21, ఫిబ్రవరి 2024, బుధవారం

మహానుభావులు

 బాగా ఆకలి వేస్తోంది. అప్పటికే మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యింది. ఇప్పట్లో సాపాటుకి ఏర్పాటు ఎక్కడా కనపడటం లేదు. సోఫాలో కూర్చున్నాను... ఇంతలో ఒక బొద్దుగా ఉన్న అబ్బాయి వచ్చాడు... "మా ఊర్లో కూడా ఇంతే తెలుసా నీకు, నన్ను ఎప్పటికీ ఎవరూ భోజనానికి పిలవరు. అసలు నేనొక్కడినే చాలు నందికేశుడి నోము పూర్తి చెయ్యడానికి. నువ్వూ నా బాపతేనా?" అని నాతో అన్నాడు. ఆ అబ్బాయి వెనకాలే చిలకమర్తి వారు వచ్చి, "ఒరేయ్ గణపతీ... ఇలా అందరి దగ్గరకూ వచ్చేసి నీ గోడు చెప్పుకోకురా" అని అన్నారు. ఆయన్ని చూస్తూ అలానే ఉండిపోయా.


ఇంతలో, "ఆకలిగా ఉందా? ఇదిగో, నీ కోసం బోలెడు తినుబండారాలు తెచ్చాను, ఇవి చూడు లడ్లు, జిలేబీలు..." అని, కాస్త నీలినయనాలతో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఒక పళ్ళెం పట్టుకొచ్చింది. అవి తిందామనుకునే లోపల, "అవి తినొద్దు... ఈ అమ్మాయి విషబాల, ఆమె తాకి ఇచ్చినవన్నీ విషపదార్థాలే" అని మరో అమ్మాయి చెప్పింది. ఇద్దరి వైపూ అలా చూస్తూ తినాలా వద్దా అనుకుంటుండగా... అడవి బాపిరాజు గారు వచ్చి, "హిమబిందూ... ఈ విషబాల ఇప్పుడు చంద్రబాల అయిపోయింది, ఇప్పుడు తన శరీరంలో విషం లేదు" అని అన్నారు.


సరే, ఆ చంద్రబాల తెచ్చినవి తిందామనుకునే లోపల, "ఆగు శ్యామా ఆగు!" అని వినిపించింది. ఎంత రంగు తక్కువైతే మాత్రం నన్ను 'శ్యామా' అని అంటాడా? అన్నది 'ఎవరా?' అని వెనక్కి తిరిగా, ఆరడుగుల పొడుగు పెద్ద శరీరంతో ఎస్.వి. రంగారావు లా ఉన్న వ్యక్తి.. అతను భూతనాథుడు... "ఆ పదార్థాలు మాయారాణి పంపినవేమో అని అనుమానంగా ఉంది" అని అన్నాడు. ఇంతలో కమిలినిని వెంటబెట్టుకొని భోలానాథ్... "మాయారాణి గోపాలసింహుడి చేతిలో చనిపోయిందిగా, ఇప్పుడు ఏ భయం లేదు" అని తన "మాయామయి" రహస్యాన్ని చెప్పాడు బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవితో కలిసి.


"మా గిరిక నాట్యం చూడటానికి రండి, వచ్చేవారం. భోజనాలు కూడా మా ఇంట్లోనే" అని ధర్మారావు వచ్చి చెప్పాడు. వెనకాల పెద్దాయన విశ్వనాథ వారు కూడా వచ్చారు... "అవును కొత్తావకాయలో మెరపకాయ ఆ పక్కన వెన్న ఉంటే ఇంక ఏ విందు భోజనం పని చేయదు" అంటూ. ఆవకాయ అనగానే ఆకలి ఎక్కువయ్యింది.


"మనము ప్రతిరోజూ భోజనంతో పాటు జంతికలు, చక్కిలాలు, పప్పుచెక్కలు, చిలగడదుంపలు తినాలి" అంటూ ఓ బొద్దుగా ఉన్న పిల్ల... అదే మన పొత్తూరి గారు వచ్చి చెప్పసాగారు. "నీకు తెలుసా, మా పూర్వికి మళ్ళీ పెళ్ళి చేద్దామనుకుంటున్నాము... నువ్వు రా, నీకు సున్నుండలు, బెల్లం మిఠాయి కూడా ఇస్తాను" అని చెప్పింది. ఇంతలో ఒక పెద్దావిడ... "నిన్ను స్కూల్ కి వెళ్ళమంటే ఇలా వచ్చావా?" అంటూ ఆ బొద్దు పిల్ల చెయ్యి పట్టుకున్నారు పెద్ద పొత్తూరి విజయలక్ష్మి గారు.


"మరి పెళ్ళికి లొట్టిపిట్టలు ఉంటాయా, భోజనాలకేం వండిస్తున్నారు?" అంటూ జడగంటలు తిప్పుకుంటూ వచ్చింది మధురవాణి. "కన్యాశుల్కమైనా, వరవిక్రయం అయినా నష్టపోయేది ఆడపిల్లలే" అని బాధపడ్డారు ఆవిడ వెనకాల ఉన్న గురజాడ.


"ఇదిగో ఈ పకోడి పొట్లం పట్టుకోవే... తినకు... నేనెల్లి లాచసుడి దగ్గర పదమూడో ఎక్కం చెప్పేసి వాడి నడ్డి మీద చంపేసి సీగానను తీసుకొచ్చేస్తా" అంటూ బుడుగు వచ్చాడు. వాడిచ్చిన పకోడి పొట్లం చూసి ఒకటి నోట్లో వేసుకుందామనుకునే లోపల, "వీడితో ఇదే కష్టం... ఒక్క చోట ఉండడు... కోతికొమ్మచ్చి ఆడేస్తాడు నీలాగా" అంటూ బుడుగుని వెతుకుంటూ బాపు, రవణలు.


"రోజూ ఇష్టంగా అష్టపదుల్లాంటి నా పాటాలు వింటావుగా, ఏ ఒక్కసారీ పొగడదండలతో పొగడాలనుకోవా? తీపి కోవాలాంటి పాటలు వినడమే కానీ సాహిత్యాన్ని, నన్ను పొగడాలను 'కోవా?' " అంటూ స్వీటూరి వేటూరిగారు కొమ్మకొమ్మకో సన్నాయిలాంటి పాటలందించి పాడమన్నారు.


"నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అని పెద్దాయన దేవరకొండ గట్టిగా అన్నాడు. "అంటే 'ప్రేమ' లో మా వేద సంహిత అంత అందమైన ఆడపిల్ల అన్న మాట" అని యండమూరి అన్నారు.


"నీకు ఆకలి ఎక్కువైతే పైత్యం ప్రకోపిస్తుంది... ఇదిగో ఈ ఉప్మా తిను" అంటూ అమ్మ నిద్ర లేపింది.

ఇంకొంచం సేపు ఆ నిద్రలో ఉంటే ఇంకెంత మంది మహానుభావులు కనపడేవారో!


(ఇంత రుచికరమైన పుస్తకాల విందు ఉండగా మరేది రుచించదు కదా.).


మిత్రులందరికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగులో వ్రాస్తున్నవారికి, తెలుగులో పాడుతున్నవారికి, తెలుగులో పోట్లాడుకుంటున్నవారందరికీ ప్రణామాలు.🙏🙏🙏

కామెంట్‌లు లేవు: