13, ఏప్రిల్ 2024, శనివారం

పంచాయతనం

 పంచాయతనం:


అనేక విధాలుగా ఉన్న మన ఆరాధనా పద్ధతులను అధ్యయనం చేసిన ఆదిశంకరులు ‘పంచ దేవతారాధన’ ను పునరుద్ధరించారు.


"ఆయతనం" అంటే ఆకారం. 

‘పంచాయతనం’ అనగా అయిదు ఆకారాలు గల పరమాత్మ. 

ఆ పరమాత్మ పేరు పంచాతనుడు. 

ఆయన పూజ పంచాయతన పూజ. 


ఆదిత్యం అంబికామ్ విష్ణుం గణనాథం మహేశ్వరం

పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం


ఆదిత్యం – సూర్యుడు,

అంబికా – అమ్మవారు,

విష్ణుం – మహావిష్ణువు

గణనాథం – గణపతి

మహేశ్వరం – ఈశ్వరుడు


ఈ ఐదుగురినీ పంచాయతన దేవతలని అంటారు. హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నాయి.


"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్” అన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. కర్మ సాక్షి. యావత్ సృష్టికీ శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి, ఓజస్వి. ఆయనను ఆరాధించడం ద్వారా ధృఢ ఆయురా రోగ్యాలను పొందుతారు.


సాహిశ్రీరమృతాసతాం* – అమ్మ వారిని మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ రూపములైన లలితాంబికగా ఆరాధించాలి. అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్ శుద్ధి, సంపద, భాగ్యం, త్రికాల దర్శనం, దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. వీటన్నింటి కన్నా అంతఃకరణ శుద్ధి కలిగి మానసిక పరిణతి పొందుతారు.


"మోక్షమిచ్చేత్ జనార్ధనాత్"అన్నారు


 మొక్షాన్నిచ్చే వాడు మహావిష్ణువు. విష్ణువు యొక్క దశావతారాలలో ప్రధానమైన మరియు సంపూర్ణావతారమైన శ్రీకృష్ణా వతారం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని అంటారు. ఆయన ఆవిర్భావం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. 


అనగా, శిష్టులను రక్షించడం అంటే కేవలం దుష్టుల నుండి కాపాడడమే కాక పతనమయ్యే మార్గం నుంచి వారిని రక్షించి మోక్షమార్గాన్ని ఉపదేశించే భగవద్గీతా శాస్త్రాన్ని మానవ జాతికి ప్రసాదించాడు.


"ఆద్యౌపూజ్యో గణాధిప"అన్నారు


ఏ కార్యమును ప్రారంభించినా మొదటగా పూజించబడేది గణపతే. మహా గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా యోగసాధనకు ఉపకరిస్తుంది. దీనివలన సాధనలో ప్రతిబంధకములు తొలగడమే కాకుండా ఐహిక, ఆముష్మిక వాంచలు కూడా నెరవేరుతాయి.


"ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్"అన్నారు.


ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్షు వృద్ధి పొంది, సకలైశ్వర్యాలూ సంప్రాప్త మౌతాయి. రుద్రాభిషేకాలు, రుద్రజపం మొదలగు వాటి వాళ్ళ సమస్త దుఃఖాలు నివారణ కలిగి, గ్రహ బాధలు తొలగి స్వాంతన, ఐశ్వర్యసిద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.


ఈ పంచాయతనంలో ఏయే దేవతలు ఏయే దిశల్లో ఉండాలంటే ఈశాన్యంలో, విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యుడు(అగ్ని), నైరుతిలో గణపతి, వాయువ్యంలో అంబికను(అమ్మవారిని) ఉంచి, మధ్యలో శివుడిని ఉంచి చేసే పూజకి "శివ పంచాయతనం " అని పేరు.


ఇంకా వివరంగా చెప్పాలంటే, ఈ అయిదుగురి దేవతలలోను, ఏ దేవతని మధ్యలో ప్రధానంగా ఉంచి పూజ చేస్తారో, దానికి ఆ దేవత పేరిట పంచాయతనంగా వ్యవహరిస్తారు. అనగా, మధ్యలో గణపతిని ఉంచితే గణపతి పంచాయతనం గా వ్యవహరిస్తారు. విష్ణుమూర్తిని ఉంచితే విష్ణు పంచాయతనం అని, అలాగే మిగతావారిని వారి పేర్లతో పంచాయతనాన్ని వ్యవహరిస్తారు.


భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం - ఇవి పంచ భూతాలు. ఈ పంచ భూతాలకు ప్రతీకలే మనం పైన చెప్పుకున్న దేవతలు. అందువలన, ఆ

దేవతలను పూజిస్తే పంచభూతాలను అర్చించిన ఫలం దక్కుతుంది.


ముఖ్యంగా గమనించినట్లయితే ఆకాశమ్నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీరునుండి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుండి ఆహారం, ఆహారం వలన ప్రాణికోటి, జంతుజాలం ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయం భగవద్గీతలో గీతాచార్యుడు ఉద్భోదించడమేకాక, అధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. అనగా శివుడు ఆకాశ తత్వాన్ని, అమ్మవారు వాయుతత్వాన్ని, సూర్యుడు అగ్నితత్వాన్నీ, విష్ణుమూర్తీ జల తత్వాన్ని, గణపతి పృద్వీ తత్వాన్నీ కలిగిఉంటారని పండితుల ఉవాచ.


ఇంక - నాదం శబ్ధప్రధానం. ఆకాశానిది శబ్ధ గుణం. అందుకే శివుణ్ణి ఆకాశ తత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.


వాయువుకు ప్రాణాన్ని ప్రసాదించే శక్తి ఉంది. అమ్మవారు "ప్రాణధాత్రి " కదా. అందుకే అమ్మవారికి వాయుతత్వం ఉందంటారు.


సూర్య అష్టోత్తర శతనామాల్లో "అగ్నిహోత్రాయ నమః" అని అన్నారు. కనుకనే సూర్యుడు అగ్నికి ప్రతీక.


విష్ణువు జల సంభూతుడు. "నారం" అంటే జలం. నారం నుంచి ఆవిర్భవించినవాడు కాబట్టే ఆయనని "నారాయణుడు" అంటున్నాము.


గణపతి మూలాధార చక్రాధిదేవత. అంటే మూలాధారమన్నది, పృద్వీ తత్వం. అందుచేతనే గణపతిని "మట్టితో " చేసి పూజిస్తారు. మట్టి గణపతి మహత్తు చాలా అద్భుతమైనది.


ఇంట్లో నిత్యం చేసే దేవతార్చనలో పంచాయతన పూజా విధానాన్ని తప్పకుండా అనుసరించాలని పెద్దల సూచన.


షోణ నదిలో దొరికే షోణ భద్రం శిలను గణపతి అనీ, గండకీ నదిలో దొరికే శిలను విష్ణువు అనీ, నర్మదా నదిలో దొరికే బాణలింగ శిలను శివుడు అనీ, స్వర్ణముఖిలోను, అలాగే ఖనులలో దొరికే హేమాక్షకం అనే శిలను అమ్మవారు అనీ, యమునా నదిలోను ముఖ్య పర్వత ప్రాంతంలోను లభించే స్పటిక శిలను సూర్యుడు అనీ భావించి వాటిని అరాధిస్తారు.


ఇంక పంచాయతనార్చన చేసేముందు ప్రాతః సంధ్యావందనం విధిగా ఆచరించాలన్నది శాస్త్రవచనం. ఏ పూజకైనా, సంధ్యావదనం గాయత్రీ మంత్ర జపం చేసి చేస్తేనే ఉత్తమం.


సర్వే జనాః సుఖినోభవంతు

సమస్త సన్మంగళాని సంతు

కామెంట్‌లు లేవు: