18, డిసెంబర్ 2021, శనివారం

బాపు గారి జయంతి

 సత్తిరాజు లక్ష్మీనారాయణ, బాపు గారి జయంతి నేడు. ఇతగాడు సృష్టించిన బొమ్మలు, పుట్టించిన బామ్మలు మన తెలుగింట ఇప్పటికీ కళకళలాడుతూనే వున్నారు.


అందాలబొమ్మల బాపుకి అపరాహ్ణవేళ అక్షర నైవేద్యం...


‘గుండ్రంగా రాయడం రాక ఇలా వంకరటింకరగా లాగించేస్తున్నాడు...ఏం తెలివి?’ అనేసుకుని నోట్లో కొంగులూ, కండువాలూ కుక్కేసుకున్నార్ట!


ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా వుంటాయి. కాసేపు చూస్తే ‘ఏదోవుందిందులో!’ అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేసాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది. 


మనం పెట్టే కొమ్ములూ, దీర్ఘాలన్నింటినీ కొత్తరకంగా తగిలించే తెలివి. పేరంతా రాసేసిన తరవాత చూస్తే ఊరేగింపుకి తయారైన దేవుడిపల్లకీలా వుంటుంది. ఆ నిండుదనం గోదారినించీ, ఆ అందం చందమామనించీ తెస్తాడు. 


ఇహ బొమ్మలు....


ఒక స్త్రీ బొమ్మంటే సామాన్యశాస్త్రం పుస్తకంలో ఆడమనిషి బొమ్మలా అందరూ వేస్తున్నరోజుల్లో ఇతగాడు చుక్కలముగ్గెట్టినంత చులాగ్గా వేసేసి చూపించాడు. 


రావాకుల్లా పరుచుకున్న రెండుకళ్ళూ, 

మకరధ్వజాల్లా కనుబొమ్మలూ,  

చదరంగంలో శకటులా ధీటైన ముక్కు, 

చిన్న చెగోడీలా నోరూనూ! 

చూడగానే ముద్దిస్తున్నట్టూ, ముద్దొస్తున్నట్టూ అనిపించేస్తుంది ఎవరికైనా! 


ఇహ మెడా, జడా సంగతి సరేసరి! జుట్టంతా పొందిగ్గా అల్లి, పాపిడితీసి, నాగుబాములా పేద్ధ జడేసేసేవాడు. చివర్న ఓరెండు గంటలు కట్టేవాడు. నడుం మీద ఆట్టే ఆసక్తి చూపెట్టేవాడు కాదు. ఎంచేతంటే...అసలది వుంటేగా? అలాగ్గీసేవాడు. 


ఈ యవ్వారాలన్నీ పూర్తయ్యేసరికి మగపిల్లలందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది. ‘పెళ్ళిచేసుకోరా నాయనా!’ అని బామ్మలూ, అమ్మానాన్నలూ అడిగితే శివకాశి టపాకాయల్లా ‘బాపూబొమ్మం’టూ బ్రాండొకటి చెప్పేవారు. అలాంటి పిల్లలే కావాలంటే ఎక్కణ్ణించొస్తారు? ఆఖరికి అదొక గోల్డ్ స్టాండర్డ్ అయి కూర్చుంది.


ఇహ ఈ రమణున్నాడే! గొప్ప కబుర్లపోగు. ఏవో కథలూగట్రా రాస్తూండేవాడు. ఆయనగారి మనసులో ఏం వుందో ఈయనకి తెలిసిపోయేది. ఈయనగారి కలంలో ఏం వుందో ఆయనకి అర్ధమైపొయ్యేది. 


బుడుగూ, సీగానపెసూనాంబ....అనేసి రెండుపేర్లు అనుకుని ‘ఓం విఘ్నేశ్వరాయ’ అని ముందస్తుగా రాసి మొదలెట్టగానే ఈయనేసిన రెండు బొమ్మలూ రూపం తెచ్చేసుకున్నాయి. ఆనక వాళ్ళనాన్న గోపాళం, రాద, బాబాయ్, రెండుజెళ్ళసీత, పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు...అందరికన్నా అందంగా... వత్తులపెట్లో డబ్బులు దాచుకునే బామ్మ..వీళ్ళందరి బొమ్మలూ వేషాలేసుకుని పుస్తకమ్మీదకి వచ్చేసాయి. 


మనకింక తడుంకునే పన్లేదు. ‘బుడుగంటే ఎలా వుంటాడూ?’ అని నీ బుర్రనీ, పుస్తకాన్నీ చించుకోవాల్సిన అవసరం లేకుండా తాళ్ళలాగేసి, ఓ బుగ్గల బూరిగాణ్ణి మన ముందు నిలబెట్టేసాడు. రెండు కొత్తిమీర కట్టల్లాంటి జళ్ళేసి సీగాననీ లాక్కొచ్చేసాడు. వాళ్ళెంత నచ్చేస్తారంటే అందరూ చూస్తుండగా వందసార్లూ, ఎవరూ చూడకండా మరో వందసార్లూ పుస్తకాన్ని ముద్దెట్టేసుకునేంత!


వీళ్ళిద్దరితోనే అయ్యిందేఁవిటి? 


‘రామపట్టాభిషేకం పటం ఇంటోవుంటే శుభం! బాపూదయితే ఇంకా శుభం!’....


ఇది మన తెలుగింటి నానుడి! నేనన్నది అతిశయోక్తేమో గానీ అతిమాత్రం కాదు.


ఓమారు ఆ చివర్నించి ఈ చివరిదాకా చూడండి...


సీతారాములేమో మొహమాటంగాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో ‘హమ్మయ్య! అన్నయ్యొచ్చేసాడు! ఇహ మనకేం ఫరవాలేద’న్నట్టుగాను, వసిష్టుల వారేమో ‘ఈరోజుకోసం ఎన్నాళ్ళనించి చూస్తున్నానో తెలుసా?’ అన్నట్టుగాను, ఇహ హనుమంతుడయితే ‘నాకోసమే అప్పుడాగిపోయింది పట్టాభిషేకం. నేలేననే! అదీ అదృష్టఁవంటే!’ అనుకునేంత గాఢభక్తితోను...


చూస్తూనే వుండిపోయి, చుట్టుపక్కలేం జరుగుతోందో కూడా మర్చిపోతావు. ఆ క్షణంలో ఓ అప్పారావొచ్చి ‘ఓ ఫైవ్ లాక్స్ అప్పిస్తావోయ్?’ అనడిగినా ఇచ్చి పడేస్తావ్! అంత విషయం వుందక్కడ!


ఈయన బొమ్మ వుందంటే పుస్తకానికి పసుబ్బొట్టు పెట్టినంత అందం. గుమ్మానికి మావిడాకు కట్టినట్టు, కొత్తబట్టలు కొనుక్కున్నట్టు. పత్రికలవాళ్ళు పండగలన్నిటికీ ఈయన్నే వెయ్యమనేవారు ముఖచిత్రాన్ని.


అంతవరకూ ప్రతివారం వచ్చే వాణిశ్రీలూ, జమునలూ, జయప్రద, సుధ, చిత్రలూ మాయమై పోయేవారు. వాళ్ళందరికన్నా అందంగా ఓ పిల్ల దిగేది. ఆ పుస్తకాన్ని లోపలి కథల కోసం కొందరూ, బయట బొమ్మ కోసం కొందరూ ఏళ్ళ తరబడి దాచుకునేవారు.


అమరావతి కథలకి ఈయన గీసిన బొమ్మల్ని చూసారా? సత్యంగారి ఆత్మ బాపు బొమ్మల్లో కనబడుతుంది. ఆయనేఁవనుకుని రాసాడో తెలీదుగానీ ‘రాగిచెంబులో చేపపిల్ల’, ‘భోజన చక్రవర్తి’, ‘ముద్దులల్లుడు’ కథలకి బొమ్మలొకసారి చూడండి. 


పుస్తకంలేదా మీయింటో? అదేమరి! మీరేం తెలుగువాళ్ళూ? కథని చదివి, జీర్ణంచేసేసుకుని, రక్తంలోకీ, మనసులోకీ ఎక్కించుకుని ఆనక బుర్రకి పనిచెప్పి ఓబొమ్మగీస్తే....కథంతా ఒక్క బొమ్మలో తెలిసిపోతుంది! అంత పనిమంతుడు మన బాపు!


మిథునఁవైతే ఇహ లాభంలేదని ఏకంగా మొత్తం తన దస్తూరీలోనే రాసిపడేసాడు. ఒకసారి దూరంనించి చూస్తే పళ్ళెంలో పారిజాతాల్లా వుంటాయి అక్షరాలన్నీ! ఏరి వాసన చూడాలన్నంత అందంగా!


ఎంత మందికో కథలకీ, నవలలకీ బొమ్మలేసాడు. సినిమా పుస్తకాల్లో రేలంగిరిజల్నీ, జమునాసావిత్రుల్నీ కళ్ళకి కట్టేసేవాడు.


అంతర్జాతీయ స్థాయి అందాలబొమ్మల అపురూప చిత్రకారుడు...


అమర లోకంలో రంభావూర్వశులు రోజూ వాళ్ళ బొమ్మలెయ్యమని సలపాదిస్తూ వుండే వుంటారు. 


నీ బొమ్మల్ని చూస్తూ పెరిగాం. నీ బొమ్మల్ని చూస్తుండగానే నువ్వెళిపోయావు. మనసులో నీ బొమ్మ మాత్రం పది కాలాలపాటు పదిలంగా అలానే వుంటుంది.


నివాళులు!


జగదీశ్ కొచ్చెర్లకోట


#mahanubhavulu

కామెంట్‌లు లేవు: