ప్రాప్య ప్రమాణ పదవీం,కో నామాస్తి,తులే! అవలేపః -తే?
నయసి గరిష్ఠ మధస్తాత్-,లఘుతర ము చ్చయిస్తరం కురుషే
అర్థము:--ఓ! త్రాసా! అధికారయుతమైన పదవిని చేరిన నీకు ఏమిటి యింత గర్వం? బరువైన దానిని క్రిందకు తోస్తున్నావు, అతి తేలిక పదార్థానికి యెంతో ఉచ్ఛ స్థాయి .
కల్పిస్తున్నావు తర్వాత యింకా నిర్మొహమాటంగా మరో శ్లోకం చెప్పాడు.
యస్యాస్తి సర్వత్ర గతి: స కస్మాత్ స్వదేశ రాగేణ హి యాతి భేదం
తాతస్య కూపోయ మితి బ్రువాణాః క్షారం జలం కే పురుషా: పిబంతి
అర్థం:-- ఎక్కడికైనా పోగల శక్తి కలవాడు,స్వదేశమనే అనురాగం తో ఎందుకు దుఖాలు అనుభవిస్తాడు?
మా నాన్నగారి బావి యిది అని చెప్పుకొని ఆ బావి లోని ఉప్పు నీళ్ళే ఎవరు త్రాగుతారు?ఈ మాటలు చెప్పి కాళిదాసు రాజాస్థానం వదిలి వెళ్ళిపోయాడు.
అవజ్ఞా స్ఫుటితం ప్రేమ సమీకర్తుం క ఈశ్వరః?
సంధిం న యాతి స్ఫుటితం లాక్షా లేపేన మౌక్తికం
అర్థము:--అవమానంచేత విరిగి పోయిన స్నేహాన్ని తిరిగి కలిపేందుకు ఈశ్వరుడు మాత్రం సమర్థుడా?
ముత్యం పగిలి పోతే లక్క పూసి దాన్ని అతికించ గలమా?
కాళిదాసు రాజభవనానికి రావడం మానేశాడు.దాంతో భోజరాజుకు మనశ్శాంతి కరువైంది.యిన్ని సంవత్సరాల స్నేహం తర్వాత ఆ మహా కవితో మాటలే లేకుండా కాలం గడపటం ఆయన వల్ల కావడం
లేదు.ఎప్పుడూ ఏదో పరాకుగా,చిరాకుగా వుంటున్నాడు.
ఏమయింది స్వామీ! మీరెందు కిలా యెప్పుడూ అశాంతిగా.అన్యమనస్కంగా వుంటున్నారు?అని ఒక నాడు అడిగింది భార్య లీలావతి.దానికి కారణం కాళిదాసు తనకు దూరమవడమే అన్నాడు రాజు.అప్పుడు లీలావతి యిలా అనింది.స్వామీ మీకు అన్ని విషయాలూ తెలుసు.
.
స్నేహోహి వర మఘటితః, న వరం సంజాత విఘటిత స్నేహః
హృత నయనో హి విషాదీ,న విషాదీ భవతి స ఖలు జాత్యన్దః
అర్థము:--కుదిరి బెడిసిన స్నేహం కన్నా స్నేహం కుదరకపోతేనే నయం, పుట్టుగుడ్డి వాడికి విషాదం వుండదు.మధ్యలో కళ్ళు పోగొట్టుకున్న వాడికే విషాదం.
ఏమయినా కాళిదాసు పుంభావ సరస్వతి. సరస్వతీ దేవి పురుషావతారం.ఆయన్ని యితర
విద్వాంసుల కన్నా మిన్నగా గౌరవించ వలిసిందే చూడండి.
దోషాకరోపి,కుటిలోపి,కళంకితోపి,
మిత్రావసాన సమయే విహితోచ్చయోపి
చంద్రః, తథాపి, హర వల్లభతాం ఉపైతి!
నైనాశ్రితేషు గుణదోష విచారణ స్యాత్
అర్థము:--చంద్రుడు దోష-ఆకరుడు=దోషాలకు నెలవు.రాత్రి చీకట్లోనే ఆయనకు నెలవు,చంద్రుడు
కుటిలుడు అంటే వంకర బుద్ధి కలవాడు,(వంకరగా వుంటాడు కదా! ). కళంకితుడు,మచ్చ గలవాడు. ఎన్నో పాపాలు చేసినవాడు,మిత్రుడి (సూర్యుడి)అవసాన సమయం లో తాను వృద్ధి పొందుతాడు ,అయినా అతడు శివుని సాన్నిహిత్యాన్ని పొందే వున్నాడు.ఆశ్రితుల పట్ల గుణ దోష విచారణ వుండదు.
మనసుకు నచ్చేట్టుగా భార్య చెప్పిన సలహా విని రాజు ప్రియా!నీవు చెప్పినది నిజమే రేపే కాళిదాసును
పిలిపిస్తాను అన్నాడు.మరుదినం రాజు కొలువు తీరాడు.సేవకుడిని పంపి కాళిదాసును తీసుకొని రమ్మని పంపించాడు.కాళిదాసు చాలా రోజుల తర్వాత రాజాస్థానం లోకి పునః ప్రవేశం చేశాడు.భోజుడు సింహాసనం నుంచి దిగి వచ్చి మహాకవికి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి చేయి పట్టుకొని తెచ్చి సభలో కూర్చుండ బెట్టాడు.అది చూసి బాణుడు ఈ శ్లోకం చెప్పాడు.
భోజః కళావిత్- రుద్రో వా కాళిదాసస్య మానవాత్
విబుధేషు కృతో రాజా, యేన దోషాకరోప్యసౌ
అర్థము:--భోజరాజు కాళిదాసును గౌరవించటం చేత రసిక రాజులలో పరమేశ్వరుడని పించుకున్నాడా?
ఆ రుద్రుడు దోషాకరుడైన(రాత్రి రాజు)చంద్రుడిని,విబుధులలొ(దేవతల లో )వుత్తముడిగా
చేశాడు.ఈ రాజ పరమేశ్వరుడు కూడా దోష-ఆకరుడైన కాళిదాసును విబుధుల లో(కవి,పండితులలో)రాజును చేశాడు.
కె.వి.రమణ మూర్తి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి