8, మే 2025, గురువారం

తెలుగు సామెతలు

 🔴-తెలుగు సామెతలు -🔴

🚩🚩

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. . "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.

           సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. 

ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు

 ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). 

పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు 

("ఊరక రారు మహానుభావులు"). 

సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును

 ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). 

ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును

 ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", 

"కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). 

ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును 

("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది").

 వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును 

("మనసుంటే మార్గముంటుంది")

 ప్రమాదమును హెచ్చరించవచ్చును

 ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). 

వాదనకు ముక్తాయింపు పాడవచ్చును

 ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). 

హాస్యాన్ని పంచవచ్చును 

("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[

♦అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు

అర్ధం

సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. 

మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది

♦అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ

దీనికి సమానర్థంలో మరికొన్ని సామెతలు: 

1. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం.

 2. ఏరు దాటునంత వరకు ఓడ మల్లయ్య గారు..... ఏరు దాటాక బోడి మల్లయ్య.

♦పండగ నాడు కూడా పాత మొగుడేనా?

సామెతను మార్చేసి పలుకుతున్నారు.

 పండగ పూట పాత "మడుగేనా" అన్నది అసలైన సామెత. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టిన సామెత పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలి అని.

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. సరైన రీతిలో నే పలుకుదాం, పలికిద్దాం.

♦పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది

మొగ మోటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట.

 మొగమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

కామెంట్‌లు లేవు: