16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

రథసప్తమీ

 *ॐ  16/02/ 2024 - రథసప్తమీ / శ్రీ సూర్య జయన్తీ_ 卐*

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


మాఘ శుద్ధ సప్తమి శ్రీ సూర్య జయంతి పర్వదినం.... దీనినే రథసప్తమి అని కూడా వ్యవహరిస్తారు....

ప్రభవ నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువు, మాఘ శుద్ధ సప్తమి ఆదివారం అశ్వినీ నక్షత్రం లో సూర్యుడు జన్మించినట్లు పురాణ వచనం...... 


సూర్య భగవానుడు సర్వదేవతా స్వరూపుడు.... నమస్కార ప్రియుడు.... ప్రతిరోజూ వేకువజామునే లేచి స్నానం చేసి సూర్యనమస్కారాలు ఆచరించినట్లయితే విశేషమైన ఆయురారోగ్యాలు కలుగుతాయి.....


మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు....


*_సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు...._*


*1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'*

*2. వైశాఖంలో అర్యముడు,*

*3. జ్యేష్టం-మిత్రుడు,*

*4. ఆషాఢం-వరుణుడు,*

*5. శ్రావణంలో ఇంద్రుడు,*

*6. భాద్రపదం-వివస్వంతుడు,*

*7. ఆశ్వయుజం-త్వష్ట్ర,*

*8. కార్తీకం-విష్ణువు,*

*9. మార్గశిరం- అంశుమంతుడు,*

*10. పుష్యం-భగుడు,*

*11. మాఘం-పూషుడు,*

*12. ఫాల్గుణం-పర్జన్యుడు,*


*ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.*


*సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది....*


*ఆ ఏడు గుర్రాల పేర్లు*

(సప్త ఛందస్సులు) 

*1. గాయత్రీ,*

*2. త్రిష్ణుప్,*

*3. అనుష్టుప్,*

*4. జగతీ,*

*5. పంక్తి,*

*6. బృహతి,*

*7. ఉష్ణిక్*


*వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.....*


తిథులలో సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు.....అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి.....

దీనికి సూర్యసప్తమి అని పేరు....


అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది?


అంటే...?


సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది....ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట....ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే..... సూర్యుని రథం మటుకు ఒకే చక్రం......నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు.... కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి....


దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి...... ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా....కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి.......ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు......సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.....


*రధ సప్తమి ఎలా చేయాలి?*


ఈ రోజున అరుణోదయకాలంలో స్నానికి ముందు


నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః । అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే ॥


అను శ్లోకాన్ని చదువుతూ సూర్యభగవానుడికి నమస్కరించ వలయును....


నేటి అరుణోదయ వేళలో జిల్లేడాకులు లేక చిక్కుడాకులు, లేక రేగుపళ్ళు తల పైనా, బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి.... 


1-సప్త సప్తి ప్రియే దేవి –సప్త లోకైక పూజితే,

సప్త జన్మార్జితం పాపం –హర సప్తమి సత్వరం.... 


2-లోల కిరాణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం,

సప్త జన్మ క్రుతైః పాపైః—ముక్తిర్భవతి తక్షణాత్..... 


 3-మాఘే మాసే సితే పక్షే –సప్తమీ కోటి భాస్కరా,

కుర్వాత్ స్నారార్ఘ్యం దానాభ్యాం–ఆయురారోగ్య సంపదః..... 


4-నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!


5-యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!


6-ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!


7-ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!


ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి...... 


౧. ఈ జన్మలో చేసిన, ౨. జన్మాంతరాలలో చేసిన, ౩. మనస్సుతో, ౪. మాటతో, ౫. శరీరంతో, ౬. తెలిసీ, ౭. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది..... 


స్నానం చేసిన తర్వాత, ఆరు బయట తులసి మొక్క దగ్గర చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి......ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.....


ఆవు పిడకలపై క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి..... ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి......పాలు పొంగుతున్నప్పుడు ‘’నమో సూర్య నారాయణ ‘’అంటూ నమస్కరించి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది..... ఆ క్షీరాన్నాన్ని సూర్యునికి నైవేద్యం పెట్టాలి. తర్వాత దీనినే ప్రసాదంగాకళ్ళకు అద్దుకొని అందరూ స్వీకరించి తినాలి.... 


జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి.....జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది... 


సూర్య దండకమో ఆదిత్య హృదయమో, చదువుకోవాలి. వస్తే అరుణ పారాయణం చేయాలి.... 


ఏ శ్లోకాలూ రాని వారు


1-ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర –దివాకర నమోస్తుతే


2-సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం –శ్వేతపత్ర (ఏక చక్ర )ధరం దేవం –తమ్ సూర్యం ప్రణమామ్యహం అని ‘’చదువుకోవచ్చు... 


రధ సప్తమినాడే ఆడవాళ్ళు కొత్త నోములు ప్రారంభిస్తుంటారు....దీనినే నోము పట్టటం అంటారు...


"సూర్యగ్రహణ తుల్యాతు శుక్లామాఘస్య సప్తమీ"


ఆ కారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది....తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది....


 ☀️ *_ఓం మిత్రాయ నమః_* ☀️


🌹 *_రథసప్తమి శుభాకాంక్షలు_* 🌹


🍁 *_లోకా సమస్తా సుఖినోభవన్తు_* 🍁

కామెంట్‌లు లేవు: