10, ఏప్రిల్ 2021, శనివారం

మొగలిచెర్ల

 *శ్రీపాద శ్రీవల్లభ మందిరం..1వ భాగం..*


"శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మందిర నిర్మాణం పూర్తి అవుతున్నది కదా..మరి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు అనుకుంటున్నారు?" అని నిన్న ఉదయం ఆ భక్తుడు అడిగాడు.."ఈనెల 11,12,13 వతేదీ లు గా నిర్ణయించాము..13వతేదీ నాడు విగ్రహప్రతిష్ఠ ఉంటుంది.." అన్నాను.."ఆరోజు మేము ఇక్కడికి వచ్చి..ఆ కార్యక్రమాన్ని కళ్లారా చూడవచ్చా?" అన్నాడు.."ఏ ఇబ్బందీ లేదండీ..మీకు వీలుంటే ఆ మూడు రోజులూ ఇక్కడే ఉండండి..భక్తులందరికీ మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం యొక్క మంటపం లోనే ఉండండి.."అన్నాను.."చాలా సంతోషమండీ..నాతోపాటు మరో పదిమందిమి కలిసి వస్తాము..ఆ మూడురోజులూ గురుచరిత్ర పారాయణం కూడా ఇక్కడ చేస్తాము.." అన్నారు..


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొందిన పదిహేనేళ్లకు..ఆ మందిర ప్రాంగణం లోనే నైరుతి దిశలో శ్రీ సాయిబాబా మందిరం నిర్మించారు..ఆ తరువాత కొన్నేళ్లకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడి కి మందిరం ఏర్పాటు అయింది..మళ్లీ ఈనాటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి మందిరము కూడా ఆ ప్రాంగణం లోనే ఉండబోతోంది..మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఉన్న అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం రాబోయే రోజుల్లో ఒక సంపూర్ణ దత్తక్షేత్రం గా మారుతుందని..శ్రీ స్వామివారు ఆనాడే చెప్పివున్నారు..స్వామివారు చెప్పిన ఆ మాటలు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయి..


శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి ఒక చిన్న గుడి కట్టించాలని సంకల్పించాము..ఆ విషయమై నేనూ మా సిబ్బంది తర్జన భర్జన పడుతున్నాము..సంకల్పం చేసాము..సరే..కానీ..మందిర నిర్మాణానికి నిధులు కావాలి..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మనస్ఫూర్తిగా స్వామివారిని మా దంపతులము వేడుకున్నాము.."స్వామీ..ఈ మందిర ప్రాంగణం లో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి కొరకు ఒక గుడి కట్టించాలని అనుకున్నాము..అందుకు మీ ఆశీర్వాదం కావాలి తండ్రీ.." అని..స్వామివారి మీద భారం వేశాము కనుక..ఇక గుడి నిర్మాణం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని మా భావన..


ఆ ప్రక్కరోజే..హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ దువ్వూరి భాస్కరరావు గారు నాకు వాట్సప్ లో ఒక మెసేజ్  పంపించారు..తన వద్ద శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి విగ్రహం వున్నదని..మీరు ఒక మందిరం నిర్మాణం చేస్తే..తాను ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయిస్తానని ఆ మెస్సెజ్ లో తెలిపారు..మొగలిచెర్ల దత్తాత్రేయస్వామి వారి లీల అప్పుడే కనబడింది..వెంటనే స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చాను.. స్వామివారి అనుమతి రాబట్టే..ఆ మెస్సెజ్ వచ్చిందని అర్థమై పోయింది..శ్రీ భాస్కరరావు గారిని ఫోన్ ద్వారా సంప్రదించాను..వారిని మొగలిచెర్ల కు రమ్మనమని ఆహ్వానించాను..శ్రీ భాస్కరరావు గారు మరో వారం రోజుల తరువాత తన మిత్రుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..శ్రీ భాస్కరరావు గారు తనతోపాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి విగ్రహాన్ని కూడా తీసుకొని వచ్చారు..ఆరోజే ఏ ఏ కొలతలతో గుడి నిర్మించాలో కూడా నిర్ణయం జరిగిపోయింది..శంఖుస్థాపన కొరకు ముహూర్తం కూడా నిర్ణయించేసాము..ఆరోజుకు శ్రీ భాస్కరరావు గారు వస్తామని చెప్పి వెళ్లారు..అనుకున్న విధంగానే శ్రీ భాస్కరరావు గారు దంపత్సమేతంగా రావడం..శంఖుస్థాపన చేయడం..అంతా చక చకా జరిగిపోయాయి..


శ్రీపాద శ్రీవల్లభుల గుడి నిర్మాణం గురించిన మరికొన్ని విశేషాలు రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: