13, సెప్టెంబర్ 2020, ఆదివారం

🌺 *ఓం నమో నారాయణాయ* 🌺




*212. అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందుధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరికృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.*


*భావము:* ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువునకూ, బ్రహ్మదేవునకూ, చంద్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.



*213. "చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు; శర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ, డన్యుల కెక్కడి దసురులకును మాకు; బ్రహ్మాదిపూజితపదుఁ వయిన దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడ వైతి; పద్మజాదులు భవత్పాదపద్మ మకరంద సేవన మహిమ నైశ్వర్యంబు;లందిరి కాక యే మల్పమతుల*
213.1
*మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము నీకృపాదృష్టిమార్గంబు నెలవు చేర నేమి తప మాచరించితి మెన్నఁగలమె?మమ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!*


*భావము:* "ఓ మంగళస్వరూపా! బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంక ఇతరులనగా ఎంత. బ్రహ్మాదేవుదు మున్నగువారిచేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాద్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమవల్ల బ్రహ్మాదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ, మేము చాలా అల్పులము. నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడంవల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.



*214. అదియునుం గాక.*


*భావము:* అంతేకాకుండా.

కామెంట్‌లు లేవు: