23, డిసెంబర్ 2023, శనివారం

వైకుంఠ ఏకాదశి

 🙏🙏🙏 *వైకుంఠ ఏకాదశి* 🙏🙏🙏


          వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణుని దర్శనానికి ఉత్తర ద్వారములోనికి ప్రవేశించేటప్పుడు పఠించవలసిన శ్లోకము 👇


*ప్రళయాబ్ధిజలే శాయిన్ మధుకైటభ సేవితా ప్రార్ధితంతు ఉత్సవం తాభ్యాం కర్తుమారభే అనుజ్ఞాందేహి దేవేశా వైకంఠాలయ భూషణ* ll


          ఏకాదశి అంటే పదకొండు సమూహం. ఈ పదకొండు వైకుంఠం కావాలి, మరి దేని తోటి కొట్టబడకూడదు. ఈ పదకొండు పరమాత్మయందే ఉండడం వైకుంఠ ఏకాదశి. పదకొండు స్వామి సేవకు ఉపయోగించడం ఉత్తర ద్వార దర్శనం. స్వామిని చూడాలని అనుకున్న వారు ఒక్క కనులు పరమాత్మ వైపు ప్రసరింప చేస్తే చాలు, వినాలి అనుకున్న వారు చెవులు అప్పగిస్తే చాలు, అనాలి అనుకున్న వారు నాలుకతో కీర్తిస్తే చాలు, ఉండాలి అనుకున్న వారి శరీరం ఉంటే సరిపోతుంది తక్కినవి ఎక్కడ ఉన్నా కోరిక నెరవేరుతుంది. కానీ అన్ని వేళలా అన్ని విధములా కైంకర్యములు నీకే చేయాలి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు పదకొండూ పరమాత్మ యందు పరిపూర్ణంగా అర్పించాలంటే ప్రేమతో నిండిన జ్ఞానం కావాలి అదే ఉత్తర ద్వారం. దాని నుంచి దర్శనం పరమాత్మ అంతరంగిక కైంకర్యం. అంతేకాని ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయంలోకి వెళ్లి ఉత్తర ద్వారంతో ప్రవేశించి స్వామిని దర్శించుకుని రావడం సాంప్రదాయం అవుతుంది కానీ పరమభక్తితో కూడుకున్న పరమజ్ఞానం కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికైనా, ఇలా ఎందుకు చేయాలి ఇందులో అంతరార్ధం ఏమిటన్న జిజ్ఞాస కలుగుతుందనే పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆంతర్యం తెలుసుకుని శరీరంలో అణువణువూ, మనసు, అంతఃకరణం ఇలా అన్ని పరమాత్మకు సరమర్పించడమే నిజమైన ఉత్తర ద్వార దర్శనం.


*ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి* ?


          అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


          ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.


*సర్వేజనాః సుఖినో భవన్తు!*

కామెంట్‌లు లేవు: