16, డిసెంబర్ 2023, శనివారం

మొదటిరోజు పాశురం*

*తిరుప్పావై మొదటిరోజు పాశురం*

🕉🌞🌏🌙🌟🚩

🕉🌞🌏🌙🌟🚩 


*1.పాశురము*

*ॐॐॐॐॐॐॐॐॐ*


    మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

    నారాయణనే నమక్కే పఱై దరువాన్

    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !


భావము :-


 సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


        తిరుప్పావైగీతమాలిక


    అవతారిక:


వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భగవత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.


    1వ మాలిక


        (రేగుప్తి రాగము -ఆదితాళము)


ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. చ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీరాడరండి.


🕉🌞🌎🌙🌟🚩


ఇది మార్గశిరమాసము. వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణాలుగల పడుచులారా ! ఈ మార్గశిర స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధముగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడను, అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడను, ఎర్ర తామరులను పోలిన కన్నులు కలవాడును, సూర్యునివలే ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే, మనసు ఉపేక్షించు వ్రాతసాధనమగు 'పర' అను వాద్యమును ఈయనున్నాడు. మనము ఈ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు, మీరు అందరూ వచ్చి, ఈ వ్రతములో చేరండి.                     

అవతారిక

గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలమగు కాలము మనకు లభించినదే అని, ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి, తాము పొందదగిన ఫలమేమో, దానిని పొందించు సాధనామేమో స్మరించుచు ఈ పాశురమును పాడుచు ఆనందించు చున్నారు.


🕉🌞🌎🌙🌟🚩


 _*తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు*_


*భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం*


*పాశురము*


*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

    *నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

    *శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

    *కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

    *ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

    *కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

    *నారాయణనే నమక్కే పఱై దరువాన్*

    *పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*



*నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం*

   

*"మార్గళి త్తింగళ్"* మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. *"మది నిఱైంద నన్నాళాల్"*  చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కాబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం.  *"నీరాడ ప్పోదువీర్ పోదుమినో"* స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. *"నేరిళైయీర్"* భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 



*"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి"* పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని *"చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్"* సంపన్నులైన గోప పిల్లల్లా ,  మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.



ఏ భయమూ అవసరం లేదు. *"కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్"* పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ , ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా ! 



*"ఏరారుంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం"* మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. *"కార్మేని"* నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి , *"చ్చెంగణ్ "* వాత్సల్యం కల్గినవాడు. *"కదిర్మదియం పోల్ ముగత్తాన్"* చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 


*"నారాయణనే నమక్కే పఱైతరువాన్"* నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా *"పారోర్ పుగళప్పడింద్"* ఫలం సాక్షాత్తు పరమాత్మే , ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.


*నారాయణ మంత్రం*



ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా , సాగరంలో జలానికి అంతంలేనట్టుగా , మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు.  ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా , అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం. 



ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి *"విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ".* విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది ,  ఎందుకు వ్యాపించి ఉంటాడని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది. 



నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం.  సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడదీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం.



  ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రీహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రీహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది.



అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలభ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలభ్యం లాంటి గుణాలు కల్గినవాడు.  జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను  జ్ఞానం కల్గి ఉంటాడు.  చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు.  దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యోగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది , తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది , ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. 


అన్ని గుణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది.  


ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి.  శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.


🕉🌞🌎🌙🌟🚩


(ఒకటవ పాశురం )


మార్గళి త్తింగళ్


సీ చెలికత్తెల పిలిచె చేరగా రమ్మంచు 

        మార్గశిరము యెంతొ మహిమ గలది 

పరవాద్య వ్రతమును పరుగున చేతము

       కంకణములు చేత  కదులుచుండ

అరుణ కిరణములు  ప్రభవించనీయక 

      స్నానమాడి మనము సాదరముగ 

భక్తితో పూజలు  శక్తిగా చేతము

          శ్రీపాద పద్మాల రేణు వగుచు 

కన్నయ్య మనలను కరుణతో చూచును 

     ముందుగా పూజించ మోద మందు 

గీ.  పిలుపు విన్నట్టి గోపికల్ ప్రేమమీర 

చేరుకోరమ్మ మాధవు సేవ కొరకు 

పురుష కారము వైభవ  మురిపె మంద

సరసిజాక్షు నోమును సలుపు కొనగ 

శ్రద్ధ భక్తిని కలిగించి బుద్ధి నిమ్ము

 శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!


🕉️🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: