🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯
*🪷శుక్రవారం 8 ఆగస్టు 2025🪷*
*శ్రీమదాంధ్ర మహాభారతం*
*ఆదిపర్వము*
*గ్రంథ ప్రారంభము (1 -1)*
గణపతి ప్రార్థన:-
శ్లో"శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్|
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాన్తయే||"
సరస్వతీ దేవి ప్రార్థన:-
శ్లో"సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి!
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!:
పరమేశ్వర ప్రార్థన:-
శ్లో"వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వన్దే, పార్వతీ పరమేశ్వరౌ||"
గురు ప్రార్థన:-
శ్లో" అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మి శ్రీగురవే నమః ||
శ్లో " న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్సరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||
వ్యాస ప్రార్థన:-
శ్లో "వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
శ్రీకృష్ణ ప్రార్థన:-
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం।
యత్కృపా తమహం వందే పరమానంద మాధవం॥
నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే న చ।
మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద॥
శ్లో"కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ|
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః":
“నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ |
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ||”
నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వాళ్ళిద్దరి లీలలను తెలియచెప్పే సరస్వతీదేవికి, మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యాసమహర్షికి నమస్కరించి మానవులలోని రాక్షసభావాలను తొలగించి, పవిత్రమైన మనసును ప్రసాదించే మహాభారతాన్ని చదవడం మొదలు పెట్టాలి.
పూర్వమొకప్పుడు నైమిశారణ్యంలో శౌనకముని పన్నెండేళ్ళ సత్రయాగాన్ని చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి రోమహర్షణుడి కొడుకైన ఉగ్రశ్రవుడు వచ్చాడు. ఆయనను చూడగానే అక్కడ ఉన్న మునలందరికీ చిత్రవిచిత్రములైన కథలు వినాలనే కోరిక కలిగింది. వెంటనే అక్కడి మహర్షులంతా ఆయన చుట్టూ చేరి నమస్కరించి,
సత్కరించారు. ఉగ్రశ్రవుడు మహర్షుల యోగక్షేమాలు
అడుగుతున్నాడు. ఇంతలో ఒక ముని ఉగ్రశ్రవుని “మహర్షీ! మీరు ఇప్పుడు ఎక్కడ నుండి వస్తున్నారు? ఇప్పటివరకూ ఎక్కడు ఉన్నారు?" అని అడిగాడు. ఆ మహర్షులతో ఉగ్రశ్రవుడు "నేను పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి వెళ్ళి, అక్కడ వ్యాసుడు రచించిన భారతంలోని పవిత్రమైన, విచిత్రమైన
చాలా కథలను విన్నాను. అనేక ఆశ్రమాలు చూసి, తీర్థాలు సేవించి, కౌరవులు, పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచక క్షేత్రాన్ని చూసి, అక్కడినుండి మిమ్మల్ని చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. మీరు అందరూ మీ మీ అనుష్ఠానాలను పూర్తి చేస్తుకుని, పవిత్ర మనస్కులై ఏకాగ్రతతో ఉన్నారు. ఇంతకీ మీకు ఏ కథ చెప్పమంటారు?” అని అడిగాడు. అప్పుడు మహర్షులు "వ్యాసుడు రచించిన వేదమయమైన భారత సంహితను వినాలనుకుంటున్నాము” అని చెప్పారు. అప్పుడు ఉగ్రశ్రవుడు “ఆద్యుడు, అంతర్యామి, సర్వవ్యాపకుడు, మంగళకరుడు, చరాచరగురువు అయిన హృషీకేశునికి నమస్కరించి, వ్యాసుడు రచించిన పవిత్రమైన మహా భారతాన్ని వర్ణించి చెప్తాను. ఈ గ్రంథం మూడు లోకాల్లోనూ అందరిచేతా విస్తారంగానూ, సంక్షిప్తంగానూ
చదవబడుతుంటుంది. అనేక రకాల ఛందస్సులతో ఉన్న ఈ
గ్రంథం దేవతల, మానవుల మర్యాదలు ఎట్లా ఉండాలో
స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉంది. అప్పుడు ఈ ప్రాణులన్నింటి పుట్టుకకు కారణమైన ఒక అండం పుట్టింది. అది దివ్యము, సత్యము, సనాతనము, జ్యోతిర్మయము, అలౌకికము. ఆ అండంలో నుంచే
బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. ఆ తరువాత ప్రచేతసులు
శ్రీమహాభారతం పదిమంది, దక్షుడు, అతడి ఏడుగురు కొడుకులు,
సప్తఋషులు, పధ్నాలుగు మంది మనువులు పుట్టారు.
విశ్వేదేవులు, ఆదిత్య వసువులు, అశ్వినీకుమారులు, యక్ష,
సాధ్య, పిశాచ, గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, నెలలు, పక్షాలు, పగలూ, రాత్రీ, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువులూ ఈ అండం నుంచే పుట్టాయి. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతువులు గుర్తులు వచ్చిపోతుంటాయి. అల్లాగే ఈ చరాచరజగత్తు అంతా ఏ పరమాత్మలో నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే కలిసి
పోతుంది. ఈ విధంగా సమస్త పదార్థాలనూ సృష్టించి నశింపచేసే కాలచక్రం అనాదిగా నడుస్తూనే ఉంది. అనంతంగా నడుస్తూనే ఉంటుంది. సంక్షిప్తంగా దేవతల సంఖ్య ముప్ఫైఆరువేల మూడువందల ముప్ఫైమూడు కోట్లు. వివస్వంతుడికి దివఃపుత్రుడు, బృహద్భానుడు, చక్షువు, ఆత్ముడు, విభావసుడు, సవిత, ఋచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, మనువు - అనే పన్నెండుమంది కొడుకులు. వీరిలో చివరివాడైన మనువుకి 'దేవభ్రాట్,
సుభ్రాట్' అని ఇద్దరు కొడుకులు. సుభ్రాట్కి "దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి” అనే ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురికీ సంతానం కలిగింది. దశజ్యోతికి వెయ్యిమంది, శతజ్యోతికి లక్షమంది, సహస్రజ్యోతికి పదిలక్షల మంది పుట్టారు. వీళ్ళ నుండే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు పుట్టినాయి. ఈ పరంపరాక్రమంలోనే అనేక వంశాల, ప్రాణుల సృష్టులూ జరిగినాయి.
సశేషం
తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం
*సేకరణ*
*న్యాయపతి నరసింహారావు*
🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి