19, మార్చి 2025, బుధవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*



*321 వ రోజు*


ధర్మరాజును మూడు బాణములతోను ఉపపాడవులను, సహదేవుడిని, ఘటోత్కచుడిని ఇరవై అయిదు బాణములతో కొట్టి సింహనాదం చేసాడు. ఘటోత్కచుడు అలంబసుడి రథాశ్వములు చంపి, సారథిని చంపి, రథమును విరిచాడు. తన రథము విరిగి పోగా అలంబసుడు నేల మీదకు దూకి తన మాయాజాలముతో పాండవ సేనపై మాయాశరములను వేసాడు. ఘటోత్కచుడు కూడా రథము దిగి అలంబసుడితో మాయా యుద్ధముకు తలపడి అలంబసునిపై మాయాసరములు గుప్పించాడు. అలంబసుడు ఖడ్గం తీసుకుని ఆకాశానికి ఎగిరాడు. ఘటోత్కచుడు కూడా ఖడ్గపాణి అయి ఆకాశానికి ఎగిసాడు. ఇద్దరూ మేఘాలపై ఒకరిని ఒకరు చుట్టుకుంటూ చిత్ర విచిత్రంగా యుద్ధం చేస్తున్నారు. తరువాత ఇద్దరూ భూమి మీద పడి ఒకరిపై ఒకరు కత్తులు విసురుకున్నారు. ఒకదానికి ఒకటి కొట్టుకొని అవి పడి పోగానే ఇద్దరు ద్వంద యుద్ధానికి తలపడ్డారు. ఒకరిని ఒకరు తోయుచూ, పొడుచుకుంటూ, కొట్టుతూ అనేక విధముల పోరు సాగించారు. చివరకు అలంబసుడు అలిసి పోగానే ఘటోత్కచుడు తగిన సమయం వచ్చిందని అలంబసుని కిందకు తోసి మీద కూర్చుని చేతులతో, కాళ్ళతో తన్ని పొడిచి, కుమ్మి యుద్ధం చేసాడు. చివరకు అలంబసుడు ఘటోత్కచుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. ధర్మరాజు ఘటోత్కచుడిని కౌగలించుకుని అభినందించాడు.


*ధర్మరాజు సాత్యకిని అర్జునుడికి సాయంగా పంపుట*


సాత్యకి కౌరవ సేనలను దొరికిన వాడిని దొరికినట్లు చంపుతూ తరుముతున్నాడు. అది చూసిన ద్రోణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి ద్రోణునిపై ఇరవై అయిదు బాణములతో కొట్టాడు. ద్రోణుడు సాత్యకిని మూడు బాణములతో కొట్టాడు. సాత్యకి ద్రోణుడిని ఏభై నారాచములతో కొట్టాడు. ద్రోణుడు వాటిని తొమ్మిది బాణములతో ఎదుర్కొన్నాడు. వాటిని సాత్యకి ఎదుర్కొంటున్న సమయంలో ద్రోణుడు సాత్యకిపై నూరు బాణములు వేసాడు. సాత్యకి నిస్సహాయంగా నిలబడ్డాడు. అది చూసి నీ కుమారులు సింహనాదం చేసారు. ధర్మరాజు అది చూసి " యోధులారా ! రండిసాత్యకి ఆపదలో ఉన్నాడు రక్షించండి " అని అరిచాడు. ఆ మాటలు విన్న భీముడు ఒక్క పరుగున సాత్యకి వద్దకు వచ్చాడు. మిగిలిన పాండవ వీరులు సాత్యకిని దాటిపోయి ద్రోణుని ఎదుర్కొన్నారు. వారిని చూసి ద్రోణుడు చిరు నవ్వు నవ్వి వారిపై వాడి అయిన శరములు వేసి పాంచాలురు ఇరవై మందిని కేకయ రాజులను నూరు మందిని తలలు నరికి యమసదనానికి పంపాడు. పాండవసైన్యం ద్రోణుని దాటి ఒక్క అడుగు ముందుకు వేయ లేదు. ఇంతలో పాంఛజన్య ఘోష వినపడింది. అది విన్న ధర్మరాజు సాత్యకిని చూసి " సాత్యకీ ! అర్జునుడి దేవదత్తము వినిపించకనే పాంఛజన్య ఘోష వినవస్తుంది. అశ్వత్థామ, కర్ణ, శల్య, కృప, శల్య, భూరిశ్రవసులు అర్జునుడిని చుట్టుముట్టినట్లున్నారు. అర్జునుడు ఆపదలో ఉన్నట్లున్నాడు. ఈ సమయంలో నాకు నీవు తప్ప ఎవ్వరూ లేరు. నీవు వెళ్ళి అర్జునుడిని కాపాడు " అన్నాడు. సాత్యకి ధర్మజునితో " నీవు చెప్పినది సత్యము. కాని అర్జునుడు నన్ను నీ రక్షణకై నియోగించి " సాత్యకీ ! నేడు శకునము బాగుంది. నేను సైంధవుని వధించడానికి వెళుతున్నాను. నీవు నా బదులుగా ధర్మజుని రక్షిస్తూ ఉండు. సైంధవ వధ ఎంత ముఖ్యమో ధర్మజుని రక్షణా అంత ముఖ్యము. నా పక్కన కృష్ణుడు ఉన్నట్లు నీవు ధర్మజుని పక్కన ఉండు " అన్నాడు. ద్రోణుడు మిమ్ము బంధించాలని చూస్తున్నాడు. ద్రోణుడు తమను బంధిస్తే అర్జునుడు సైంధవుని వధించినా ఏమి ప్రయోజనం. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నంత వరకు అర్జునుడికి భయం ఏమి లేదు. కనుక నేను మిమ్ము విడిచి వెళ్ళలేను " అన్నాడు సాత్యకి. ధర్మరాజు " సాత్యకీ నీవు చెప్పినది యధార్ధమైనా నీవు ఇప్పుడు అర్జునుడికి సాయంగా వెళ్ళడం యుక్తమైనదిగా నాకు అనిపిస్తుంది. అర్జునుడు క్షేమముగా ఉంటేనే మనకందరికి రక్షణ. కనుక నీవు నా మాట కాదనక అర్జునుడికి సాయంగా వెళ్ళు. నాకు ఇక్కడ ద్రోణుని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ద్రుపదుడు, ఉపపాండవులు, కేకయరాజులు, శిఖండి ఇంకా యోధాను యోధులనేకులు ఉన్నారు. నాకేమి భయం లేదు " అన్నాడు. ధర్మజుని మాటకు బదులు చెప్పలేక సాత్యకి భీముని ధర్మజునికి రక్షణగా ఉంచి ధర్మజుని అనుమతి పొంది సైంధవుని చంపి విజయుడినై తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి అర్జునుడికి సాయంగా వెళ్ళాడు.

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము సమాప్తం *


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: