1, జనవరి 2021, శుక్రవారం

చిన్న జీయర్ స్వామీ

 చిన్న జీయర్ స్వామీ నేతృత్వంలో వేర్వేరు పేర్లతో కొనసాగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. వాటిలో నాకు తెల్సినవి కొన్ని


#విద్య: ప్రకాశం జిల్లా మార్టూరులో ‘జీవన్ వికాస్’ పేరుతో పేదపిల్లలకోసం పదోతరగతి వరకు పాఠశాల నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి (గిరిజనులకు), ఉట్నూరు మండలం బీర్సాయిపేట, ప్రకాశం జిల్లా కఠారివారాపాలెం (గంగపుత్రులకు) లలో జీయర్ గురుకులాలు నడుస్తున్నాయి.


#వేద_విద్యాలయాలు: శ్రీరామనగరంతో పాటు విశాఖ, సీతానగరం, కరీంనగర్ (ఎల్‌ఎండి) లలో వేదపాఠశాలలు నడుస్తున్నాయి.


#అంధులకు_విద్య: శ్రీరామనగరంలో అంధులైన విద్యార్థుల కోసం జూనియర్, డిగ్రీకాలేజీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లా వారిజలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల నడుస్తున్నాయి.


#ప్రజ్ఞ: ప్రజ్ఞ పేరుతో విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రీరామనగరంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


#అన్నదానం: బదరీనాథ్ అష్టాక్షరీ క్షేత్రం, హృషీకేష్, శ్రీరంగం, మేల్కొటే, తిరుమల, భద్రాచలం, నడిగడ్డపాలెం, సీతానగరం, శ్రీరామనగరంలలో రోజూ ఉచిత అన్నదానం జరుగుతోంది.


#ఆదర్శగ్రామం: ఆదిలాబాద్ జిల్లాలో యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఆదర్శ గ్రామాలను రూపొందించే మహత్తర కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 11 గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్మాణం చేశారు.


#ప్రకృతి విలయాలు: ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు స్వామి వెంటనే స్పందిస్తున్నారు. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు చేయూత ఇస్తున్నారు. గుజరాత్‌లోని వల్లభాపూర్‌లో 88 శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చారు. నేపాల్ భూకంపబాధితులకు తాత్కాలిక సాయం అందిస్తూ, 1.50 కోట్ల ఖర్చుతో విద్యాలయం నిర్మిస్తున్నారు. తమిళనాడులో సునామీ రాగా, నాగపట్నంలో 50 మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. మత్స్యకారుల జీవనం కోసం పడవలు అందించారు. జపాన్‌లో సునామీ సందర్భంగా 11 లక్షల రూపాయలు అందించారు.


#ఉగ్రవాద_నివారణ_కోసం: ఉగ్రవాద నివారణ కోసం మానస సరోవరం తీరంలో బ్రహ్మయజ్ఞం 2002 లో నిర్వహించారు. కార్గిల్  కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు.


#వృద్ధాశ్రమం: గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.


#జిమ్స్: జీయర్ ఇంటిగ్రెటివ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్) పేరుతో శ్రీరామనగరంలో హోమియో మెడికల్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నడిపిస్తున్నారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి విధానాల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు.


#వైద్య_శిబిరాలు: గ్రామీణులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2500 పైగా ఉచిత క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి రెండు లక్షల మంది మహిళలకు చికిత్స అందించారు. 1300 వరకు ఉచిత వైద్య శిబిరాలు, 900 పైగా కంటి చికిత్స శిబిరాలు, 1000 కిపైగా దంత వైద్య శిబిరాలు నిర్వహించారు.


#అవయవదానం: అవయవదానం గొప్ప దానమని భావించిన చిన్నజీయర్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎవరైనా అవయవదానం చెయవచ్చు. అనుకోకుండా ఎవరైనా చనిపోతే, ఆరుగంటల వ్యవధిలో వారి అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు. ఇందుకోసం ముందుకు వచ్చేవారు 040-6636 9369/98492 45948 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు

2019 లో విశాఖపట్నం లొ 90 మందికి పైగా జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యములో అవయవదానం 


#పశువైద్య_శిబిరాలు: పశువులకు ఉచితంగా చికిత్స అందించేందుకు తరచూ పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తూ, ఏటా రెండు లక్షల పశువులకు చికిత్స అందిస్తున్నారు


#ఆలయాల_జీర్ణోద్ధరణ: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు చిన్న జీయర్ శ్రీకారం చుట్టారు.


#గోసేవ: సీతానగరం, శ్రీరామనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి దాదాపు 500 గోవులను రక్షిస్తున్నారు.


#ఖైదీల్లో_పరివర్తన: ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు జీయర్‌స్వామి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా రూపుదిద్దుతున్నారు. వారి కుటుంబాల పోషణకోసం కుట్టుమిషన్లు, సైకిళ్లు తదితర వస్తువులను అందిస్తున్నారు.


#భక్తినివేదన: భక్తినివేదన పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక నడిపిస్తున్నారు.


#పురస్కారాలు: వేదవిద్యావ్యాప్తికి పాటుపడుతున్నవారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైదిక గ్రంథాలను ముద్రిస్తున్నారు.


ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఒకటా.. రెండా.. చెబుతూపోతే కొండవీటి చాంతాడంత ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్), జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (సొసైటీ), వికాసతరంగిణి-భారత్, వికాస తరంగిణి-విదేశాలు స్థాపించారు. ఆకలిగొన్నవారికి ఆహారం అందించేందుకు ప్రధాన కేంద్రాల్లో అన్నదానాల కార్యక్రమం కొనసాగుతోంది. యువతీయుకులకు హోమియో, ఆక్యుప్రషర్‌లలో అవసరమైన ప్రాథమిక శిక్షణ ఇస్తూ, సమాజంలో అవసరమైన వారికి సేవలను అందిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: