నాకేం తక్కువ (జీవనోపాధి-1 )
ఇటీవల నేను ఒక కేసులో కూకట్పల్లి కోర్టుకు వెళ్ళటానికి మలక్పేట్ ఎమ్ యమ్ టి యస్ రైలు ఉదయం 8-15 ని. కు ఎక్కాను. నాకు ఒక చిన్న కంపార్టుమెంట్లో సీటు దొరికింది. అందులో ఒక 40 సం. మహిళ మరిఒక మహమ్మదీయ ప్యాసింజరులు మాత్రమే వున్నారు. రైలు బయలుదేరంగానే నేను ఆమెతో మాట్లాడాను. ఆమె కూరగాయలు అమ్ముతానని చెప్పింది. ఆ చిన్న కంపార్టుమెంటులో ఆమె నేను ఇంకొక మహమ్మదీయుడు తప్ప వేరే ఎవరు లేరు. నేను కాలక్షాపాకిని ఆమె వ్యాపారాన్ని గురించిన వివరాలు అడిగాను. తాను వారాసిగూడలో ఉంటున్నానని ఆమె భర్త 20 ఏళ్ళ క్రితం మరణించాడని ఆమెకు ఒక కుమారుడు వున్నాడని తాను తన కుమారుడు కలిసి ఉంటున్నట్లు చెప్పింది. ఆమె మాటలు విన్నతరువాత నా మనస్సు ఒకింత బాధ పడింది పాపం ఆమె చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి కుమారునితో బాధపడుతున్నది అని నేను అనుకున్నాను. కానీ ఆమె ముఖంలో ఎంతో ఆత్మధైర్యం కనిపించింది. ఇక వ్యాపారనిగూర్చి ఆమె చెప్పిన విషయాలు. కూరగాయలకన్నా ఆకు కూరలలోనే ఎక్కువ లాభం వస్తుందని అన్నది. తాను శంషాబాద్ ఉదయం 5గంటలకు ఇతర కూరగాయల వర్తకులతో కలిసి Rs.50 ఇచ్చి అందరం ఆటోలో వెళుతామని అక్కడ వున్న కూరగాయలలో లాభసాటివి ఏవి ఉన్నాయో చూసుకొని ఎత్తుకుంటానని (కొంటానని) చెప్పింది. ఆకుకూరలు 5రూపాయలకు 5 కట్టలు ఇస్తారని వాటిని తాను 10 రూపాయలకు 3 లేక 4 కట్టలు అమ్ముతానని అన్నది. ఇప్పుడు కరివేపాకు కూడా ఎక్కువ ఖరీదు అయినదని అన్నది అందుకే కరివేపాకు తక్కువగా ఇస్తున్నట్లు చెప్పింది. బుడంకాయలు (దోసకాయలు) 20 రూపాయలకు కిలో కొని పావు కిలో 20 రూపాయలకు అమ్ముతానని అదే కిలో కొనేవారికి 60 రూపాయలకు ఇస్తాను అన్నది. ఈ రోజు తాను ఒక 1000 రూపాయల సరుకు ఎత్తుకున్నానని దానిని అమ్మితే 5నుండి 6 వందల రూపాయల లాభం వస్తుందని అన్నది. కాగా తాను ఒక్కతే ఎవ్వరి సహాయం లేకుండా కూరగాయలు స్టేషన్లో దింపుకోగలనని చెప్పింది ఈ రోజు టమాటా 150 రూపాయలకు తొట్టి అయ్యిందని ఒక తొట్టిలో 23 నుండి 25 కిలోల వరకు సరుకు ఉంటుందని తెలిపింది. తాను 2లేక 3 రోడ్లు తిరిగితే మొత్తం మాలు అమ్ముడుపోతుందని అన్నది. తాను ఇంకా మైకు కొనుక్కోలేదని నోటితోనే అరుస్తున్నట్లు త్వరలోనే మైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. కొంతమంది కేవలం ఆకు కూరల వ్యాపారాలు చేస్తున్నారని నిజానికి అమ్ముడు పొతే ఆకుకూరలు చాలా మంచిదని లాభసాటి అని అన్నది. తాను ఆ రోజు బీరకాయలు, దోసకాయలు, దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి ఒక రెండు ఆకు కూరలు కొనినట్లు తెలిపింది. మొత్తము కూరలు ఒక గంట లేక రెండు గంటలలో అమ్మగలనని తనకు ఒక నాలుగు చక్రాల బండి ఉందని 1000 రూపాయల నుంచి 2000 వరకు పెట్టుబడి పెడితే 500 నుంచి 1000 రూపాయల వరకు లాభం వస్తుందని అన్నది. తాను ఇంటికి వెళ్లి భోజనం చేసి కూరగాయల విక్రయానికి వెళతానని అన్నది. అప్పుడు సమయం ఉదయం 8-20 అవుతున్నది. అంటే ఉదయం 9 నుంచి 10 వరకు వ్యాపారం చేస్తుందన్నమాట. కూరలు ఏమైనా మిగిలితే సాయంత్రం ఒక అరగంట తిరిగితే చాలని అన్నది. రైలు విద్యానగర్ స్టేషన్లో ఆగితే అక్కడ వేరే కంపార్టుమెంటులోంచి దిగిన ఒక అతనును చూపించింది అతను రోజుకు 5నుంచి 8 వేలు సంపాయిస్తాడని అతను విద్యానగర్లో ఒక అపార్టుమెంటులో సెల్లార్లులో వ్యాపారం చేస్తున్నాడని తెలిపింది. ఆమె మాటలు వింటే నాకు దిమ్మతిరిగింది రోజుకు 5 వేలు అంటే 5 x 30 నెలకు లక్షా యాభై వేలు కనీసం లక్షరూపాయల పైమాటే ఎట్టిపరిస్థితిలో తగ్గవు. ఏ వుద్యోగం చేసిన కూడా ఒక విద్యావంతుడు ఆ రకంగా సంపాయించలేడు. కేవలం కొంచం పెట్టుబడితో అంటే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల పెట్టుబడితో ఎంతో లాభాలు ఆర్జించవచ్చు అని తెలుసుకొని నేను నోరుఎళ్లపెట్టాను. ఏమాత్రం చదువు లేని ఒక సామాన్యురాలి కృషికి నేను ఆనందపడ్డాను. " కృషితో నాస్తి దుర్భిక్షం " అని అన్నారు కదా కష్టపడితే తప్పకుండ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కి ఎదగగలరు అని అంతంలో సందేహం లేదు. పాల వ్యాపారం చేసి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టి అసంబ్లీలో గొంతెత్తిన రాజకీయ నాయకుడు నా మెదిలాడు. ఆమె నెలసరి 25వేలు నుంచి 30 వేలు వరకు సంపాయిస్తున్నట్లు, తన పోషణ ఏరకంగాను ఇబ్బందిగా లేదని ఇంటి కిరాయి కట్టి ఆనందంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది. నాకేం తక్కువ సార్ అని అన్నది. నిజమే కేవలం రోజుకు 3,4 గంటల కష్టంతో చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించటం కన్నా స్వచ్ఛ యేమివున్నది. తనకు ఏమాత్రం ఇబ్బంది వున్నా ఆ రోజు వ్యాపారానికి వెళ్ళదు అడిగే వారు ఎవ్వరు లేరు. అదే ఎక్కడైనా వుద్యోగం చేస్తే సెలవులు ఇవ్వటానికి యెంత ఇబ్బంది పెడతారు. రోజుకు 8 గంటలు కస్టపడినా కూడా ఆమె సంపాదన అంతవుంటుందా అనేది సందేహాత్మకమే.
మనసుంటే మార్గం ఉండదా అంటే తప్పకుండ ఉంటుంది. మనలో చాలామంది నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం ఇంకా రాలేదు అనే దిగులుతో ఉండటమే కాకుండా ఆత్మ హత్యలు చేసుకునే వారిని కూడా మనం చూస్తున్నాము. కొంచం. పెట్టుబడి కొంచం లోకజ్ఞానం ఉంటే చాలు జీవితంలో ఎదగటానికి.
ఒక్కవిషయం వ్యాపారం అనేది మనం అనుకునే అంత తేలిక అయిన పని కాదు అందులో వుండే రిస్కు అందులో ఉంటుంది. మనం ఆ రిస్కుని ఎదురుకోగల సామర్థ్యం ఉంటేనే జీవితంలో ముందుకు పోగలము.
మన సమాజంలో ఆకలితో ఉన్నామంటే ఎవ్వరు సాయం చేయరు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే ఎద్దేవా చేసేవారు కోకొల్లలు. అరె వాడు ఇంజనీరింగ్ చదివాడు చివరకు కూరగాయలు అమ్ముతున్నాడు వాడికిదేం గతిరా చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం రావద్దు. ఆ వీడికి వచ్చిన అత్తెసరు మార్కులకు వుద్యోగం ఎవడు ఇస్తాడు వీడికి ఈ కూరగాయల వ్యాపారమే సరైనది అని ఒకరు ఇలా కాకుల్లాగా పొడుచుకునే వారు బోలెడు మంది వుంటారు. నిజంగా నీకు కూరగాయల వ్యాపారం లాభసాటి నేను చేస్తాను అంటే నీవు చేయవలసింది నీవు వుండే కాలనీకి దూరంగా వెళ్లి అక్కడ చేయి అక్కడ నీ చదువు నీ తల్లిదండ్రుల స్థితిగతులు ఎవ్వరికీ తెలియవు.. నేను అందరకు చెప్పేది ఒక్కటే కష్టపడే తత్త్వం వున్నవారికి ఏపనైనా ఒకటే. డిగినీటి ఆఫ్ లేబర్ తెలిసినవాడు జీవితంలో ముందుకు వెళ్లగలడు. ధైర్యసాహసే లక్ష్మి. అన్నారు పెద్దలు. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని మన గురువుగారు ఆది శంకర భగవానులు పేర్కొన్నారు.
నోటు: ఈ కధనం చదివి మనలో ఏవక్కరు అయినా తమ జీవితాన్ని సుగమంగా చేసుకొని నిరాశావాదాన్ని వీడి చక్కటి జీవితాన్ని గడిపితే ఈ వ్యాసకర్త కృషి ఫలించినట్లే.
ఇంకొక కధనంతో ఇంటోకసారి కలుద్దాం.
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి