26, ఏప్రిల్ 2024, శుక్రవారం

ఈశావాస్యోపనిషత్తు

 ఈశావాస్యోపనిషత్తు ఈక్రింది శాంతి మంత్రంతో ప్రారంభం అవుతుంది.


*ఓం పూర్ణమదః పూర్ణమిదం*

*పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే*

*పూర్ణస్య పూర్ణ మాదాయ*

*పూర్ణ మేవావ శిష్యతే II*


దీని అర్థం.

పూర్ణమ్ అంటే నిండుగా

అదః అంటే అది అంటే పరమాత్మ

పూర్ణమదః అంటే పరమాత్మ నిండుగా వున్నాడు అని అర్థం.

పూర్ణమ్ అంటే నిండుగా

ఇదం అంటే ఇది అంటే జీవాత్మ 

పూర్ణమిదం అంటే జీవాత్మ నిండుగా వున్నాడు.

పూర్ణాత్ అంటే ఒక నిండైన దాని నుంచి పూర్ణ అంటే ఇంకో నిండైనది

ఉదచ్యతే అంటే పుడుతున్నది. 

      పరమాత్మ నిండైనది. జీవాత్మ నిండైనది. పరమాత్మ లోనుంచి జీవాత్మ పుడుతున్నది.

పూర్ణస్య అంటే ఆ నిండైన దాని లోనుంచి పూర్ణమ్ అంటే నిండైన

ఆదాయ అంటే తీసి వేస్తే

పూర్ణమేవ అంటే ఆనిండైన వస్తువే

అవశిష్యతే అంటే మిగులుతుంది.


తాII నిండైన పరమాత్మ లోనుంచి ఎన్ని జీవాత్మల్ని తీసివేసినా పరమాత్మ తరిగిపోడు. అలాగే పరమాత్మలో ఎన్ని జీవాత్మలు కలిసినా పరమాత్మ పెరిగిపోడు. పరమాత్మ ఎప్పుడూ ఎప్పుడూ ఒకేలా నిండుగా వుంటాడు.


         తేలికగా అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే పరమాత్మ సున్నా అనుకుంటే సున్నాలోనుంచి ఎన్ని సున్నాలు తీసివేసినా సున్ననే మిగులుతుంది. అలాగే సున్నాకు ఎన్ని సున్నాలు కలిపినా సున్నానే మిగులుతుంది. అలాగే సున్నాను సున్నా బెట్టి హెచ్చవేసినా, భాగారించినా సున్నానే మిగులుతుంది. పరమాత్మ పూర్ణ స్వరూపుడు. ఆయనకు తరగడం, పెరగడం ఆంటూ ఏమి వుండవన్నది దీని అర్థం.

కామెంట్‌లు లేవు: