4, నవంబర్ 2025, మంగళవారం

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

 

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

మనలో అగ్గిపెట్టె ఫోను గురించి తెలియని వాళ్ళు ఎందరు వున్నారు చెప్పండి. ఈ రోజుల్లో పిల్లకు ఆడుకోవటానికి అనేకమైన ఆట వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి.  అంతే కాక వాటిని కోనేటంత ఆర్థికస్తోమత ఈ నాటి తల్లిదండ్రులకు వుంటున్నది. చిన్నపిల్లల చేతుల్లో కూడా సెల్ఫోనులు, టాబిలెట్లు, లాప్టాప్లు ఉండటం చేత వాళ్లకు వాళ్ళ తెలివితేటలతో ఆటవస్తువులను చేసుకొని ఇతర స్నేహితులతో కలిసి ఆడటానికి తగిన సమయంలేదు అంతే కాకుండా వాళ్లకు తెలియనుకూడా తెలియదు. అన్నీ ఆధునికమైన ఆటవస్తువులే వాటి ఖరీదులు ఆకాశాన్ని అంటుతున్నా కూడా తల్లిదండ్రులు కొనక మానటం లేదు.  కానీ పూర్వకాలంలో అట్లా కాదు ఒక ఇంట్లో ఐదు నుండి పదిమంది పిల్లలు ఉండేవారు ఒకడు హైస్కూలు చదువు చదువుతుంటే ఇంకొకడు ప్రేమారి స్కూల్లో ఇక చిన్నది లేక చిన్నవాడు అమ్మ వడిలో బడినుంచి వచ్చిన పిల్లలకు ఇంట్లోకి రాగానే తన తమ్ముడు లేక చెల్లెలిని ఎత్తుకొని ఆడించే పని ఉండేది అమ్మా వీడు ఏడుస్తున్నాడు. వీడు ఉచ్చపోశాడు, దొడ్డికి పోయాడు అని తల్లితో చెపితే వంట చేసుకుంటున్న తల్లి తన చేతిని పవిట కొమ్ముకు తుడుచుకొంటూ ఏరా తమ్ముడిని చూసుకోలేవా ప్రతిదానికి నన్ను పిలవాలా అవతల పోపు మాడిపోతున్నది, దోశ కాలిపోతుంది అని విసుకు కుంటూ వచ్చి చంటి పిల్లవాడిని చూసుకుంటుండేది.  మరి ఇప్పుడు యెడ పిల్లలకు చంటిపిల్లలను చూసుకునే ప్రేమ, భాద్యత లేదు. అందుకే పిల్లలకు వాళ్ళ తోబుట్టువులమీద తల్లిదండ్రులమీద ప్రేమ సన్నగిల్లుతుంది. అవునా కాదా. ఇంట్లో చంటివానికి విరోచనాలు అయ్యాయి అంటే ఇంటిల్లపాతి మేలుకొని ఉండేవారు.  భగవంతుడా మా తమ్ముడికి విరోచనాలు తొందరగా తగ్గించేయి   అని . విజ్ఞేశ్వర నీకు 11 గుంజిళ్లు తీస్తాను అని మరీ మొక్కుకునేవారు. అది అన్నా లేక అక్కల ప్రేమ తల్లులు పిల్లలను కంటే అక్కలు వాళ్ళను సాకేవారు. పోత పాలమీద వున్న పిల్లలైతే పాలు పట్టటం కూడా అక్కల పనే .  సీతా  రా ఆడుకుందాము అంటే ఉండేవే మా తమ్ముడికి పాలు పట్టి వస్తా అనే సీతలు లక్స్మీలు నాగమణిలు ఎంతమందో మీకు జ్ఞాపకం ఉందా, తొక్కుడుబిళ్ల, దాగుడు మూతలు, గుంజిళ్ళు ఆడుతూ ఆడపిల్లలు వీధులలో ఉండేవారు. మరి ఇప్పుడు చూద్దామన్నా ఒక్కళ్ళు కూడా లేరు. వీధిలో ఆడుకునే పిల్లలతో తండ్రిగారి స్నేహితులు ఎమ్మా మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అంటే ఒక్కొక్కసారి వున్నారని లేకపోతె ఆటలో నిమగ్నులైన పిల్లలు ఆదమరచి మా నాన్నగారు ఇంట్లో లేరు అంటే మరుసటిరోజు ఆయన వచ్చి ఏమండీ సీతారామయ్యాగారు నిన్న మీరు ఇంట్లో లేరా ఎక్కడిపోయారు అని అడిగితె అప్పుడు నాన్నగారు నేను ఎక్కడి వెళ్ళాను ఇంట్లోనే కదా వున్నాను, అంటే మీ అమ్మాయి సీత మీరు ఇంట్లో లేరని అన్నదే అంటే ఎమ్మా నేను లేనని అన్నవా మామయ్యతో అని అడిగితె ఏమో నాన్న  నాకు జ్ఞాపకం లేదు అనే అమ్మాయిలు కోకొల్లలు. నిజానికి తోటి స్నేహితులతో ఆటలాడే పిల్లలకు వారి లోకమే వేరు వారికి ఇల్లు, తల్లిదండ్రులు మదిలో వుండనే వుండరు. అది కదా బాల్యం అంటే. ఇట్లా చెప్పుకుంటూ వెళితే అనేకమైన విషయాలు ఉంటాయి. ఇక విషయానికి వద్దాం. 

చిన్నప్పుడు స్వయంగా చేసుకొని ఆదుకునే ఒక ఆట టెలిఫోను ఆట. ఆ రోజుల్లో గడ్డఫోను (P&T ) ఫోన్ ఏ కొంతమంది ధనవంతులకు మాత్రమే వుండెది ఎప్పుడైనా ఏ పిల్లవాడో అరే నేను హైదరాబాదులో  మా మామయ్యా వాళ్ళ ఇంట్లో ఫోనులో మాట్లాడాను తెలుసా అని ఒక రమణారావు అంటే వాడి చుట్టూ తోటి స్నేహితులందరూ చేరి అరె ఫోను యెట్లా ఉంటుంది అందులో మాటలు యెట్లా వస్తాయి ఆ హ్యాండిల్ యెంత బరువు ఉంటుంది. నీవు మాట్లాడింది నల్ల ఫొనేనా లేక అది ఇంకో రంగులో ఉందా అని అనేక ప్రశ్నలతో ముంచెత్తు తారు . వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు చెప్పే రమణారావు తన తోటి స్నేహితులకన్నా తానూ ఎంతో గొప్ప పని చేసినట్లు బిల్డప్ చేసి వాళ్ళతో ప్రవర్తించటం. చాలామందికి  గతంలో వున్న అనుభవమే. 

పిల్లలలో కొంత తెలివితేటలు ఎక్కువ వున్న వాళ్ళు అగ్గిపెట్టి ఫోను చేసేవారు.  దానిని తోటి స్నేహితులు ఒకరి తరువాత ఒకరుగా మాట్లాడే వారు. అరే నేను ముందు అంటే నేను ముందు అని పోట్లాడుకునే వారు. ఈ ఫోను తయారీకి రెండు అగ్గి పెట్టలను తీసుకొని వాటిలొని లోపలి అరలను తీసుకొని ఫై కేసును పారేసి అరలమధ్యన ఒక పిన్నీసుతో చాలా  జాగ్రత్తగా ఒక సన్నని రంధ్రాన్ని చేసి దానిలోకి దారాన్ని పంపి ఆ దారానికి ఒక చిన్న చీపురు పుల్లను కట్టాలి. దారం ఒక 10 నుంచి 20 అడుగులు తీసుకొని దాని రెండొవ కొసకు కూడా ఇదేవిధంగా అగ్గిపెట్టె అరను కట్టాలి. ఇక మీ ఫోను సిద్ధం. ఈ ఫోను తయారు చేయటానికి నైపుణ్యం వున్న బాలునికి ఒక పది నిముషాలు చాలు. ఒక వైపు వున్న  అగ్గిపెట్టను (అరను) నోటి ముందు పెట్టుకొని మాట్లాడితే రెండవ వైపు అగ్గిపెట్టెను అవతలి వాడు చెవిలో పెట్టుకొని వింటే మాట వినపడుతుంది. తరువాత రెండవ వాడు తన అగ్గిపెట్టెను నోటిముందు పెట్టుకొని మాట్లాడితే మొదటివాడు తన అగ్గిపెట్టను చెవిలో పెట్టుకొని వినవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మైక్రోఫోనుగా స్పీకర్ గా  ఒకే అగ్గిపెట్టి పని చేస్తుందన్నమాట. ఇట్లా మాట్లాడేటప్పుడు రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి దారం సాధ్యమైనంత గట్టిగ ఉండాలి. రెండు. ఆ దారాన్ని ఎవ్వరు తాకకూడదు. మొదటి వాడు అగ్గిపెట్టి ముందు మాట్లాడితే ఆ శబ్ద తరంగాలు అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని తాకి శబ్ద తరంగాలకు అనుగుణంగా అది కదిలి ఆ తరంగాలను దారం ద్వారా రెండవ అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని కదిలించి మరలా శబ్దాన్ని పుట్టిస్తుంది. ఇది అది పనిచేసే విధానం. నిజానికి ఇందులో పూర్తిగా ఫిజిక్స్ వున్నది.  కానీ ఏ మాత్రం శాస్త్రీయ పరిజ్ఞానం లేని ఆ వయస్సులో అది తయారుచేయటం. దానిని ఉపయోగించి ఆడుకోవటం నిజంగా ఒక ఆనందదాయకమైన విషయం కదా. మీరేమంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ

 


  

కామెంట్‌లు లేవు: