14, జూన్ 2021, సోమవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శరీర త్యాగానికి సన్నద్ధం..*


*(యాభై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారి ధ్యాసంతా సజీవ సమాధి చెందడం మీదే ఉన్నది..పదే పదే శ్రీధరరావు దంపతులతో ఆ మాటే చెప్పడం..వాళ్ళు నిరాకరించడం జరుగుతోంది..కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒకమాట స్పష్టం చేయసాగారు..సజీవ సమాధి జరిగినా జరుగకపోయినా.. తన అంత్యకాలం సమీపించిందనీ..తాను ఈ శరీరం విడిచిపెట్టక తప్పదని..


శ్రీధరరావు గారు శ్రీ చెక్కా కేశవులు గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పిలిపించారు.. వారు మొగలిచెర్ల కు  చేరుకున్న తరువాత..శ్రీధరరావు దంపతులు..తమతో శ్రీ స్వామివారు వెలిబుచ్చిన కోరికను గూర్చి తెలియచేసి..ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు..వాళ్లిద్దరూ కూడా తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని..తాము శ్రీ స్వామివారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు..శ్రీధరరావు గారు అప్పటికప్పుడే గూడు బండి సిద్ధం చేయించి..కేశవులు గారిని, మీరాశెట్టి గారినీ శ్రీ స్వామివారి వద్దకు పంపారు..


శ్రీ స్వామివారు తన మనోభీష్టాన్ని వారికి తెలియచేసి..తనను సజీవ సమాధి చేయడానికి సహకరించమని కోరారు..కేశవులు గారు కొద్దిగా అసహనంతో.."స్వామీ!..మీరు ఇలా మంకు పట్టు పడితే ఎలా?..మీలాటి వారు ఉండబట్టే మాలాటి వాళ్లకు ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి..మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి మల్లె..మా ఇంటివద్ద  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..విజయవాడ వచ్చి కొద్దిరోజుల పాటు వుండండి.. మాలాంటి వారికి బోధ చేయండి..మీకూ మార్పు ఉంటుంది.." అని ఎంతో దూరం చెప్పారు..మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చచెప్పబోయారు..


శ్రీ స్వామివారు ఇద్దరి మాటలూ శ్రద్ధగా విన్నారు..వింటున్నంత సేపూ ప్రశాంతంగా వున్నారు..వాళ్ళు చెప్పడం ఆపైన తరువాత..ఆశ్రమ వరండా లో పద్మాసనం వేసుక్కూర్చుని..


"ఇద్దరూ వినండి..నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు..మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తి తో సహకరించారు..నానుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు..నిజానికి ఈ మీరాశెట్టి కి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా..తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధి గా చేసాడు..కేశవులు గారూ మీరూ అంతే!..ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు..మీకూ తెలుసు..కానీ మీరందరూ ఒక్క విషయాన్ని దాట వేస్తున్నారు..అది నా ఆయుర్దాయం గురించి..నాకు ఆయుష్షు కొద్దికాలమే ఉన్నది..అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి..అది విధి నిర్ణయం..మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని..అది నిజం కాదు..దైవం నాకు నిర్దేశించిన గడువులోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి..ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు.."


"ఇక బోధల గురించి...శరీరం తోనే బోధ చేయాలనే నియమేమీ లేదు..అలా అనుకుంటే..కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికీ శరీరధారులై ఉండాలి..నేను సమాధి చెందిన తరువాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది..ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది..ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక్కడ..సంతానహీనులు సంతానాన్ని పొందుతారు..మానసిక రుగ్మతలు తొలగిపోతాయి..దుష్టగ్రహపీడలు నశిస్తాయి.."


"మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధి కి ఇష్టపడకపోతే..నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను..దైవ ధిక్కారం చేయను..చేయలేను.." అన్నారు నిర్వికారంగా చూస్తూ..


శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గార్లు..ఇక చేసేదేమీ లేక..సెలవు తీసుకొని తిరిగి శ్రీధరరావు గారింటికి చేరారు..శ్రీధరరావు ప్రభావతి గార్లతో తమ సంభాషణ అంతా చెప్పారు..తాము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


కానీ అక్కడ శ్రీ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్లకు తెలియదు..తాము ఒప్పుకోలేదు కనుక, శ్రీ స్వామివారు సజీవ సమాధి  ఆలోచనను మానుకొని..తపస్సు చేసుకుంటూ వుంటారులే !..అనే భ్రమలో వున్నారు..


సోదరుడు పద్మయ్య నాయుడు కి సూచనలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: