5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

గురువునకు వందనపంచకము

 గురుపూజోత్సవం సందర్భముగా...

🔯 *గురువునకు వందనపంచకము* 🔯



కం. 1

వాత్సల్యముతో గూడియు 

మత్సుతులని హృదయమందు మలినము లేకన్ 

కుత్సితబుద్ధుల సహితము 

సత్సంతుగ జేయువాడె సద్గురువిలలో 


కం. 2

మనముల తిమిరము దొలుగగ 

ఘనవిజ్ఞానము జొనుపుచు ఘనులుగ జేయన్ 

తన తపమును ననవరతము 

కొనసాగించెడి గురునిల కొలువగవలయున్ 


కం. 3

విద్యాబుద్ధుల నేర్పుచు 

సద్యోజ్ఞానము నొసగును చదువులబడిలో 

నుద్యద్యజ్ఞమె యవ నన 

వద్యుడు గురువు తెలియంగ వందితగుణుడౌన్ 


కం. 4

చదువుల నేర్పే క్రమమున 

ముదమారగ శిష్యుజేరి బోధించుటలో 

కదిలించు నాపదైనను 

విదిలించుకపోవు గురునకు వేవేలనతుల్ 


కం. 5

గురువే తల్లియు దండ్రియు 

గురువే దైవమ్ము లోకకోటులకెల్లన్ 

గురువే బ్రహ్మము ధర్మము 

గురువే మోక్షమ్ము వాని గొలిచెద సతమున్ 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: