🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯
*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*
*శ్రీమదాంధ్ర మహాభారతం*
*ఆదిపర్వము*
*మహా భారత కథ*
*ప్రారంభం(1 -6)*
ఇంక భారత కధను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో
అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహా యజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్లు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేసారు.
సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు
జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. “ఓ జనమేజయ మహారాజా! నీ తమ్ములు ఏ మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. ఓ రాజా! యుక్తా యుక్త వివేచన విచక్షణ లేకుండా మంచి వారికి, సాధువులకు అపకారం చేసే వారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి.” అని పలికి ఆ సరమ అనే కుక్క వెళ్లి పోయింది.
తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము
పూర్తి చేసాడు. తన రాజధాని హస్తినా పురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలోశ్రుత శ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు. “తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి." అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని
ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేసాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత, అనే ఎనిమిది సిద్ధులు పొందాడు. ఒక రోజు గురువు గారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్యు మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము ( ఆవు పేడ) భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు.
తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. “మహారాజా! నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్ను కుండలములు
ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి.” అని అడిగాడు. "మహాత్మా! ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి.” అని అన్నాడు.
ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి
కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి “రాజా! మహారాణి నాకు
కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి." అని అడిగాడు. "మహాత్మా! నా భార్మ మహా పతివ్రత. చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు.” అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు.
సశేషం
తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం
*సేకరణ*
*న్యాయపతి నరసింహారావు*
🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి