4, మార్చి 2024, సోమవారం

మహాశివరాత్రి పూజలు*

 *మహాశివరాత్రి పూజలు*


ఇంకొక వారమే ఉన్నది మహాశివరాత్రి పర్వదినాన్న ఈశ్వరుని పూజించడానికి. అంటే శోభకృత్ సంవత్సర మాఘ మాసంలో అనగా ఈ నెల మార్చి 8 న మహాశివరాత్రి వ్రతపూజను జరుపుకోబోతున్నాం. అసలు మహాశివరాత్రి ఎందుకు ఎలా ఏ సమయంలో ఆచరించాలన్నదాన్ని క్షుణ్ణంగా తెలుసుకొందాం. 


మీ అందరికి నేను చెప్పబోయే పురాణ కథ తెలిసేయుండగలదు. పూర్వము బ్రహ్మ విష్ణువుల మధ్యలో దేవతల్లో ఎవరు గొప్ప అని ఓ పెద్ద వాగ్వివాదం జరిగింది, నువ్వు నేను అని ఎడతెగక సాగింది. ఆ సమయాన్న భూమి నుండి దేద్దీప్యమానమైన ఓ వెలుగు పైకి విరజిమ్మింది. అది ఒక కోటి సూర్యకాంతులను మించి తన కిరణాలను ప్రసరింపజేసింది. తన ఆద్యంతమును వీక్షించినవారే సర్వశ్రేష్ఠమైన భగవంతుడిగా పరిగణింపబడతారు అన్న ఓ సవాలును విసిరింది. 


బ్రహ్మదేవుడు శిఖరాగ్రమును దర్శించుటకు ఉపక్రమించగా విష్ణువు అతల పాతాళమునకు చొచ్చుకొంటూ వెళ్ళి ఆ వెలుగు యొక్క అంతాన్ని చేధించడానికి బయలుదేరారు. కాని ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరికీ అంతు చిక్కని అయోమయ పరిస్థితి, ఇక చేసేదిలేక వెనుదిరిగారు. నా ఆద్యంతాల్ని కనుక్కున్నారా అని ఆ కాంతి కిరణం ప్రశ్నించడంతో విష్ణువు తన అసమర్థ్యాన్ని బహిరంగంగా అంగీకరించారు. కాని బ్రహ్మదేవుడు తన అశక్తతతను వెలిబుచ్చడానికి అహం అడ్డురావడంతో తను శిఖరాగ్రం దాకా వెళ్ళి కనుక్కోగలిగానని ప్రగల్భాలు పలికారు. 


వెనువెంటనే ఆ ప్రజ్వలించే వెలుగు నుండి ఈశ్వరుడు ఓ పెద్ద విస్ఫోటనంతో అండపిండ బ్రహ్మాండాలన్నీ దద్దరిల్లే విధంగా అర్ధరాత్రి సమయాన్న బయటకు విచ్చేసి (ఇదే మొట్టమొదటి లింగోద్భవం) తను అబద్ధాలు పలకడంతో పంచముఖ బ్రహ్మదేవుడి ఒక శిరస్సును ఖండించి చతుర్ముఖోన్నుడిగా గావించారు. విష్ణువు నిజాయితీకి సన్మానించారు. బ్రహ్మ విష్ణువులు ఈశ్వరుడికి ప్రణమిల్లి తానొక్కడే జగమంతటికి పరమాత్మయని అంగీకరించారు. 


ఇలాంటి లింగోద్భవం మాఘ మాస కృష్ణ చతుర్దశి నాడు అవిర్బవించడంతో ఆ మహా పర్వదినాన్ని జగత్తంతా మహాశివరాత్రిగా జరుపుకొను ఆనవాయితీ. ఈ మహాశివరాత్రి రోజునే ఈశ్వరుడు ఓ కోట్ల సూర్యుల కాంతులతో వెలుగుచిమ్మి అందరికీ తన దర్శన భాగ్యం కలిగించారు. అందువల్ల శివరాత్రి నాడు ఈశ్వరుడు మొట్టమొదటి సారిగా లింగాకారం నుండి ఆవిర్భవించి తన అసలు రూపాన్ని లోకానికి తెలియజేసారు. అదియును కాకుండా ఎవరైతే తనను ఇలాంటి పర్వదిన నడిరేయిన అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారినందరిని తప్పక అనుగ్రహించి వారి కోర్కెలెల్ల తీరుస్తానని దీవించారు. ఇప్పుడు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని ఏ విధంగా ఆచరించి ఈశ్వరుడికి ప్రీతిపాత్రులగుదుమో తెలుసుకొందాం. 


ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 న అంటే రాబోవు శుక్రవారమున రానున్నది. ఆ రోజు ఒక్క పూటనే అంటే మధ్యాహ్నం వేళ మాత్రమే భోజనం గావించి ఉపవాసానికి ఉపక్రమించాలి. ఆ నాటి సూర్యాస్తమన సమయాన్న స్నానమాచరించి పట్టు వస్త్రాలు ధరించి శివపూజకు కావలసిన సరంజామాను క్రోడీకరించుకొని అంటే శివలింగం లేదా ఈశ్వరుడి చిత్రపటము, పుష్పాలు, దీపాలు, పండ్లు, అగరబత్తులు, చందనకుంకుమ అక్షింతలు, కర్పూరాలను సమకూర్చుకొని పూజను మొదలుపెట్టవలెను. శివలింగం ఉన్నట్లయితే ఓ పీఠంపై ఉంచి అభిషేకానికి సన్నద్ధం కావలె. చిత్రపటము మాత్రమే ఉన్నట్లయితే అభిషేకం చేయలేము. కనుక తగురీతిన పుష్పాలతో అలంకరించవలె. 


మార్చి 8 న సూర్యాస్తమన కాలం నుండి మార్చి 9 ఉదయాన్న సూర్యుడు ఉదయించే సమయం దాకా ఈ శివరాత్రి పూజలు 4 మార్లు కొనసాగవలెను. దీనినే ప్రహర పూజ మరియు యమ పూజ అని అందురు. అది ఏంటో చూద్దాం. మార్చి 8 న సూర్యుడు 6.30 కు అస్తమించి మార్చి 9 న పెందరాళే 6.30 కు ఉదయించిన యెడల ఈ పండ్రెండు గంటల సమయం శివ పూజ చేయవలయును. ఈ 12 గంటలను 4 ప్రహరాలుగా విభజించినచో ఒక్కొక్క ప్రహరానికి 3 గంటల సమయం కేటాయించినట్టే కదా. ఒక్కొక్క ప్రహరంలో శివ పూజ కావించి తదుపరి ప్రహరంలో మరల పునఃప్రారంభించవలెను. అంటే మార్చి 8 న సాయంత్రం 6.30 నుండి 9.30 దాకా మొదటి ప్రహర పూజ గావించి రెండవ ప్రహర పూజ రాత్రి 9.30 నుండి 12.30 దాకా చేయవలెను. అలాగే 12.30 నుండి 3.30 దాకా మరియు 3.30 నుండి ఉదయం 6.30 దాకా. ఒక్కొక్క ప్రహరంలో పూజాభిషేకాదులు పూర్తిచేసి తదుపరి ప్రహర పూజను అలాగే కొనసాగించడానికి పూనుకోవలెను. అలా వేకువజామున 6.30 దాకా 4 సార్లు. గంధపు తైలం, పంచగవ్యం (అనగా పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఆవుపేడలతో తయారయినది), పంచామృతం, నెయ్యి, పాలు, పెరుగు, చెరకు రసాలు, పళ్ళరసాలు (అంటే ఆరెంజు, మౌసాంబి, నిమ్మకాయలతో తయారయినది), కొబ్బరి నీళ్ళు, చందనపూత, విభూతి మరియు స్వచ్ఛమైన జలాలతో అభిషేకాన్ని కొనసాగించవలెను. ఇవన్నియు సమకూరని పక్షంలో లభ్యమైన సామగ్రీలతో అభిషేకం చేయవలెను. 


ఒకవేళ శివలింగం కాకుండ ఈశ్వర చిత్రపటమే ఉన్నట్లయితే అభిషేకం చేయలేము కదా. అలాంటి సమయంలో ఈ సామగ్రీలనంతటిని చిత్రపటము ముందుంచి ఒక్కొక్క పుష్పముతో ఆయా సామాగ్రిన ముంచి దేవుని పటము ముందు ఉంచవలెను. పూజాభిషేకములు చేస్తున్నప్పుడు రుద్రచమకాలను పటించడం కాని లేదా ఏదైనా ఈశ్వర తత్త్వాలను బోధించే మంత్రాలు గాని పటించవచ్చు. ఇవన్నియు వీలుకాని యెడల కేవలం ఈశ్వర పంచాక్షరి అయినటువంటి ఓం నమశ్శివాయతో 108 సార్లు పూజచేయొచ్చు. లేదా ఇతరత్రా శివ అష్టోత్తరం శతనామావళి గాని సహస్ర నామావళిని గూడా పటించగలం. ప్రతి నామానికి బిల్వ దళాలతో గాని ఇతర పుష్పాలతో గాని పూజలు చేయగలం. ఆ తరువాత ధూపదీపనైవేద్యాలతో కొబ్బరి ఫలాలను సమర్పించి పూజను ముగించి ప్రసాదాన్ని అక్షింతలను సమర్పించగలం. ఇది మొత్తం ఒక్క సారి ఒక్క ప్రహర పూజ గురించి. ఇలా 4 సార్లు పొద్దున దాకా.


ఒక వేళ ఇలా నాలుగు ప్రహరాలలో పూజలు వీలుకాని యెడల కనీసం ఒక సారి అంటే లింగోద్భవ కాలంలో చేయగలం. లింగోద్భవ కాలం యన్నది ఈశ్వరుడు ఆ ప్రజ్వల కాంతి నుండి దర్శనం ఒసంగిన కాలమన్నట్టు. శివరాత్రి పర్వదినాన్న లింగోద్భవ కాలమన్నది అర్ధరాత్రము, ఆ సమయం ఆయా ఊర్లలో ఆసన్నమయ్యే సమయాన్ని గూగుల్ సౌజన్యంతో గాని దృక్పంచాంగం ద్వారా గాని తెలుసుకోగలం. ఈ సమయాన్నే ఈశ్వరుడు పృథ్వీన ప్రతి శివలింగం నందు ప్రతి చిత్రపటము నందు రూపందుకలడని ప్రతీతి. 

   

ఇది కూడా వీలుకాని పరిస్థితుల్లో ఆ సమయంలో ఈశ్వర దేవాలయాన్ని సందర్శించి వారి పూజల్లో పాలుపంచుకొని రాత్రంతయు జాగారం చేసి ప్రొద్దునే తమతమ స్వగృహాలకు వెనుదిరగగలం.


ఇలా కూడా వీలు కాని యెడల ఇంట్లోనే జాగారం చేసి రాత్రంతయు ఈశ్వర నామాలను గాని లింగాష్టక బిల్వాష్టకాలను గాని పటించవలెను. లేదా ఓం నమశ్శివాయ మంత్రం ఒక్కటే చాలన్నట్టు, శివరాత్రి వ్రత పూజను పూర్తిగా చేసి ఫలితాలను పొందినట్టే. 


మార్చి 9 న ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత ఉపవాసాన్ని విరమించగలం. రాత్రంతయు జాగారం చేయడం మాత్రం అత్యవసరం. మరుసటి రోజు అంటే మార్చి 9 న రాత్రి దాకా మరల కునుకు తీయరాదు. ఒకవేళ ఆరోజు కార్యాలయాలకు వెళ్ళవలసినట్లయితే మీరు సొంత వాహనాన్ని నడుపకుండా ప్రభుత్వ వాహనాలలో పయనించి తగు జాగ్రత్తలు తీసుకోవలెను. 

 

ఇవన్నియు పాటించి మహాశివరాత్రి పర్వదినాన్ని ఈశ్వర పూజలతోను జాగారంతోను గడిపి ఈశ్వరానుగ్రహం పొందగలరని ఆకాంక్షిస్తున్నాను.

కామెంట్‌లు లేవు: