25, ఆగస్టు 2025, సోమవారం

మహాకవి మయూరుడు🙏

 మహాకవి మయూరుడు🙏

                  రెండవ భాగం 

 “భక్త మయూర వక్త్రాబ్జ పదవిన్యాస శాలినీ నర్తకీవవరీవర్తి సభా మధ్యే సరస్వతీ” అని జయ మంగళుడు మయూరుని కీర్తించాడు. భక్తుడైన మయూరుని ముఖపద్మంపై పదవిన్యాసం చేస్తున్న సరస్వతి సభలో నర్తకిలా అతిశయంగా ఒప్పుతున్నదని భావం. రాజశేఖరుడు మయూరుని ఇలా శ్లాఘించాడు:


“దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం

విషవిద్యేవ మాయూరీ మయూరీ వాఙ్నికృంతతి”

భావం : నెమలి క్రేంకారం వంటి మయూరుని వాక్కు నీచకవులనే విషసర్పాల చెవిని సోకగానే విషవిద్య వలే వారి దర్పాన్ని నశింపజేస్తుంది


మయూరుని సూర్య శతకం చదివితే పై ప్రశంసల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని తెలిసింది. శతకంలో ఒక్కో శ్లోకం చదువుతున్న కొద్దీ, మయూరుడు కేవలం వంద పద్యాలతో మహా కవి ఎలా అయ్యాడో అర్ధమవుతుంది . అద్భుతమైన వర్ణనలు, భాషపై సంపూర్ణమైన అధికారం, రచనా విధానంలో ప్రౌఢిమ అనితర సాధ్యంగా తోచింది. .

మయూరుని సూర్యశతకము ఊహకి అందని అద్భుత రహస్య విషయాలను చక్కని శతకంగా అందించినారు. ఇది మామూలు శతకము కాదు. దీని నిండా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఎన్నో అద్భుత విషయాలు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇంక విజ్ఞానంగా చూస్తే ఈ అద్భుత విషయాల పక్క మన దృష్టి మరలి వానిలోని ఖగోళ రహస్యాలను అర్థం చేసుకోవాలి.

“జంభారీతీభ కుంభోద్భవమివ దధతస్సాంద్ర సింధూర రేణుం

రక్తాస్సిక్తా ఇవౌఘై రుదయతటీ ధాతు ధారాద్రవస్య

ఆయాంత్యా తుల్య కాలం కమలవన రుచేవారుణా వో విభూత్యై

భూయాసు ర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః || “


జంభ + అరాతి + ఇభ + కుంభ + ఉద్భవం = ఇంద్రుని వాహనమైన ఐరావతం యొక్క కుంభస్థలం నుండి పుట్టిన

సాంద్ర సింధూర రేణుం = దట్టమైన సింధూరపు ధూళిని

దధతః ఇవ = ధరించినట్లు

ఉదయ గిరి తటీ = తూర్పు కొండ చరియలందు

ధాతు ధారా ద్రవస్య = ధాతువుల యొక్క రసధారలయొక్క

ఓఘైః + సిక్తాః + రక్తాః ఇవ = ప్రవాహం చేత తడుపబడి ఎర్రని రంగును కలిగినట్లు

తుల్యకాలం = అదే సమయంలో (సూర్యోదయంతో బాటుగా)

ఆయాంత్యా = వచ్చుచున్నటువంటి

కమల వన రుచా = పద్మవనం యొక్క కాంతిచే

అరుణాః ఇవ = ఎర్రనైనవిగా ఉన్నటువంటి

భువనం + భాసయంతః = ముల్లోకాలను ప్రకాశింప చేయుచున్నవై

భానవీయాః = సూర్యుని యొక్క

భానవః = కిరణాలు

వః = మీ యొక్క

విభూత్యై = ఐశ్వర్యము కొరకు

భూయాసుః = అగును గాక


తాత్పర్యం: సూర్యకిరణాలు ఐరావతం కుంభస్థలంనుండి పుట్టిన సింధూరపు ధూళికమ్ముకున్నట్లు ఉన్నాయి. ఉదయం స్వర్గంనుండి బయలుదేరినప్పుడు స్వర్గలోకపు వస్తువులతో పోలిక అన్నమాట. తరువాత తూర్పు కొండ చరియల లోని గైరికాది ధాతువుల ద్రవాలచే తడిచి ఎర్రబడినవా అన్నట్లు కనబడుతున్నాయి. తరువాత సూర్యుని రాకతో బాటే వికసించిన పద్మ వనంయొక్క ఎర్రని కాంతితో ఎర్రబడినట్లు కనిపిస్తున్నాయి. భూమిని చేరిన కిరణాలు అలా కనిపిస్తున్నాయన్న మాట. ఈ విధంగా ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్న భానుని కిరణాలు మీ అందరి సంపదలకూ కారణమగు గాక!

సూర్యునికిరణాలు ఎలాగున్నాయంటే జంభునితోవైరమున్న ఇంద్రునికి చెందిన ఐరావతం యొక్క కుంభస్థలమును తమ ఉత్పత్తిస్థానంగా చేసుకొనియున్న దట్టమైన సింధూరరేణువులవలే భాసిస్తున్నాయట. గోదావరి నాసికాత్ర్యంబకంలో మొదలైనట్లుగా. అరుణవర్ణము తలంపుమాత్రముననే మంగళదాయకం. ఎంచేతంటే అమ్మవారు “అరుణాం కరుణాతతంగితాక్షీం” కదా. అంటే అమ్మవారు కారుణ్యానికి తత్తుల్యము మరియు సంకేతము. అలాగే “ఇందతి ఇతి ఇంద్రః”. పరమైశ్వర్యయుక్తుడు. 

భానవో భానవీయాః’ అన్నది ఎంత సుందర పద ప్రయోగమో గమనించండి! ఇలాంటి శ్లేషాలంకార పద ప్రయోగాలు, శబ్దాలంకారాలు శతకంలోని ప్రతి పద్యంలోనూ కనిపిస్తాయి. పై పద్యంలో “మీ అందరికీ శుభాలు కలుగు గాక” అని చెప్పడాన్ని బట్టి తన కుష్ఠువ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ శతకం చెప్పలేదనే భావన కలుగుతుంది

వ్యగ్రైరగ్ర్య గ్రహేన్దుగ్రసనగురు భరైర్నో సమగ్రైరుదగ్రైః

ప్రత్యగ్రైరీషదుగ్రైరుదయగిరిగతో గోగణైర్గౌరయన్‌ గామ్‌

ఉద్గాఢార్చిర్విలీనామరనగరనగగ్రావగర్భామివాహ్నా

మగ్రే శ్రేయో విధత్తే గ్లపయతు గహనం స గ్రహగ్రామణీర్వః


అర్థం 


యః = ఏ సూర్యుడు

ఉదయగిరి గత: = ఉదయ పర్వతాన్ని పొందినవాడై

వ్యగ్రైః = అంతటా ప్రసరించుచున్నట్టియు

అగ్ర్య = తూర్పు దిక్కునందున్న

గ్రహ = గ్రహాలైన

ఇందు = చంద్రుడు మొదలగు వారియొక్క

గ్రసన = తిరస్కరించుట యొక్క

గురుభరైః = గొప్ప భారం కలవియును,

నో సమగ్రైః = సంపూర్ణములు కానివియును

ఉదగ్రైః = పెద్దగా పెరుగుచున్నట్టియును

ప్రత్యగ్రైః = వినూత్నములైనట్టియును

ఈషత్ + ఉగ్రైః = కొద్దిగా వేడిని కలిగినట్టివియును

గోగణైః = కిరణ సమూహములచే

అహ్నాం + అగ్రే = పగళ్ళ యొక్క ప్రారంభమున (ఉదయ కాలంలో)

గాం = భూమిని

ఉద్గాఢ = మిక్కుటమైన

అర్చిన్ = కాంతులలో

విలీన = కలిసి పోయిన

గ్రావ గర్భాం = శిలలు గర్భమందు కల

అమర నగర నగ = మేరుపర్వతం యొక్క

గౌరయన్ = బంగారు రంగు కలదానిగా

శ్రేయః = శ్రీయస్సును

విధత్తే = కలిగించుచున్నాడో

సః = ఆ

గ్రహ గ్రామణీ = గ్రహ నాయకుడైన సూర్యుడు

వః = మీయొక్క

గహనం = పాపమును

గ్లపయతు = పోగొట్టు గాక


తాత్పర్యం: సూర్యుడు, ఉదయాద్రిపై ఉదయ కాలంలో చకచకా నడుస్తూ తనకు తూర్పుదిక్కునున్న చంద్రాది గ్రహాలను తన లేతకిరణాలలో వెలవెల బోయేటట్లు చేస్తున్నాడు. ఉదయ కాలం కనుక ఆ కిరణాలు సంపూర్ణం కాదు. కొంచెం వేడిగా ఉన్నాయి. పెరుగుతున్నాయి. అట్టి కిరణాలచే ఈ భూమిని, ఆ కాంతులను తమలో ఇముడ్చుకొని బంగారు రంగులో ప్రకాశిస్తున్న మేరు పర్వత శిలలు కలదానిగా చేస్తూ శ్రేయస్సును కలిగిస్తున్నాడు. అట్టి గ్రహనాయకుడైన సూర్యుడు మీ పాపాలను పోగొట్టు గాక!


ఈ పుస్తకం ఇంకా దొరుతుందో లేదో తెలియదు. ఇంత మంచి కవిత్వం సంస్కృత సాహిత్యాభిమానులకు అందుబాటులోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.


దివః కిం బాన్ధవః స్యాత్ప్రియసుహృదథవాచార్య ఆహోస్విదర్యో

రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమోజః

ఏవం నిర్ణీయతే యః క ఇవ న జగతాం సర్వథా సర్వదాసౌ

సర్వాకారోపకారీ దిశతు దశశతాభీషురభ్యర్థితం వః


“ఈ లోకములలో సూర్యుని ఏమని భావించాలి? దేవుడనియా? బంధువనియా? ఆచార్యుడనియా? లేక కులీనుడైన ప్రభువనియా? అది కాకుంటే సర్వలోక రక్షకుడనియా? మరి సూర్యుని లోకాలకు కన్నులాంటివాడందామా? దీపమందామా? పోనీ పూజ్యుడందామా? లేక ప్రాణమే అందామా? జన్మ కారణమందామా? పైన చెప్పినవారిలో సూర్యుడ్ని ఎవరని చెప్పగలం? నిజానికి వీరిలో ఒక్కడని సూర్యుని వర్ణించలేము. ఎందుకంటే సర్వ కాలాల్లో, సర్వ విధాలా, సర్వాన్నీ ఇచ్చేవాడు సూర్యుడు. సర్వ దేవత రూపమున, బాంధవాది రూపమున, లోకాలకు మహోపకారం కలిగించేవాడు సూర్యుడు. అతడు సర్వ దేవతా స్వరూపుడు. అట్టి సహస్ర కిరణ సూర్యుడు మిమ్ములను రక్షించు గాక!”


ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ ధనమిచ్ఛేత్ హుతాసనాత్

ఈశానాత్ జ్ఞానమన్విచ్ఛేత్ మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్


అంటోంది స్కాందం. ఆరోగ్యానికి ఆదిత్యున్ని ఆశ్రయించాలి . ఐశ్వర్యానికి అగ్నిని ఆశ్రయించాలి . జ్ఞానానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి . అలాగే మోక్షానికి జనార్దనుడిని ఆశ్రయించాలి . అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్కడు అధిపతి. “వైద్యోనారాయణోహరిః“ కదా. అంచేతనే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడయ్యాడు.


                       స్వస్తి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: