1, సెప్టెంబర్ 2020, మంగళవారం

అయోధ్యా పట్టణం ఎవరు నిర్మించారు

*జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*

సందేహం;- అయోధ్యా పట్టణం ఎవరు నిర్మించారు? అక్కడికి సరయూ నది ఎలా వచ్చింది?

సమాధానం;- ఈ భూమి పాలనా బాధ్యతను బ్రహ్మ సూర్యుని కుమారుడైన వైవస్వత మనువుకు అప్పగించాడు. ఆ వైవస్వత మనువే అయోధ్యా పట్టణాన్ని నిర్మించి, దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆయన భార్య పేరు శ్రద్ధ, గురువు వశిష్ఠుడు.

పూర్వకాలం రాజులకు తమ ప్రాభవం చాటుకోవడానికి, లోక కల్యాణానికి యజ్ఞాలు, యాగాలు చెయ్యడం అలవాటు. అలాగే ఒక యజ్ఞం జరిపించమని వశిష్ఠుడిని అడిగాడు. అపుడు వశిష్ఠుడిలా అన్నాడు. *రాజా! నీవు అనుకున్న యజ్ఞం చేయించడం నాకు ఆనందమే. కానీ ఇక్కడ ఒక నది కాని, తీర్థం కాని లేవు కదా! నది లేని చోట యజ్ఞం చెయ్యలేం కదా* అన్నాడు. *ఏం చెయ్యమంటారు గురుదేవా?* అని రాజు అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు *నీవు నీ బాణాన్ని సంధించి మానస సరోవరం నుండి ఒక నదిని రప్పించు* అని ఆజ్ఞాపించాడు. రాజు వెంటనే సంకల్పం చేసి ఒక బాణాన్ని సంధించి విడిచాడు. ఆ బాణం వేగంగా హిమాలయాల్లోని మానస సరోవరం వెళ్ళి అక్కడ నుండి ఒక మనోహరమైన నదికి మార్గాన్ని చూపుతూ, అయోధ్యా నగరానికి తీసుకువచ్చింది.

ఆ నది శరము (బాణం) చేత తీసుకొని రాబడింది గాబట్టి *శరయూ* అని, మానస సరోవరం నుండి తేబడినది కాబట్టి *సరయు* అని పిలువబడింది. ఆ సరయూ తీర్థంతో వైవస్వత మనువు తాను తలపెట్టిన యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు.

ఇపుడు మనం వైవస్వత మన్వంతరంలోనే ఉన్నాం.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: