తెలుగు నేల
అలతి పదమ్ముల నన్నమాచార్యుండు
హరికీర్తనమ్ముల నల్లె నిచట
భద్రాద్రిరాముని ప్రస్తుతి చేసి తా
రమ్యతన్ గీర్తించె రామదాసు
మువ్వగోపాలుపై మురిపెంపు పదములన్
బల్కి క్షేత్రయ్యిట బడసె ముక్తి
స్వరబ్రహ్మ త్యాగయ్య వరలినభక్తితో
దివ్యకీర్తనముల తీర్చె నిచట
వసుధ వరలెడి గాన విద్వాంసులకును
జానపదులకు సంగీతజ్ఞానులకును
భక్తి సంగీత జ్ఞానమ్ము పంచినట్టి
దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల
శ్రీవేంకటేశ్వర క్షేత్రమ్ము వెలసియు
విశ్వమ్ము నందున వినుతి చెందె
లక్ష్మీనృసింహుని సుక్షేత్రరాజమై
విలసిల్లె యాదాద్రి విభవముగను
భవ్యగోదావరీ పావనతీరాన
భద్రాద్రినిలయము పరిఢవిల్లె
దివ్య ద్వాదశలింగతీర్థమై నటువంటి
శ్రీశైలలింగ మీ క్షితిని వెలసె
సకల హరిహరక్షేత్రాల సంగమంబు
భవ్య పావన వాహినీ ప్రాంతయుతము
హరిత కానన విరిసస్య భరిత మైన
దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగునేల
బసవపురాణమున్ ప్రజల కందించిన
పాల్కురికి కవీంద్రు ప్రాంత మిద్ది
తెలుగుభారతమును తీర్చి దిద్దిన యట్టి
నన్నయ్య యున్నట్టి మన్ను యిద్ది
భారత గ్రంథానపదునైదు పర్వాల
చెప్పిన తిక్కన క్షేత్ర మిద్ది
భాగవతమ్మును భక్తాళి కిచ్చిన
పోతన బుట్టిన పుడమియిద్ది
భారతేతిహాస పురాణ వర్గములును
భవ్య సాహిత్య జటిల ప్రబంధములును
నెలవుగా పొంది దశదిశల్ వెలిగినట్టి
దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి