10, జనవరి 2021, ఆదివారం

శ్రీమద్రామాయణావతరణము

 🌹శ్రీమద్రామాయణావతరణము🌹 


మనమన ఘనమగు చరితము

కనిపించుచునుండ గాంచి కడుతోషమునన్

ముని యా వాల్మీకి యపుడు

ఘనమగు రామాయణంబు గావించె భువిన్  36 


శ్రీరాము జననంబు క్షితి పతి ప్రేమయు

         గురు వశిష్ఠుని వద్ద కూర్మి విద్య

గాదేయు జన్నంబు కావంగ బోవుట

        తాటకన్ జంపుట దారి యందు

జన్నమ్ము గాచుట జనకుని జేరుట

        శివ ధనుర్భంగమ్ము సీత పెంళ్లి

కైక వరంబులు కానల కేగుట

        పాదుకా దానమ్ము భరతు నకును

దండ కారణ్య సీమకు తరలు టయును

దనుజ నాసిక చెవులను తరుగు టయును

క్రూర ఖరదూష ణాదుల గూల్చు టయును

వర్ణనము జేసె వాల్మీకి వరుసగాను            37 


దశకంఠు చరితమ్ము తరుణి పై మొహంబు

         మారీచు సాయంబు మాయలేడి

సీతాపహరణమ్ము శ్రీరాము శోకంబు

         కపివర్యు మారుతిన్ కలసికొనుట

సురుచిర స్నేహమ్ము సుగ్రీవుపట్టంబు

          కలికి సీతమ్మకై కపులు జనుట

సామీరి పయనమ్ము సంద్రంబు దాటుట

          లంకిణిన్ జంపుట లంక జేరి

ధరణిపుత్రిక సీతమ్మ దర్శనంబు

లంక గాల్చియు వెనుకకు రయము గొచ్చి

సీత విషయము స్వామికి చెప్పు టయును

వర్ణనముజే సె వాల్మీకి వరుస గాను           38 


శ్రీరాము కోపంబు సేతు నిర్మాణంబు

         యుద్ధ సంసిద్ధత యుద్ధితిగను

రామ రావణ ఘోర రణ విశేషంబులు

         కుంభ కర్ణుడు నేల గూలు టయును

సౌమిత్రి మూర్ఛయు సంజీవి గ్రహణంబు

         యిల మీద గూలుట యింద్రజిత్తు

రఘురాము తేజంబు రావణుమరణంబు

          ధర్మసంస్థాపన ధరణి యందు

సీత నగ్నిపునీతను స్వీకరించి

తిరిగి సాకేత పురముకు చేరు టయును

రామ పట్టాభి షేకమున్ రమ్య ముగను

వర్ణ నము జే సె వాల్మీకి వరుస గాను         39



ఆదికవి వాల్మీకి యజుని యానతితోడ

          రామాయణంబును రమ్యముగను

యారు కాండములుగ  నరయంగ రచియించి

           జగతికి నర్పించె జనులు బొగడ

పంచశతములైన ప్రముఖ సర్గల తోడ

           భాసమానమ్ముగా పరిఢ విల్లి

వెరసి యిర్వైనాల్గు వేల శ్లోకాలతో

           నొప్పారె కావ్యమ్ము  నుర్వి యందు

ఘనుడు వాల్మీకి సంయమి  గరిమ తోడ

భవ్య రామాయణమునందు భాగముగను

తదుప రుత్తరకాండమున్ తనరు నట్లు

రమ్య మొప్పoగ పరిపూర్ణ రచన జేసె.        40



                      🌹శుభమ్ 🌹 


           గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: