1, ఫిబ్రవరి 2024, గురువారం

భారతరత్న అవార్డు

 ఈ రోజు సుమన్ టీవీ చీరాల లో ఒక ఆసక్తికరమైన అంశం చూసాను. అది మిత్రులందరితో పంచుకోవాలనిపించింది.  


నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించ బడిన కర్పూరీ ఠాకూర్ నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడట. ఆయన బీహార్ ముఖ్య మంత్రిగా వుండగా, తదనంతర కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా ఐఏఎస్ అధికారిగా వుండి, కర్పూరీ ఠాకూర్ కు కార్యదర్శిగా పనిచేశాడట. ఆయన ఒకసారి కర్పూరీ ఠాకూర్ స్వగ్రామానికి వెళితే, ఆయన వుంటున్నది ఒక చిన్న పూరిగుడిసెలోనట. ముఖ్య మంత్రిగారి భార్య ఈయనకు కట్టెల పొయ్యి మీద టీ పెట్టి ఇస్తే, యస్వంత్ సిన్హా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయట.


కర్పూరీ ఠాకూర్ తండ్రి 85 ఏళ్ళ వయసులో కూడా తన కులవృత్తిని కొనసాగించేవాడట. ముఖ్య మంత్రి తండ్రయి వుండి, ఇంకా ఈ పనెందుకని ఎవరైనా అడిగితే, "మావాడు జులాయిగా తిరుగుతున్నాడు. నేను కూడా పని మానేస్తే, ఇల్లు ఎట్లా గడుస్తుంది" అనే వాడట ఆయన.


కర్పూరీ ఠాకూర్ ఒకసారి జయప్రకాష్ నారాయణ్ జయంతి కార్యక్రమానికి చిరిగిన చొక్కాతో వెళ్ళాడట. అది చూసిన చంద్రశేఖర్ "వీడికి చొక్కా కొనుక్కోవడానికి చందాలివ్వండి" అని ఎగతాళిగా అన్నాడట. కర్పూరీ ఠాకూర్ వెంటనే తన ముందు ఒక గుడ్డ పరుచుకొని కూర్చున్నాడట. వచ్చిన డబ్బులను సీ.యం. రిలీఫ్ ఫండుకు జమచేశాడట. 


ఇటువంటి మహానుభావుడిని వెతికి పట్టుకొని ప్రధాన మంత్రి, ఆయన చనిపోయిన 35 ఏళ్ళకు భారతరత్న ఇస్తుంటే, ప్రజాధనంతో బొజ్జలు పెంచుకొని, అచ్చుబోసిన ఆంబోతుల్లా తయారైన నేటి నాయకులు "ఇదంతా ఎలక్షన్ల స్టంటు" అంటూ తప్పు పట్టడాన్ని ఏమనాలి?  

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారిది కూడా ఇదే పరిస్థితి. ఇటువంటి విషయాలు చదువుతుంటే, మనసు ఆర్ద్రమౌతుంది కదా (సేకరణ)

కామెంట్‌లు లేవు: