24, డిసెంబర్ 2020, గురువారం

ధార్మికగీత - 118*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 118*    

                                       *****

    *శ్లో:- వదనం ప్రసాదసదనం౹ సదయం*

           *హృదయం ౹ సుధాముచో వాచః ౹* 

           *కరణం పరోపకరణం౹ యేషామ్*

           *కేషామ్   న   తే   వంద్యా: ౹౹*

                                  *****

*భా:-లోకంలో కొందరిని చూసినా, మాట్లాడినా, భావసారూప్యం కలగలిపినా జీవితంలో మరచిపోలేము. వారి సుగుణాలు నిశితంగా పరిశీలన చేస్తే 1."వదనం":-వారి ముఖంలో స్వచ్ఛత,పవిత్రత,ప్రశాంతత,ఆనందం సదా వెల్లివిరుస్తుంటుంది. చూడగానే మన పాపాలు, తాపాలు పూర్తిగా సమసి పోయినంత తృప్తి కలుగుతుంది. 2. "హృదయం":- ఎటువంటి తప్పునైనా, చల్లని చూపులతో  క్షమించగల 'దయాగుణం' వారి డెందములో  తొణికిసలాడు తుంటుంది. మన అంతరంగాన్ని ద్రవింప జేస్తుంది. 3."వాక్కు":- వారి మృదు మధుర వాక్కులు అమృత తుల్యములై మన మదికి రసానుభూతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ, చింతలను దూరం చేస్తాయి.  4." కరణం":- వారి చేతలు ఆపన్నులకు, సమాజానికి,లోకానికి హితములై,  కళ్యాణ కారకములై భాసిస్తుంటాయి. చిర స్మరణీయంగా నుతింప బదుతుంటాయి.5.అలాంటి మహనీయులు తమ దర్శన, స్పర్శన, భావన, భాషణ లాలిత్యం వల్ల అందరి ఉల్లాలను పల్లవింప జేస్తూ,హృదయాలను పరవశింప జేస్తూ వారు,వీరు అనే తేడా లేకుండా ఎల్లరకు, ఎల్లప్పుడు పూజనీయులు, వందనీయులు కాగలరని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: