✒️💐తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి సందర్భంగా💐✒️
*జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు.* తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి, అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు........
*ఉత్తమమైన కవిత్వం అలవడితే సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమపదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.*
*#ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.*
‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి.
ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.
400 లకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చెళ్లపిళ్ల సత్యం గారి ముత్తాతగారే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.
ఆ కాలంలోనూ చెళ్లపిళ్లవారి రచనా వ్యాసంగం తిరుపతి వేంకటీయంగానే సాగింది. అవధానాల రూపంలో ఈ జంట కవులు పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.
*#కవులకు మీసాలెందుకని......*
తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!
దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
*#అష్టావధాన, శతావధానాలు:*
తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.
*#బాల్యం-ఉద్యోగం:*
వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 8-8-1870న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్యలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వేంకటాచలం. బాల్యంలో బడికి వెళ్లకుండా తోటి పిల్లలతో గోళీలు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరిగినా, కాలక్రమంలో బుద్ధి కలిగి ఏళ్లలో నేర్వదగిన విద్య నెలల్లో ఆర్జించారు. ‘శాస్త్రి సామాన్యం ఎత్తు, చామనఛాయ, బహు చురుకైన మొహం, పిల్ల జుట్టు, కంచు గంట లాంటి గొంతుక, పండిత శాలువా పైనవేసుకొని, పంచ ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.
వేంకట కవి బందరు హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించింది.
*#కంచు కంఠం:*
‘కవనార్థంబుదయించితిన్ సుకవితా కావ్యంబె నా వృత్తి’ అని చెప్పుకొన్నారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. పద్య పఠనంలో ఆయనది ఒక కొత్త తీరు. ఆయనలా పద్యాలు చదవాలని ఎందరో ప్రయత్నించినా, ఆ కంచు కంఠం అందరికీ రాదు కదా. ప్రతి విషయంలో తనదొక ప్రత్యేకత అన్నట్టు వేంకటశాస్త్రి వ్యవహరించేవారు.
చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు.
*#శతకంల రచన:*
ఆయన కామేశ్వరి శతకం, ఆరోగ్య కామేశ్వరి శతకం రచించారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కామేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ వీరు రాసిన ఆరోగ్య కామేశ్వరి శతకంలో స్వవిషయాలు, తిరుపతి కవి గురించిన పద్యాలు ఉన్నాయి. అనంతర కాలంలో వెలువడిన ఆరోగ్య శతకాలకు వీరి శతకం మార్గదర్శనమైంది. తాను వ్రణంతో బాధపడుతున్నప్పుడు శారీరక బాధను, మానసిక వేదనను కామేశ్వరి శతకంలో దేవికి విన్నవించుకున్నారు.
*#గొప్ప వక్త.:*
వేంకటశాస్త్రి గొప్ప వక్త. అమిత భాషి. యౌవనంలో ఆయన ఉపన్యాస వాణి మేజువాణి. షష్టిపూర్తి తరవాతా వారి కంఠంలో ఝంకారం, మాధుర్యం తగ్గలేదు. ఆయనది శాఖాచంక్రమణం. అనేక విషయాల్లోకి చొచ్చుకుపోయేవారు. పద్యాలను, పిట్ట కథలను, సంఘటనలను, గానాన్ని, హాస్యాన్ని మేళవించి పంచామృతంగా ఉపన్యాసం అందించేవారు. ఏం మాట్లాడినా అది ధ్వని కావ్యం.
‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు.
*#శిష్యగణం:*
వేంకట కవికి గణనీయమైన గొప్ప శిష్యగణం ఉంది. ఆయన బందరు పర్రల్లో కవుల్ని సృష్టించారని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. పింగళి, కాటూరి, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి వీరి శిష్యులు విద్వత్ కవులుగా వాసికెక్కారు. పింగళి, కాటూరి కవులు తమ సౌందరనంద కావ్యాన్ని చెళ్లపిళ్ల వారి షష్టిపూర్తి సందర్భంలో సమర్పిస్తూ వారిని ‘అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’గా సంభావించారు.
శాస్త్రి గ్రాంథిక భాషా కవిత్వంలో పుట్టి పెరిగినా, చివరి దశలో వ్యావహారిక భాషను ఆదరించారు. వచనంలోనూ అమూల్యమైన రచన చేశారు. కృష్ణా పత్రికలో ప్రచురితమైన వారి కథలు, గాథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి తెలుగు భాషా సాహిత్యాలకు విజ్ఞాన సర్వస్వాలు. వ్యావహారిక భాషా సౌందర్యానికి తరగని గనులు.
*#అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే.....*
అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.
ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!
*#కాశీయాత్ర:*
వారి ‘కాశీయాత్ర’ యాత్రా సాహిత్యంలో విశిష్టమైనది. ఆధునిక, సాంఘిక చరిత్రకు విలువైన ఆధార గ్రంథం. ఆనాటి ఉత్తర హిందూస్థానం విశేషాలు, నాటి సామాజిక పరిస్థితులు ఈ గ్రంథంలో చూడవచ్చు.
*#మానవతావాది:*
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు గొప్ప మానవతావాది. వీరు కవికోకిల శ్రీ జాషువా గారి పాదాలు కడిగి, వారికి కాలికి గండపెండేరం తొడిగి, ఇలా అన్నారు--- "ఈ మహాకవి పాదాలు తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను"
*#పాండవ ఉద్యోగ విజయాలు:*
పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై కూర్చోపెట్టిన ఘనత వీరిదే
సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.
#వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ. వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు మొదలైన వారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.
80వ పడిలో 1950 ఫిబ్రవరి15న శివైక్యం పొందారు వేంకటశాస్త్రి.
*బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.*
🙏🙏🏵️🌷🌸🙏🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Palanadu district.