🙏కాళిదాసు 🙏
మూడవ భాగం
కాళిదాసు కేవలం భారతీయ కవి మాత్రమే కాదు. విశ్వకవి. ప్రపంచకవుల్లోనే అగ్రగణ్యుడైన కవి. భారతీయాత్మను కాళిదాసు చిత్రించినంత హృద్యంగా మరే కవీ ఆవిష్కరించలేదంటే అతిశయోక్తి గానేరదు. ఎందుకంటే, భారతదేశపు భౌతికస్వరూపాలను అంటే నదీనదాలను, పర్వతాలను, పట్టణాలను, ఆశ్రమాలను, వృక్షలతాదులను, కాళిదాసు వర్ణించినంత సమగ్రంగా, సమర్ధవంతంగా మరే కవీ వర్ణించి సాక్షాత్కరింపజేయలేకపోయాడు. అందుకే విమర్శకులు అంటారు “కాళిదాసు కవిత్వం సార్వభౌమికమే కాదు సార్వజనీకం కూడా” అని.
మన తెలుగు ప్రబంధకవులు కావ్యావతారికలలో చెప్పుకున్నట్లు కాళిదాసు ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. అసలు పూర్వకవులలో ఈ ఆచారం ఉన్నట్టు కనపడదు. అందువల్ల ఇతర ఆధారాలతోనే వారి జన్మ విశేషాలను ఊహించడం జరిగింది. అయితే ఈ ఊహల్లో బేధాభిప్రాయాలు చాలా ఉన్నాయి. కాళిదాసు జీవితకాలం విషయంలో క్రీ.పూ. 8 వ శతాబ్ది నుండి క్రీ.శ.10వ శతాబ్దం వరకూ ఉన్నట్లుగా రకరకాలుగా ఈ ఊహాగానాలు అల్లుకున్నాయి. అయితే ఎక్కువమంది చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి జీవితకాలం క్రీ.పూ.150 సం.నుండి క్రీ.శ 634 సం మధ్యలో ఎక్కడో ఉంది. క్రీ.శ 6వ శతాబ్దంవాడని ఓ వాదం, గుప్తుల కాలం వాడని ఒక వాదం, విక్రమ శకారంభం వాడని అంటే 6 వ శతాబ్దికి చెందిన వాడని మూడు వాదాలు బలంగా ప్రజల్లో బలపడ్డాయి. ఇంకా సూక్ష్మపరిశీలన చేస్తే కాళిదాసు ఉజ్జయినీ ప్రాంతం వాడని మనం చెప్పుకోవచ్చు.
ఉజ్జయినీ పాలకుడైన విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నాడని “ధన్వంతరి, క్షపణకామరసింహా శంఖ బేటాళభట్ట ఘటకర్పర కాళిదాసా:” అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. అంతే కాక ప్రస్తుతం మనం చదవబోయే “మేఘసందేశం” కావ్యంలో యక్షుడు మేఘునికి అలకానగర మార్గాన్ని చెప్పే సమయంలో చెప్పిన “వక్ర: పన్ ధాయదపి భవత:” అనే శ్లోకార్ధం తీసుకుంటే “నీ ప్రయాణం కొంచెం వక్ర మార్గమయినా పర్వాలేదు, ఉజ్జయినీ నగర దర్శన భాగ్యం పోగొట్టుకోకు” అని చెప్తాడు. అంతే కాక ఈ నగరశోభను 16 శ్లోకాల్లో సుదీర్ఘంగా వర్ణించడం వల్ల అతనికి ఉజ్జయినీపై గల అభిమానం వ్యక్తమౌతుంది. అంతే కాక విక్రమాదిత్యుని అభినందన కృతి “రామచరితం” లో “ఖ్యాతి కామపి కాళిదాస కృతయోనీతా: శకారాతినా” అన్న శ్లోకంలో కాళిదాసు ప్రశంస ఉంది. “విక్రమోర్వశీయం” నాటకం ఊర్వశీపురూరవులకు సంబంధించినది కదా! అందువల్ల “పురూరవోర్వశీయం” అనడం సబబు. కానీ కాళిదాసు అలా అనకుండా తన చక్రవర్తి విక్రమసింహుని పేరులో ఉన్న “విక్రమ” శబ్దం వాడడం కూడా అదే సూచిస్తున్నదని చరిత్ర,సాహిత్యకారులు బలంగా విశ్వసిస్తున్నారు.
కాళిదాసు మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞానశాకుంతలం అనే నాటకాలు, ఋతుసంహారం అనే లఘుకావ్యం రాశాడు. శృతబోధమనే ఛందోగ్రంధము, జ్యోతిర్విద్యాభరణం, ఉత్తరకాలమృతం అనే జ్యోతిశ్శాస్త్ర గ్రంధాలను కూడా రచించాడని చెప్తారు. ఇతని రచనా శైలిని గూర్చి కూడా కొంత పరిచయం అవసరం. ఈతని రచన మృదుమధురమైన పదాలతో లలితంగా, చక్కని అలంకారాలతో ఉండి అక్కడక్కడా దీర్ఘ సమాసాలు వాడినప్పటికీ, సులభ గ్రాహ్యంగా ఉంటుంది. ఈతని కవిత్వ రీతి “వైదర్భీరీతి” అంటారు.
“బంధ పారుష్య రహితా శబ్ద కాఠిన్య వర్జితా
నాతి దీర్ఘ సమాసాచ వైదర్భీ రీతిరిష్యతే”
పదాలు పరుషంగా ఉండవు. కఠినమైన శబ్దాలు ఉండవు. దీర్ఘ సమాస ప్రయోగం ఉండదు. దీనినే వైదర్భీరీతి అని లాక్షణికులు అంటారు. కాళిదాసు ప్రకృతిపరిశీలనాశక్తి మనలను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా అలంకారాలు వాడడంలో కాళిదాసు దిట్ట. అందుకే ఆయనను “ఉపమా కాళిదాసస్య” అంటారు.
“వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:
రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. ఆ శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి