11, జూన్ 2021, శుక్రవారం

బహిరంగ లేఖ :

 “ కోవిడ్ వాక్సిన్”  ల పై  దుష్ప్రచారాన్ని ఖండిస్తూ TV5 యాజమాన్యానికి బహిరంగ లేఖ :


అయ్యా !


          మీ ఛానల్ లో గడచిన రెండురోజులలో కరోనా పై జరిపిన ఒక చర్చకు సంబందించిన 5 ని ల .14 సె.ల నిడివిగల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది . ఆ చర్చకు  moderator గా Mr . సాంబశివరావు చర్చలో ఉన్నారు  మరియు చర్చలో కెమికల్ ఇంజనీర్ Mr . మల్లిక్ పరుచూరి, ఇంకా తదితరులు పాల్గొన్నారు .


 ఈ చర్చ లో కోవిడ్ variants గురించి , వాక్సిన్ ల efficacy గురించి అవాస్తవాలను , అబద్దాలను , అర్ధ సత్యాలను చెప్పి ప్రజలను గందరగోళపరిచారు  .  3rd wave గురించి చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.  


******************************


1. కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


  IGIB సైంటిస్టు డాక్టర్. వినోద్ స్కారియా MedRxiv లో అప్లోడ్ చేసిన కొత్త పేపర్ లో కోవిషీల్డ్ , కోవాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కూడా కోవిడ్ వస్తుంది . వాళ్ళ RTPCR శాంపిల్స్ లో Ct values ( cycle threshold ) దారుణంగా పెరుగుతున్నాయి . దీనివలన కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా శరీరం దారుణమైన స్థితి లో కుళ్ళిపోతుంది . gap ఇవ్వకుండా కుళ్ళ బెట్టేస్థది.లోపల కుళ్ళిపోయిందని బయటకు తెలిసేటప్పటికే , పడిన తర్వాత రోజే వెంటిలేటర్ ఎక్కాల్సివస్తుంది . 


వాస్తవం :


       MedRxiv లోఅప్లోడ్ చేసిన స్టడీ పేపర్ యొక్క title “ Variants of concern responsible for SARS-COV-2 Vaccine breakthrough infections from India “ . ( pdf ను ఈ మెసేజ్ కి అనుబంధం గా పెట్టాను ).


 మార్చి 28 వతేదీ 2021 నుండి ఏప్రిల్ 30 వ తేదీ 2021 వరకు జరిగిన ఈ స్టడీ ని AIIMS న్యూఢిల్లీ మరియు CSIR – IGIB వారు సంయుక్తంగా చేశారు. వాక్సిన్ ఒక డోస్ , రెండు డోస్ లు వేయించుకున్న తర్వాత కోవిడ్ లక్షణాలు ఉండి , స్వచ్చందంగా ఆసుపత్రికి వచ్చిన వారి నుండి శాంపిల్స్ తీసుకొని , 36 శాంపిల్స్ కు జెనెటిక్ పరీక్షలు చేశారు . అందులో 63.9% కోవిడ్ డెల్టా variant కాగా , మిగిలినవి కప్పా variant,  UK variant మరియు ఇతర variant లు. వీరిలో రోగనిర్ధారణ సమయంలో viral load ఎక్కువగా ఉంది ( ఒక డోస్ వాక్సిన్ తీసుకున్నా (లేక) రెండు డోసులు తీసుకున్నా సరే , కోవిషీల్డ్ అయినా.. కోవాక్సిన్ అయినా ) మరియు జ్వరం తీవ్రత.... వాక్సిన్ తీసుకోని రోగులలో వలే 5 నుండి 7 రోజులు ఉంది .


    తరువాత మాత్రం ఈ స్టడీ గ్రూప్ లోని వారికి ఎవ్వరికీ రోగ తీవ్రత పెరగటం లేదు ( అనగా పరీక్షలలో biomarkers / inflammatory markers సాధారణంగా (stable ) గానే ఉన్నాయి ; మరియు ఎటువంటి మరణాలు సంభవించలేదు  ( పరిశోధనా పత్రంలోని పేజీ 4-5). 


అదే పరిశోధనా పత్రంలోని  5 వ పేజీ లో స్టడీ పీరియడ్ సమయంలో  ఢిల్లీ లో ఏ కోవిడ్ variants అయితే అత్యధికంగా వ్యాప్తిలో ఉన్నాయో , అవే వాక్సిన్ వేయించుకున్నవారికి కూడా వచ్చాయి. ( ఏప్రిల్ నెల  2020 లో ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం , ఢిల్లీ లో 60% పైగా కోవిడ్ కేసులు ‘ డెల్టా variant ’ వలనే వచ్చాయి ).


పరిశోధనా పత్రం లోని వాస్తవాలు ఇలాఉంటే .... TV5 చర్చలో ‘ కెమికల్ ఇంజనీర్ గారు ...  “  కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కూడా శరీరం దారుణమైన స్థితి లో కుళ్ళిపోతుంది . gap ఇవ్వకుండా కుళ్ళ బెట్టేస్థది. లోపల కుళ్ళిపోయిందని బయటకు తెలిసేటప్పటికే , పడిన తర్వాత రోజే వెంటిలేటర్ ఎక్కాల్సివస్తుంది “ అని చెప్పడం బుద్ధిపూర్వకంగా అసత్య ప్రచారం చేసి , శాస్త్రీయ విషయాలను వక్రీకరించి,  ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం కాదా !!


ఎందుకంటే శరీరంలోపల కుళ్ళిపోవటం అంటే “ necrosis జరిగి రోగి తీవ్రమైన sepsis లోకి వెళ్తారు. తద్వారా తీవ్రమైన అనారోగ్యం వచ్చి, బి‌పి పడిపోయి , శ్వాసతీసుకోవడం కష్టమయ్యి , రక్త పరీక్షలలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి . severe sepsis వచ్చిన వారిలో 70% పైగా మరణాలు ఉంటాయి. కానీ ఆయన చెప్పినట్లు  శరీరం లోలోపల కుళ్ళిపోతే ... స్టడీ గ్రూప్ లో ఒక్క మరణం లేదు ! ఒక్క రక్త పరీక్ష లో కూడా  మార్పు లేదు.


***  నిజంగా వాక్సిన్ పనిచేయకపోతే .... స్టడీ లో biomarkers ఎందుకు పెరగలేదు ? ఎందుకు మరణాలు లేవు ?. 


*****************************


2. కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


డెల్టా variant పై ఏ వాక్సిన్ పనిచేయదు . 


వాస్తవం : 


  A )  వాస్తవాల వివరణ లోకి వెళ్ళే ముందు , ప్రపంచ ఆరోగ్యసంస్థ వాక్సిన్ ల యొక్క efficacy , effectiveness నిర్వచనాల గురించి స్థూలంగా అర్ధం చేసుకోవాలి .


 Efficacy అంటే “పరిశోధనా సమయం లో వాక్సిన్ తీసుకున్న ఎంత శాతం మంది కి వ్యాధి సోకలేదు “ అని చెప్తుంది . వాక్సిన్ effectiveness అంటే “ సాధారణ పరిస్థితులలో ( పరిశోధనలలో కాకుండా) వాక్సిన్ తీసుకున్న వారికి ఎంతమందికి వ్యాధి సోకలేదు “.


 ఇందులో ఒక్క వ్యాధి సోకడమే కాకుండా , ఆరోగ్య వ్యవస్థలు / ప్రభుత్వాల ప్రాధాన్యతలు అయినంటువంటి తీవ్రమైన వ్యాధి రాకుండా ఉండటం , ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండటం , మరణాలు సంభవించకుండా ఉండటం లాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటారు.



B ) మనందరి అనుభవం :


          మనందరం మన ఇళ్ళల్లో  ఉన్న చిన్న పిల్లలకు టీకాలు ( వాక్సిన్ లు ) వేయిస్తున్నాము. పోలియో చుక్కలు యొక్క efficacy – 90% మాత్రమే , measles వాక్సిన్ యొక్క efficacy -85% మాత్రమే. అయినా మనమందరం క్రమం తప్పకుండా మన పిల్లలకు టీకాలు వేయిస్తున్నాము . 90% మాత్రమే efficacy ఉన్న వాక్సిన్ ని అందరికీ వేయించి , మన దేశం నుండే పోలియో నే లేకుండా చేశాము . 95% efficacy ఉన్న మశూచి వాక్సిన్ తో , మశూచి అనే వ్యాధి భూమి మీద లేకుండా చేయగలిగాము . దీనికి కారణం 80% మంది కన్నా ఎక్కువమందికి టీకాలు వెయ్యడం ద్వారా , Herd (సామూహిక) ఇమ్యూనిటీ వచ్చి వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమించడం గణనీయంగా తగ్గిపోయి , వ్యాధులు కనుమరుగవటమో (లేక) బాగా తక్కువ మందికి రావటమో జరుగుతుంది. ఇది మన జీవిత కాలం లో,  మనందరం అనుభవంతో తెలుసుకున్న విషయం .


అదే 60% లోపు efficacy ఉన్న BCG , ఫ్లూ వాక్సిన్ లు ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆయా వ్యాధుల యొక్క  తీవ్రతను , ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరాన్ని , మరణాల సంఖ్యను గణనీయం గా తగ్గించాయి. 


C )  ‘ డెల్టా variant పై ఏ వాక్సిన్ పనిచేయదు’ అన్న అవాస్తవం పై వివరణ :-


పూణే లోని  National institute of Virology, ICMR మరియు భారత్ బయోటెక్ సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలిందేమిటంటే.... Covaxin టీకా డెల్టా variant పైన మరియు సౌత్ ఆఫ్రికన్ variant పైన సమర్ధవంతం గా పనిచేస్తుందని.


ఈ విషయంలో మరింత Objectivity కోసం ,  ఇంగ్లాండ్ లో జరిగిన పరిశోధనల ఫలితాలను  చూద్దాము .


 Public Health England ( PHE ) UK వారు 22/05/2021 న వారు డెల్టా variant పై Pfizer వాక్సిన్ , Astrazaneca వాక్సిన్  ల యొక్క effectiveness గురించి 05/04/2021 నుండి 16/05/2021 వరకు 1,054 మంది పై జరిగిన పరిశోధనా ఫలితాలను విడుదల చేశారు.  అందులో “  Pfizer వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలో 88% మందిలో రోగలక్షణాలతో కూడిన డెల్టా variant ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అని ;  అదే astrazaneca వాక్సిన్ అయితే 66% మందిలో  రోగలక్షణాలతో కూడిన డెల్టా variant ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అని చెప్పారు .  ఒక్క డోస్ వాక్సిన్ వేసుకున్న వారిలో 33% మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్ ను నివారించగలుగుతున్నాయి ... అని చెప్పారు  “. 


* దీనివలన astrazaneca వాక్సిన్ రెండు డోసుల మధ్యగల సమయాన్ని తగ్గించాలన్న చర్చ మొదలయ్యింది .


D )  Francis crick institute , లండన్ వారు 250 మంది పై చేసిన ఒక పరిశోధన  Lancet మెడికల్ జర్నల్ లో  ప్రచురితమైంది . ఇందులో రెండు వాక్సిన్ డోసులు తీసుకున్న వారిలో,  డెల్టా variant కి వ్యతిరేకం గా antibody లు 6 రెట్లు తక్కువ స్థాయిలో ఉన్నాయి  అని చెప్పారు. 


 ఈ పరిశోధనలో వాక్సిన్ efficacy ను చూడటానికి surrogative పరీక్షగా యాంటీబాడీ ( anti body ) లెవెల్స్ లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు , అంటే స్టడీ లోని వారికి వాస్తవానికి వ్యాధి లక్షణాలు వచ్చాయా? లేదా ? , ఎంత తీవ్రత ఉంది? ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉన్నదా? లేదా ?  లాంటి అతిముఖ్యమైన అంశాలు వారి పరిశోధనలో .... పరిగణలోకి తీసుకోలేదు. 


   *** దీనిపై ఆ స్టడీ గ్రూప్ లోని ప్రిన్సిపల్ సైంటిస్టు Emma C .Wall ఈ విధంగా చెప్పారు “ antibody లెవెల్స్ ఆధారంగా వాక్సిన్ యొక్క effectiveness ను నిర్ధారించలేము. దీనికి మనుషులపై పరిశోధనలు ( prospective population studies) జరగటం ఎంతో అవసరం . తక్కువ antibody లెవెల్స్ ఉన్నా కూడా , వాక్సిన్స్ కోవిడ్ నుండి రక్షించగలవు “.


*****************************

  

3.  కెమికల్ ఇంజనీర్ చెప్పిన అవాస్తవం :


    సౌత్ ఆఫ్రికా variant పై పెద్ద పెద్ద Pfizer వాక్సిన్ లు కూడా పనిచేయకుండా పోయాయి , కోవిషీల్డ్ 10% మాత్రమే పనిచేస్తుంది.


వాస్తవం :


         ‘ఖతార్’  దేశం లో వచ్చిన 2 వ వేవ్ మరియు మూడవ వేవ్ లలో  సుమారు 50 % కేసులు సౌత్ ఆఫ్రికన్ variant ( B.1.351)  , 44.5% UK variant (B.1.1.7) . ఆ దేశంలో డిసెంబర్ 21 వ తేదీ 2020 నుండి Pfizer వాక్సిన్ వేస్తున్నారు , మార్చి 31 వ తేదీ 2021 తేదీ వరకు అర్హత కలిగిన వారిలో సుమారు 33% మంది టీకా వేయించుకున్నారు ( ఇందులో 59% మంది ఒక డోస్ , 41% మంది రెండు డోసులు ). సౌత్ ఆఫ్రికన్ variant పై Pfizer వాక్సిన్ 75% effectiveness తో పనిచేస్తుంది . సౌత్ ఆఫ్రికన్ variant తో కోవిడ్ తీవ్రమైన లక్షణాలు రాకుండా , క్రిటికల్ స్టేజ్ రాకుండా , మరణాలు సంభవించకుండా నిరోధించడంలో Pfizer వాక్సిన్ 97.4% effectiveness కనబరిచింది . ( NEJM మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన ఈ స్టడీ రిపోర్ట్ కాపీ ని pdf లో జత చేశాను).


   వాస్తవం ఇలాఉంటే ప్రజలను భయబ్రాంతులను చేయటానికి , వారిని తప్పుదోవ పట్టించడానికి సౌత్ ఆఫ్రికన్ variant పై వాక్సిన్లు పనిచేయవు అని చెప్పడాన్ని ఏమంటారు ?? ఇది బుద్ధిపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా ?? 


******************************


వాక్సిన్ లు వేయించుకున్నవారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ రావటం గురించి CDC , USA వారు 01/01/2021 నుండి 30/04/2021 వరకు దేశవ్యాప్తంగా వచ్చిన కేసులన్నింటినీ పరిశోధించి , క్రోడీకరించి ఇచ్చిన రిపోర్ట్ లోని రెండు  ముఖ్యమైన అంశాలు   :

 ( 28 /05/2021, MMWR ,Vol  70 ..... ఒరిజినల్ కాపీ pdf జత చేశాను ) .


1. 30/04/2021 వరకు అమెరికా లో 10 కోట్ల 11 లక్షల మందికి వాక్సిన్లు వేశారు. వారిలో 10,262 మందికి  vaccine breakthrough infections ( అనగా రెండు డోసుల వాక్సిన్లు వేసుకొన్న 15 రోజుల తర్వాత ) వచ్చాయి . లక్షణాలు లేని వారు , కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారు కోవిడ్ పరీక్షకు వచ్చిఉండకపోవచ్చు.. అందువలన ఈ సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది . ఈ 10,262 మందిలో 2% మంది ( అనగా 160 మంది ) మృతువాత పడ్డారు , వీరి సగటు వయస్సు 82 సంవత్సరాలు . 


2. FDA అనుమతించిన వాక్సిన్ లు చాలా effective గా పనిచేసేవే, అయినా Population immunity (సామూహిక రోగనిరోధక శక్తి) రాకముందు, vaccine breakthrough infection లు ఉండటం అనేది ఒక సాధారణ మైన విషయం. Vaccination మరింత పెరిగి, ప్రజలలో ముందు సూచించిన స్థాయికి Vaccination  జరిగినప్పుడు .... వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం ఆగిపోతుంది . తద్వారా vaccine breakthrough infections ఆగిపోతాయి .


*****************************


4. కెమికల్ ఇంజినీర్ చెప్పిన అవాస్తవం :


 డెల్టా variant పైన , సౌత్ ఆఫ్రికా variant అనే కొత్త variants పైన ఈ వాక్సిన్లు ఏవీ పనిచేయవు . కావున 35,000 కోట్ల రూపాయలు ఈ పనికిరాని వాక్సిన్ల పై ఖర్చు పెట్టడం మానెయ్యండి.


వాస్తవం :


 డెల్టా variant పైన , సౌత్ ఆఫ్రికా variant  పైన వివిధ వాక్సిన్ల పనితీరును పూర్తి ఆధారాలతో పైన వివరించాను , సంబందిత పరిశోధనా పత్రాలు కూడా pdf లో జతచేశాను . 


 Variants మరియు vaccination కు సంబందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా చెప్పింది ...


            “ covid -19 పై మనం చేస్తున్న యుద్ధంలో వాడుతున్న ఆయుధాలలో ‘ వాక్సిన్’ అత్యంత కీలకమైనది . వీటిని వాడటం వలన ప్రజారోగ్యంలోను మరియు ప్రజల ప్రాణాలను కాపాడటంలోను స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి . క్రొత్త variants గురించిన సందేహాలతో , జరుగుతున్న vaccination ను ఆపకూడదు. ఒక వేళ క్రొత్త variants పై వాక్సిన్ ల effectiveness తక్కువగా ఉన్నా కూడా, vaccination కార్యక్రమాన్ని కొనసాగించాలి . వాక్సిన్ లో మార్పుల కోసం ప్రయత్నిస్తూనే , మన చేతిలో ఉన్న అమూల్యమైన ఆయుధం అయినటువంటి వాక్సిన్లను ఉపయోగించుకోవాలి. “


  “ మరిన్ని క్రొత్త variants రాకుండా నివారించాలంటే , vaccination మరింత త్వరగా ... మరింత ఎక్కువమందికి చేరేవిధంగా ఉండాలి . అలా చేస్తే ప్రజలు వైరస్ బారినపడటం తగ్గుతుంది మరియు క్రొత్త variants యొక్క బెడద తగ్గుతుంది . కారణం , ఎక్కువమంది ప్రజలు vaccination చేయించుకుంటే , సమాజంలో వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం ఆగిపోతుంది , తద్వారా ఉత్పరివర్తనం ( mutation ) జరిగే ఆస్కారం చాలా వరకు తగ్గిపోతుంది.”


  (  url:    who.int/news-room/feature-stories/detail/the-effects-of-virus-variants-on-Covid-19-vaccines).



విన్నపం : 


ప్రజలందరికీ vaccination అందించడం ద్వారా ఈ కోవిడ్ వైరస్ దాడి నుండి ( 3rd / 4th /5th … వేవ్ ల ) నుండి దేశాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో సుప్రీం కోర్టు ఎంతో తెగువను ప్రదర్శించింది మరియు అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రతిస్పందించి,   దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ అందించడం ... కేంద్ర ప్రభుత్వం తన భాద్యతగా స్వీకరించింది .   ఇటువంటి పరిస్థితులలో , బుద్ధిపూర్వకం గా , vaccination కు వ్యతిరేకంగా అసత్యాలను – అబద్ధాలను – కల్పితాలను చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేవారికి మీ ఛానెల్ వేదికగా మారటం చాలా బాధాకరం. ఆ చర్చాకార్యక్రమానికి సంబందించిన వీడియో లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి .


Vaccination అనేది ప్రజలు స్వచ్చందంగా చేయించుకునేది .  అవికూడా సామూహిక రోగ నిరోధకశక్తి ( herd immunity )  స్థాయికి రావాలంటే 70% పైగా జనాభా కు vaccination జరగాలి . వాక్సిన్ గురించి misinformation ఇవ్వటం వలన , ప్రభుత్వాలు ఉచితం గా వాక్సిన్ ఇచ్చినా సరే,  ప్రజలు ముందుకురారు . ఇందుకు ఎన్నో ప్రాంతాల , దేశాల అనుభావాలే ఉదాహరణలు గా చెప్పవచ్చు .    

   

మీరు ఇటువంటి చర్చా కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు .... మరింత బాధ్యతాయుతంగా వ్యహరించాలి . హైదరాబాద్ లోని CCMB లో పనిచేసిన నిపుణులనో , genetics రంగంలో అనుభవం ఉన్నవారిని లేదా epidemiologist లను , WHO లో వివిధ vaccine ప్రోగ్రామ్స్ లో పనిచేసిన అనుభవం ఉన్నవారినో .... చర్చలో పాలుపంచుకొనేటట్లుగా చూడండి . దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు ... రాజకీయ చర్చలకు , vaccination గురించిన చర్చలకు చాలా వ్యత్యాసం ఉంది . ఈ వ్యత్యాసాన్ని గ్రహించి ... మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. 


ఇట్లు ,


డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ . DNB (Gen.Med), MRCP (UK).


అనుబంధం :- 24 పేజీ ల pdf లో 5 annexure లు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: