*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము*
*461 వ రోజు*
*గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట*
ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలి పోయింది. తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ " నాయనా సుయోధనా ! ఏమిటిది సుయోధనా ! నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా ! నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా ! కృష్ణా ! చూడవయ్యా నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా ! నాకు పాదాభివందనం చేసాడయ్యా ! అప్పుడు నేను ధర్మమం జయిస్తుందని ఆశీర్వదించాను. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా !నాడు కురు సభలోజూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు " ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు " అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణా ! నేను ఇంకా ఇలా అన్నాను యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా ! లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా ! నా కుమారుడు రెండవది నిజంచేసాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నాకుమారుడి గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను. ఈ ముదిమివయసులో నాకూ నా భర్తకు కొడుకుల ఆసరా లేక పోయిందేనన్నదే నా బాధ. కృష్ణా ! నా కుమారుడు అభిమానధనుడు అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా ! పదకొండు అక్షౌహినుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా ! నా భర్త కుమారుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కురుసామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా ! అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది " అని
*గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట*
కృష్ణా ! పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్ననా కోడళ్ళ దుఃఖమును చూడ లేక పోతున్నానయ్యా ! ఇలాంటి మనో వేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి ! రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికీ ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా ! కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా ! నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా ! కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్ళను చూడవయ్యా ! వాళ్ళేమి చేసారని వారికి ఈ చిత్తక్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా ! వీరి దుఃఖముకు అంతు లేదా ! భీముని చేతిలో హతులైన నాకుమారుల శవాలు చూసి నాకోడళ్ళు భోరు భోరున రోదిస్తున్నారయ్యా ! పాలరాతి భవనాల్లో చందనచేర్చిత ముఖాలతో కళ కళ లాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా ! ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళ్కు పట్టిన దుర్గతి చూసావా ! ఇదంతా నేను నా భర్తా చేసిన పాప ఫలితం కాక పోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా ! అని గాంధారి పలు విధముల విలపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దు!ఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి