2, అక్టోబర్ 2021, శనివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*429వ నామ మంత్రము* 2.10.2021


*ఓం నిస్సీమ మహిమ్నే నమః*


*ఓం నిస్సీమ మహిమాయై నమః* (అనికూడా అనవచ్చును)


హద్దులులేని అనంతమైన మహిమ గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిస్సీమమహిమా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం నిస్సీమ మహిమ్నే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులను ఆ తల్లి, అపారమైన కృపాకటాక్షవీక్షణములతో శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు గలిగినవారిగా అనుగ్రహించును.


దేవీ ప్రకాశ స్వరూపము మనస్సీమను అతిక్రమించిన మహిమగలిగినది. ఆ తల్లి *ఉద్యద్భానుసహస్రాభా* యని అనబడినది. అనగా ఉదయించు వేలాది సూర్యుల కాంతి సమూహములతో (అనంతకోటి సూర్యకిరణసమూహములతో) విరాజిల్లుచున్నది. ఆ తల్లి మహిమలు కూడా అపారమై, హద్దులులేని ప్రభావము గలిగినవి. అనంత కోటి జీవరాశులను తన అపారమైన ప్రాభవంబుతో పాలించుచున్నది. ఆ తల్లి చతుష్షష్టికోటి కోటి యోగి గణసేవితయై, తన మహిమలను చూపుచున్నది. ఇందుగలవందు లేవని సందేహము వలదన్నట్లు అమ్మ మహిమలు ఎల్లెడల గ్రామగ్రామాన, వివిధ వనసీమలయందు, కొండలలోను, కోనలలోను, అన్నిదిశలయందును అన్ని రూపములలోను, తానే, తన మహిమలే ఈ జగత్తును రక్షించుచున్నట్లు భావింపబడుచున్నది. ఆతల్లి ఆది మధ్యాంతరహితురాలు. ఆదిపరాశక్తి. సృష్టికి పూర్వము, స్థితియందును, లయమునకనంతరము అప్పుడు ఇప్పుడు అనక ఎల్లప్పుడు సర్వవ్యాపి. పంచకృత్యపరాయణత్వముతో మహిమలకు హద్దులే లేవనునట్లు భాసిల్లుచున్నది. నవావరణ పూజయందు *మహిమాసిద్ధి* యని అష్టసిద్ధులలో ఒకటిగా చెప్పబడుచున్నది. ఆ తల్లి మనసులకందని మహిమాన్వితమైనది. ఆ తల్లి మహిమలకు ఆకాశము సైతము హద్దులు కాలేకపోయినవి. అందుచేతనే ఆ తల్లి *నిస్సీమ మహిమా* యని అనబడినది.


ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం నిస్సీమ మహిమ్నే నమః* అని యనవలెను.


*ఓం నిస్సీమ మహిమాయై నమః* అనికూడా అనుచు ఆ తల్లికి నమస్కరింపవచ్చును.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: