15, సెప్టెంబర్ 2025, సోమవారం

అర్చకుని తపస్సు

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


అర్చకశ్య తపోయోగాత్, 

అర్చకస్యాతి శ్యాయనాత్,

అభి రూప్యాచ్చ బింబానాం, 

దేవ సాన్నిధ్య మృచ్ఛతి.


తాత్పర్యము: అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహములు దైవ సాన్నిధ్య శక్తిని కలిగి లోకానుగ్రహము కలిగించగలవు.... మనుస్మృతి ..  


విశ్లేషణ: ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయం వద్ద కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది.


అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. 

యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. 

ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. 

భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. 

ప్రపత్తి కలిగివుండాలి. 

ప్రపత్తి అంటే శరణాగతి. 

ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి ఆ మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఆ ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. అందుకే కొన్ని ఆలయాలలో నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో అర్చకునిదే.


                     🙏🙏

కామెంట్‌లు లేవు: