16, ఏప్రిల్ 2025, బుధవారం

జానపద సాహిత్యం🙏

 🙏  జానపద సాహిత్యం🙏

                     మొదటి భాగము


 జనపదమనగా పల్లెసీమలు . జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు  జానపద గీతాలు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు

ఏ భాషలోనైనా ముందు జానపద సాహిత్యం పుడుతుంది.మౌఖికంగా ఒక తరము నుండి తరువాత తరమునకు అందుతుంది.

 ఉదాహరణను పొలం పనులు చేసేవారు శ్రమ కలగకుండా ఉండటానికి జానపద గేయాలు పాడుకునేవారు, గ్రామ దేవతను, ఇష్ట దేవతలను భక్తితో కొలిచి పాడుకునేవారు

ఓ గజముఖ

ఓ గజముఖ విఘ్నేశప్రభో* తొలి భోగము నీదయ్యా

మా పనులు సాగింపగదయ్యా!

నీ యనురాగం బిడుమయ్యా!

విఘ్నములు రానే రావయ్యా!

విఘ్నములు రానే రావయా౹౹ఓ *గజముఖ* ౹౹


ముందుగ నిన్నుపూజించెదమయ్యా! 

చేయుపనులందు సఫలమయ్యా!

తిండిలో లజ్జనెరుగవయ్యా!

విఘ్నములు రానే రావయ్యా౹౹ఓ *గజముఖ* ౹౹


 నీదు దయకు ప్రతి విద్యాధికులు నిలచియుందురయ్యా!

లేనిచో సాధకులెవరయ్యా!

విద్యలకు ఆదినుందువయ్యా౹౹ఓ *గజముఖ* ౹౹


దండియైన నీ కడుపు చూచి

చంద్రుండు నవ్వెనయ్యా!

అప్పుడు చంద్రునకు శాపమయ్యా!

అది నీ పండుగనాడయ్యా౹౹ఓ *గజముఖ*


ఇలా సందర్భోచితంగా జానపద సాహిత్యం వచ్చింది.(నేను చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు శ్రామిక జనం ఊడుపులు ఊడుస్తూ, కోతలు కోస్తూ పాడుతూ పని చేసేవారు. )

జానపద కళలు: సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ ఈ విభాగంలో చేరతాయి. గాత్ర సంగీతం, వాద్య సంగీతం, తోలు బొమ్మలాటలు, యక్షగానం, వీధి భాగోతం, కోలాటం, పగటి వేషాలు, బహురూపుల గారడీ విద్యలు బుర్ర కథలు మొదలైనవి ఈ విభాగంలో వస్తాయి.

ఇప్పుడు మనం చూస్తున్న జానపద విజ్ఞానం హటాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినదేమీ కాదు. అది ఒక తరం నుంచి మరో తరానికి ఒక క్రమ పద్ధతిలో వివిధ రూపాల్లో అందుతూ వస్తున్నది. మౌఖిక, లిఖిత పద్ధతుల్లో ఇది పరివ్యాప్తమవుతూ వస్తున్నది.మౌఖిక రూపంలో ప్రచారం పొందిన జానపద విజ్ఞానం ఇటీవలి కాలంలో లిఖితరూపం సంతరించుకుంటోంది. క్షేత్ర సందర్శనలు, పరిశోధనల కోసం జానపద విజ్ఞానాన్ని సేకరించి ముద్రణా రూపంలోను, వస్తు రూపంలోను, ఫొటోలు, సీడీల రూపంలోను భద్రపరుస్తున్నారు. ఈ ముడి సరుకుల ఆధారంగా ఆయా ప్రాంతాల ప్రజా మూలాలను వెదుకుతున్నారు. లిఖిత సంప్రదాయం కన్నా మౌఖిక సంప్రదాయమే శక్తివంతమైనది. మౌఖిక జానపద విజ్ఞానంలో జానపద గేయాలు, కథాగేయాలు(బుర్ర కథ) , జానపద పురాణాలు, ఇతిహాసాలు(విరాట పర్వం జానపద కథ ), గద్యకథలు(సముద్ర గుప్తుని కథలు ), సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు నుడికారాలు, తిట్లు, ఒట్టులు వంటివన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించాయో చెప్పేదే ఈ వ్యాసం. పింగళి సూరన కళాపూర్ణోదయంలో అనేక జానపద సామెతలను ఉపయోగించాడు.

నన్నయ భారత అవతారికలో తాను ఎన్నో జానపద రూపకములు చూశానని తెలుపుటను బట్టి అప్పటికే తెలుగు జానపద సాహిత్యం బాగా వ్యాప్తి చెందినదని చెప్పవచ్చు .12 వ శాతాబ్ధికి వాడైన పాల్కురికి సోమనాథుడు దేశిసాహిత్య పితామహుడుగా ఉండి పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే శైవసాహిత్య గ్రంథాలను దేశి సాహిత్యంలో రచించాడు. ద్విపద ఛందస్సు జానపద సాహిత్యనికి అత్యంత దగ్గరి రూపం. ఝటితిగా రచితమయ్యే చాలా జానపద గేయాలలో ఈ ఛందస్సు రూపాలు ఉంటాయి. అందుకే ప్రచారం అవసరం అనుకున్న విషయాలను ప్రజలకు విరివిగా అందించాలనుకున్న కథలను ఆనాటి కవులు జానపద సాహిత్యానికి చాలా దగ్గరిగా ఉన్న ద్విపద ఛందస్సును స్వీకరించి రచించారు. పాల్కురికి, శ్రీనాథుడు (పల్నాటి వీరచరిత్ర), రంగనాథ రామాయణ కర్త గోన బుద్దా రెడ్డి ఇందుకు మంచి ఉదాహరణలు. జానపద జీవితాన్ని విస్తారంగా వర్ణించిన సోమన జానపదులైన శివభక్తుల జీవితాలను కథలను విపులంగా వర్ణించిన సోమన వాటిలో భాగంగానే జానపద కళలను వివరంగా వర్ణించాడు. తన కాలం నాటికి తెలిసిన చాలా జానపద కళలను గురించి ఆచూకీ చెప్పడం మనకు ఇందులో బాగా కనిపిస్తూ ఉంది. పాల్కురికి రచనలలో ఉన్న జానపద కళల గురించి ఇప్పటికే చాలా మంది పండితులు చెప్పిఉన్నారు. వాటిని తిరిగి వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. కాని ఏ ఏ కళారూపాల ప్రసక్తి ఉందో చెప్పడం అవసరం. చాలామంది నాటకాలు ఆడుతున్నారని చెప్పాడు అవి జానపద నాటకాలే. రోకళ్ళ పాటలను గురించి చెప్పి వాటిని పాడే ఘట్టాల్ని చెప్పాడు. పిచ్చుకుంటి కళాకారులు శ్రీశైలం వెళ్తున్నట్లుగా వర్ణించాడు. పిచ్చుకుంటి కళాకారులు ఈనాటికీ  ఉన్నారు. వీరి కళారూపమైన పిచ్చుకుంటికథ ఇప్పటికీ బాగా తిరుగుతూ ఉంది. దీనిలో పల్నాటి వీర చరిత్ర ప్రసిద్ధం. మెరవణి ఉందని, బహురూపులు ఉన్నారని చెప్పాడు. బహురూపులు అంటే వివిధ వేషాలు వేసుకునే కళాకారులు అని పగటి వేషగాళ్ళు అని అర్థం. ఇప్పటికీ రాయలసీమలో కనిపించే మెరవణిని గురించి పాల్కురికి ఆనాడే ప్రస్తావించాడు. 'భారతాది కథల జీరమఱుగుల నారంగ బొమ్మల నాడించువారు గడునద్భుతంబుగ గంబసూత్రంబు లడరంగ బొమ్మల నాడించు వారు' అని స్పష్టంగా చెప్పి దీని ద్వారా ఆనాటికి తోలుబొమ్మలాట, చెక్క బొమ్మలాట ఉన్నాయని స్పష్టమైన చారిత్రక ఆధారాన్ని ఇచ్చాడు సోమనాథుడు. ‘నమరంగా గడలపై నాడెడు వారు’ అని చెప్పి దొమ్మరాటను గురించి చెప్పాడు. యక్షగానాన్ని చెప్పాడు. చిందువారి ప్రసక్తి ఉంది కాబట్టి అది చిందు యక్షగానం కావచ్చు. వెడయాట, కోడంగియాట, వెడ్డంగము అనే వాటిని గురించి చెప్పాడు. ఈనాడు ఈ కళారూపాలు కనిపించవు. కాలగతిలో అంతరించిపోయాయి. ఇంకా పక్షుల ఆటలు, జంతువులతో ఆడించే ఆటలు, బహురూపులు అంటే పగటివేషగాళ్ళ ఆటలు, పేరణి, కోలాటం, గొండ్లి నృత్యం మొదలైన కళారూపాలను గూడా ప్రస్తావించాడు పాల్కురికి సోమన. ఇంకా నటులకు సంబంధించిన వివరాలు చాలా ఇచ్చాడు. ఈ విధంగా ఆనాటి జానపదకళల విజ్ఞాన సర్వస్వంగా కనిపిస్తాయి పాల్కురికి పండితారాధ్య చరిత్ర, బసవపురాణ గ్రంథాలు. పాల్కురికి రాసిన ఆనాటి భక్తుల కథలు కూడా ఈనాడు జానపద సాహిత్య ప్రక్రియలోని పురాకథా ప్రక్రియ అవుతాయి. ఆనాటి చాలా జానపద కళలు ఈ నాడు జీవించిలేవు. ఇటీవలి 100 సంవత్సరాల లోపున కూడా ఉన్న వాలకం అనే కళా రూపం ఇప్పుడు అంతరించింది

                        సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ  

 



.

కామెంట్‌లు లేవు: