🙏🙏🙏తోలుబొమ్మలాట -ప్రదర్శన -చరిత్ర మొదటిభాగం
తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.
తోలు బొమ్మలాట ఆట చూద్దాము చదవండి
ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. మైకులు వంటి సాధనాలు లేకుండా విశాలమైన మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వారి గొంతు స్థాయిని ఊహించుకొనవచ్చును.ఏ వ్యక్తి బొమ్మలను ఆడిస్తాడో ఆ వ్యక్తి తానే పాడుతూ, పాటకు అనుగుణంగా బొమ్మను ఆడిస్తాడు. రెండు బొమ్మలను ఆడించే సమయంలో బొమ్మలమధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మలను చేతితో కొట్టిస్తాడు. అదే సమయానికి క్రింది బల్లచెక్క టకామని నొక్కుతాడు. ఈ సమయంలో మిగిలిన వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళూ, డబ్బాలూ, ఈలలూ, కేకలతో బీభత్సం సృష్టిస్తారు.
తోలుబొమ్మ లాటలలో గాయకులకు హార్మోనియం శృతిగా ఉంటుంది. తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతే కాదు, వాళ్ల కాళ్ళక్రింద బల్లచెక్కలుంటాయి. ఆయా ఘట్టాలననుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాలలో ఈ చెక్కలు టకటకా త్రొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. నగారా మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. ఉరుములు ఉరిమినట్టూ, పిడుగులు పడ్డట్టూ డబ్బాలు మ్రోగిస్తారు.
తోలుబొమ్మలు
తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక, దుప్పి, మేక ఈ మూడు రకాల జంతువుల తోళ్ళను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోను, గ్రీసుదేశంలో ఒంటె చర్మంతోను తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చితోళ్ళను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండమీద లేదా చదునైన చాపమీద పరచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పల్చటి చర్మపుపొరను పదునైన కత్తి సహాయంతో తీసివేసి మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహాయంతో చతురస్రాకారపు చెక్కకు బిగించి ఆరవేస్తారు. ఈవిధంగా చేయడం వల్ల మిగిలిన కొద్దిపాటి నలకలు ఉంటే అవిపోతాయి. ఇన్ని దశల్లో శుభ్రపరచిన తోలు పలచనిపొరగా, పారదర్శకంగా తయారై దీపపుకాంతి ప్రసరించే విధంగా అవుతుంది.
జింక చర్మాలను దేవతలు, పౌరాణిక కథానాయకులలాంటి ముఖ్యమయిన పాత్రల బొమ్మలను తయారు చెయ్యడంలో ఉపయోగిస్తారు. లేడి చర్మం బాగా మన్నిక గలది గనుక దీనిని భీముడు, రావణుడు లాంటి యోధుల బొమ్మలను తయరు చెయ్యడానికి ఉపయోగిస్తారు. హాస్యపాత్రల వంటి మిగిలిన బొమ్మల కోసం సులభంగా దొరికే గొర్రె చర్మాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక్కొక్క బొమ్మ తయారు చెయ్యడానికి ఒక చర్మం సరిపోతుంది. కానీ రావణుడు వంటి కొన్ని బొమ్మలు తయారు చెయ్యడానికి ఎక్కువ చర్మం అవసరమవుతుంది. రావణుడి బొమ్మను తయారు చెయ్యడానికి కనీసం నాలుగు చర్మాలు అవసరమౌతాయి. శరీరం కోసం ఒక చర్మం, కాళ్ళ కోసం ఒక చర్మం, రెండు జతల చేతుల (ఒక్కొక్కటి ఐదు చేతులు) కోసం రెండు చర్మాలు. ఎంపికచేసుకున్న బొమ్మలకు రేఖాచిత్రాల ఆధరంగా ప్రకృతిసిద్దమైన కరక్కాయ, చింత గింజలపొడి, అన్నభేది మొదలైన రంగులచే తోలుబొమ్మలకు ఇరువైపుల రంగులు వేస్తారు. ప్రస్తుతం ఆధునికులు పారదర్శకమైన రంగులను ఉపయోగిస్త్తున్నారు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి