోటీశ్వరుడైపోవాలనుకొనే వ్యక్తి మూడు నెలల్లో కారాగారానికి గాని, ఆరు నెలల్లో ఉరిత్రాడు వద్దకు గానీ వెళ్ళడం ఖాయం.         10* వైదిక ఆచారం ప్రకారం "" శతమానం భవతి శతాయుః"" అనే మాట వాస్తవమే! మనమే ఈ దిగువ పనులతో మన ఆయుష్షుకు కత్తెరలు వేసుకొంటున్నాం. అవి వరుసగా అతిగర్వం, అతిగా వాగడం, పాపాలు చెయ్యడం, మిక్కుటమైన కోపం, వ్యక్తిగత స్వార్థం, పరదూషణ మరియు మిత్రద్రోహం.                        ( సాధనమున పనులు సమకూరు ధరలోన.--- యోగి వేమన.)                     తేది 23--12--2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: