11, ఫిబ్రవరి 2024, ఆదివారం

భూసురుని దౌత్యంబు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *86వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*భూసురుని దౌత్యంబు* 


వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు. దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు. ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.” 

ఇలా పలికి, రాజుల విన్నపాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి ఈవిధంగా చెప్పసాగాడు. “శ్రీకృష్ణా! ఓ భక్తవత్సల! దుష్ట రాక్షసేంద్ర సంహార! బ్రహ్మ మహేశ్వర దేవేంద్రాది వందిత పాదసరోజా! సకలలోకులచే కీర్తింపబడే మహాప్రభావశాలి! సంసారవిదూరా! నందకుమారా! లక్ష్మీనాథా! మాధవా! అవధరించు...ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ములను కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు. ఓ అనంతా! అభవా! కృష్ణా! బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికీ; బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ; నీవు ప్రతీ యుగంలోనూ భూమిమీద అవతరిస్తూ ఉంటావు కదా. ఓ కృష్ణా! ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. పరమేశ్వరా! ముల్లోకాలకు శుభం కలిగించువాడ! భక్తజన కల్పవృక్షమా! దీనులైన మమ్మల్ని కాపాడు. ఓ లక్ష్మీనాథ! శ్రీకృష్ణా! నీ ఆజ్ఞ ఉల్లంఘించటం ఆ బ్రహ్మాది దేవతలకు సైతం సాధ్యం కాదు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు. దుఃఖనాశకుడా! శ్రీకృష్ణా! పుట్టుకే లేని నీవు దేవాధిదేవుడవు ఇలా లోకంలో అవతరించడం మావంటి భయపీడితులను రక్షించుటకే కదా. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. అయినా, వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోడంలేదు. మదపుటేనుగులను అరికట్టి విఱ్ఱవీగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో.... (విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేసాడు.)


 ధర్మజు రాజసూయారంభంబు 


శరశ్చంద్ర చంద్రికలాంటి శరీరకాంతులతో శిఖముడిలోని కెంపు కాంతుల పంతమాడుతుండగా; శరత్కాలమేఘం మీది మెరపుతీగలాగ తెల్లని దేహం మీద బంగారుమొలత్రాడు ప్రకాశిస్తుండగా; నిండుచంద్రునిలోని మచ్చలాగ నిండు దేహంపై జింకచర్మం విలసిల్లుతుండగా; కల్పవృక్షము కొమ్మకు ఉన్న పుష్పగుచ్ఛాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతుండగా; పుణ్యనదీజలాలతో నిండిన కమండలం మరొక చేతిలో విరాజిల్లుతుండగా; తెల్లని జందెం మెడలో మెరుస్తుండగా; నారదమహర్షి నందనందనుడి దగ్గరకు విచ్చేసాడు. ఈలాగున తన దేహకాంతులతో దిక్కులను వెలిగిస్తూ దివినుండి దిగివచ్చిన సూర్యునిలా నారదముని వచ్చాడు. కృష్ణుడు తక్కిన యాదవులు అందరూ సాదరంగా లేచి నిలబడ్డారు. ఆ మురాంతకుడైన శ్రీకృష్ణుడు నారదుడికి వినయంగా నమస్కరించాడు. బంగారుసింహాసనం ఆసీనుడిని చేసాడు. తగిన గౌరవమర్యాదలతో పూజించి ఇలా అన్నాడు."ఓ మునీంద్రా! నారదా! ఎక్కడనుండి ఇక్కడికి విచ్చేశారు. సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి....పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి” అని శ్రీకృష్ణుడు అడిగాడు. నారదుడు చేతులు జోడించి భక్తితో ఇలా విన్నవించాడు. “శ్రీకృష్ణభగవాన్! నీవు జగత్తు సృష్టించేవాడవు; మాయా మయుడవు; సర్వకార్యాలూ నిర్వర్తించే శక్తి సంపన్నుడవు. అరణికఱ్ఱలో అగ్ని అంతర్లీనంగా ప్రకాశించే రీతిన నీవు ప్రవర్తిస్తుంటావు. గుర్తింపసాధ్యంకాని నీ అశేషమాయా విశేషాలను ఎన్నోమార్లు కన్నాను. నీ సంకల్పంతోటే ఈ ప్రపంచం పుడుతుంది. నీకు లోబడి ఉంటుంది. ఈ లోకంలో నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ప్రమాణమూలంగాతోచే పదార్థాలన్నీ నీ రూపాలే. నీ రూపం ముక్తిసాధనరహస్యం తెలుసుకోలేక సంసారంలోపడి మాయాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని సముద్ధరించడానికి సమర్థమైనది. నీ దివ్యలీలావతారాల కీర్తిని ప్రదీప్తం జేస్తూ ముక్తిమార్గాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా.” అని నారదుడు తిరిగి ఇలా అన్నాడు. “ఓ కృష్ణమహాప్రభు! కమలాక్షా! నీకు తెలియనిది ఏమీ లేకపోయినా, ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయయాగం చేయబోతున్నాడు.


పరికించి చూస్తే, భక్తవత్సలుడవూ; పరమపురుషుడవూ; రక్షకుడవూ; యజ్ఞభోక్తవూ; ఫలప్రదాతవూ; ఆత్మబంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి. అయినా అతడు యజ్ఞంచేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. నీ మేనబావ ధర్మజుడు. ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది. ఓ కలువల వంటి కన్నులున్న కన్నయ్యా! విశ్వజ్యోతీ! నీ నామస్మరణం చేసినా, విన్నా పాపాలు అన్నీ తొలగిపోతాయి. నీ దర్శనమాత్రం చేతనే భక్తలకు ఇహపరసౌఖ్యాలు సంసిద్ధిస్తాయి. శ్రీకృష్ణా! నీ కీర్తిదిగంతాలను ప్రకాశింపచేస్తుంది. నీ పాదాలనుండి ప్రభవించిన పవిత్రజలం పాతాళంలో భోగవతి అనే పేరుతోనూ, భూలోకంలో గంగానదీ రూపంతోనూ, స్వర్గంలో మందాకినీ నామంతోనూ ప్రవహిస్తూ ముల్లోకాలలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. ధర్మరాజు చేసే యజ్ఞ సందర్భంగా భూమండలంమీద ఉన్న మహారాజులు మునీశ్వరులూ అందరూ నీ మహామహిమను దర్శించి ధన్యులు అవుతారు.”ఇలా పలికిన నారదుడి మాటలు వినిన శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు...

“వివేక, వాక్చాతుర్యాలు కల ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఓ పుణ్యాత్ముడా! నీవు మాకు మంత్రాంగము చెప్పువాడవు. ఇప్పుడు మనం చేయవలసిన, చేయతగిన కార్యాన్ని వెల్లడించు. నీవు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను.”ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. చిత్తగించండి నారదుడు చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం ఆవశ్యం కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. ఆ సమయంలో.....స్వచ్ఛముగా రచింపబడిన తళతళ ప్రకాశించే గరుడధ్వజంతోనూ దిగ్గజాలను సైతం బెగ్గడిల్ల చేసే బంగారు చక్రాలకు కట్టిన గంటల గణగణ శబ్దాలతోనూ మంచి వేగం కలిగిన మేఘపుష్పం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే నాలుగు గుఱ్ఱాలతోనూ ఉదయసూర్యుని కాంతిని ధిక్కరించే దిగంత విశ్రాంత కాంతులతోనూ విలసిల్లే రథాన్ని దారకుడు సిద్ధముచేసి తీసుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. ఆ సమయంలో శంఖ బాక తప్పెట నిస్సాణ మున్నగు వాద్యాల శబ్దాలు నలుదెసలా నిండాయి. ఉగ్రసేన మహారాజుకీ, అన్న బలరాముడికీ, గురువులకూ, పెద్దలు అందరికీ చెప్పి, ఆదరంతో వారు తనను సాగనంపగా చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు బయలుదేరాడు. వందిమాగధుల, సూతజనుల పొగడ్తలూ; బ్రాహ్మణుల ఆశీర్వాదాలూ అతిశయిస్తుండగా; పుర స్త్రీలు మేడలమీద నుంచి ముత్యాల అక్షతలు చల్లుతుండగా; శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు. ఇలా విలాసంగా వ్యాహాళిగా బయలుదేరిన శ్రీకృష్ణుడు ఫలపుష్పభరితమైన తీయని మామిడిచెట్లు మద్ధిచెట్లుతో అలరారే ఉద్యానవనాలలో విడిది చేసాడు. అలా శ్రీకృష్ణులవారు ప్రయాణమైన ఆ సమయంలో...శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు మకరందాలుచిందుతూ సుగంధాలు వెదజల్లుతున్న వికసించిన మందారపూల హారాలు ధరించి; పరిమళభరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మైపూతలు పూసుకుని; కంకణాలూ, కడియాలూ, ఉంగరాలూ, కుండలాలూ మున్నగు బంగారు ఆభరణాలు ధరించి; అంచులలో ముత్యాలు అలంకరించిన మెత్తని పట్టుచీరలు కట్టుకుని; అర్ధచంద్రబింబం వంటి నుదుట తిలకం పెట్టుకుని; ఎన్నో రకాల అలంకారాలతో నళినలోచనుని దగ్గరకు వచ్చారు. ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు. పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా (తోడు వస్తుండగా)...ఆవిధంగా దాసదాసీ జనాలు అందరూ గుఱ్ఱాలు, కంచర గాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో...నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు. బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడ శ్రీకృష్ణునిచే అభయప్రధానం అందుకుని, తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్ళి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోష పెట్టాడు.


అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి (ఇంద్రప్రస్థనగరానికి) బయలుదేరాడు. ఆ సమయంలో....మార్గమంతటా రత్నకంబళ్ళతో నిండిన పటకుటీరాలు విడిశాయి. వింజామరలూ విజయధ్వజాలూ విలసిల్లాయి. కిరీటాల నిగనిగలూ, వెల్లగొడుగుల ధగధగలూ. ఆయుధాల తళతళలూ సూర్యూడిని కప్పివేశాయి. మంగళవాద్యాల ధ్వనులు సముద్ర ఘోషాన్ని, తిమింగలాల ఘోషాన్ని అధిగమించాయి.ఈవిధంగా మురాసురసంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, కోటలనూ, జలాశయాలనూ, గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. 


పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట 


శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు.

ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. గట్టిగా కౌగలించుకుని పులకితశరీరుడై, ఆనందబాష్పాలు చెక్కిళ్ళను తడుపుతుండగా, ఆనందపారవశ్యంతో ధర్మజుడు ప్రపంచాన్ని మరచిపోయీడు. వాయుసుత, ఇంద్రసుతులైన భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకుని ఆనందించారు. మాద్రి పుత్రులు ఐన నకులసహదేవులు నళిననాభునికి నమస్కారం చేసారు. అటుపిమ్మట, శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకూ వందనం చేసి, వారు చేసిన పూజలకు సంతోషించాడు. కేకయ సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమతులు ఇచ్చాడు. అనంతరం చతురంగబలసమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి ప్రవేశించాడు. అలా పరమ వైభవంగా రాజమార్గము వెంట వెళుతున్న శ్రీకృష్ణుడిని నగరకాంతలు....అలా పురుషోత్తముడిని దర్శించడానికి పురస్త్రీలు మేడలపై గుమికూడారు. అర్థచంద్రునిమీద మబ్బులు క్రమ్ముకొన్నాయా అన్నట్లు నెన్నుదుటిమీద ముంగురులు మూగుతున్నాయి; బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళ మీద గంతులు వేస్తున్నాయి; పగడపుకాంతిని తిరస్కరించే దొండపండు అధరాల కాంతులు, చిరునవ్వులు వెన్నెలలతో సరసమాడుతున్నాయి; ఒకదానికొకటి ఒరుసుకుంటున్న ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో ఉబుకుతున్నాయి; సన్నని నడుములు వణుకుతున్నాయి నడచేటప్పుడు మెట్టెలూ అందెలూ గల్లుగల్లున మ్రోగుతున్నాయి; జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యంచేస్తున్నాయి; పైటలు జారిపోతున్నాయి. ఇలా మనోహరంగా బయలుదేరి, పౌరకాంతలు కృష్ణుడిని దర్శించాలనే కుతూహలంతో, ఒకరి నొకరు పిలుచుకుంటూ, పెద్దలూ ఇంటివారూ వద్దంటున్నా వినకుండా, ఎత్తైన మేడలు ఎక్కి, ముకుందుని దర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. పరీక్షిన్మహారాజా! “జగత్తునే కడుపులో ఉంచుకొనే ఈ దేవుడు, అవనిపై యశోదానందులకు ముద్దుల తనయుడు అయ్యాడు; బ్రహ్మాది దేవతలకుకూడా భావింప సాధ్యంకాని పరబ్రహ్మస్వరూపం, గోవులను పాలించే గొల్లపిల్లవాడు అయ్యాడు; వేదశాస్త్రాలు వెదకినా కనుగొనలేని ఘనుడు, వ్రేపల్లెలో రోటికి కట్టుబడ్డాడు; వేల్పులకు అమృతం పంచిన పరాత్పరుడు, వెన్నదొంగ అయ్యాడు; శ్రీమహాలక్ష్మికిసైతం మనసు ఇవ్వని భగవానుడు, గొల్లపడచుల హృదయాలను కొల్లగొట్టాడు” అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులు గూడి కృష్ణుడిని గురించి పరస్పరం ముచ్చటించుకున్నారు.అంతేకాకుండ....“గొల్లపిల్లలతో కలసి గొల్లపల్లెలో ఆడుకున్నాడు; చల్లలు అమ్ముకోటానికి వెళ్ళే గోపికాకాంతల కొంగులుపట్టి సరసాలాడాడు; ముద్దుపెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు; ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచిన గొల్లపడతుల అధరామృతం పానం చేసాడు; సమాధినిష్ఠలో మునిగి అష్టాంగయోగంలో ఉన్నయోగీశ్వరులకు కూడా కనబడని వేలుపు యాదవ కన్నెల పాలిటి కల్పవల్లి అయ్యాడు” అంటూ పద్మం వంటి మోములు గల ప్రమదలు కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రాలు చేశారు.

అలా పొగడుతూ ఆ కలువ కన్నుల కోమలులు మేడలమీద నిలుచుండి, తామరరేకులవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకొన్నారు. దానితో కలిగిన ఆనంద సాగరంలో మునకలు వేస్తూ, సంతోషంతో అతనిపై కీర్తనులు పాడుతూ, మందారపుష్పాలూ, లాజలూ చల్లారు. అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారుపళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు.


ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. ఓ రాజా! శ్రీకృష్ణుడు కూడ ధర్మరాజు ఏర్పాటు చేసిన సముచిత మర్యాదలకు సంతోషించి, అర్జునుడితో కలసి సరసవినోదవిహార కార్యక్రమాలతో కొన్నినెలలు సుఖంగా అక్కడ ఉన్నాడు. ఇలా శ్రీకృష్ణుడు హస్తినలో ఉన్న కాలంలో..


సశేషం🙏


*🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: