26, జూన్ 2023, సోమవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 102*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 102*


"ఏమి శ్రేష్టి ! ప్రజలలో నీ గురించి చాలా మంచి అభిప్రాయం ఉన్నదని వింటున్నాం. వ్యాపారకంగా, వ్యవహారికంగా నమ్మకాస్తుల్లో నిన్ను మించినవాడు లేడట... కానీ, ఒక్క రాజభక్తిలో మాత్రం... ?" అంటూ నవ్వాడు చాణక్యుడు. 


చందనదాసు తోట్రుపాటు పడుతూ "ఆర్యులకు నా గురించి ఇన్ని మంచి అభిప్రాయాలు చెప్పిన వారెవరో గానీ, నా రాజభక్తిని ఎందుకు శంకించారో నాకు అర్థం కావడం లేదు. నేను రాజభక్తుడినే గానీ, రాజద్రోహిని కాను..." అన్నాడు నిబ్బరంగా. 


"కావా... ? నువ్వు ద్రోహివి కావా... ? రాజాద్రోహియై రాజ్యం విడిచి పారిపోయిన రాక్షసామాత్యుని భార్య పుత్రులకు నీ ఇంట రహస్యంగా ఆశ్రమం ఇవ్వడం రాజద్రోహం కాదా ?" గద్దించాడు చాణక్యుడు.


ఆ రహస్యం చాణక్యునికి తెలిసిపోయిందని గ్రహించి నిర్గాంతపోయాడు చందనదాసు. అంతలో కొందరు భటులు అక్కడికి వచ్చి "ఆర్యా ! చందనదాసు గృహాన్ని అణువణువునా గాలించాము. రాక్షసుల వారి భార్య పుత్రుల జాడ తెలియలేదు. ఈ చందనదాసు ఇక్కడికి వచ్చేముందే ఒక స్త్రీని, బాలుడిని ఎక్కడికో పంపించి వేశాడని చుట్టుప్రక్కల వారు తెలియజేశారు..." అని విన్నవించుకున్నారు. చందనదాసు పెదవులపై చిరుదరహాసం మెరిసి అదృశ్యమైపోయింది.


"శ్రేష్టి ! ఇప్పుడు అంగీకరిస్తావా, నువ్వు రాజద్రోహివని...? రాజద్రోహానికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో నీకు తెలుసా ? రాక్షస భార్యా పుత్రులను ఎక్కడికి దాటించావు ? వారిని ఎక్కడ దాచావు ? చెప్పు" గద్దించాడు చాణక్యుడు.  


చందనదాసు తల అడ్డంగా తిప్పి "ఏమో.... నాకు తెలియదు... తెలిసినా చెప్పను" అన్నాడు నిర్మొహమాటంగా. 


చాణక్యుడు పటపట పళ్ళు కొరుకుతూ "రాజద్రోహానికి తోడు అధికార ధిక్కారమా ?" గర్జించాడు. 


"మీరెలా అనుకున్న సరే ... ఏం చేసినా భయపడను కూడా... రాజద్రోహ నేరానికి భయపడి మిత్రద్రోహం చెయ్యను. నా మిత్రునికి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణముండగా వారి ఆచూకీ చెప్పను. వారిని మీకు అప్పగించను. నన్ను ఏం చేసుకుంటారో ..... మీ ఇష్టం ...." అని స్పష్టం చేశాడు చందనదాసు నిర్భయంగా. 


చాణక్యుడు గుడ్లురుముతూ "అలాగా..." అంటూ వెటకరించి, భటులవైపు చూస్తూ "ఈ చందనదాసుని భార్యబిడ్డలతో సహా కారాగారంలో బంధించండి. ఇతడి సర్వసంపదలను జప్తు చేసి కోశాగారమున జమ చెయ్యండి. రాక్షసుని కుటుంబ సభ్యులను అప్పగించిన నాడే యీతనికి విముక్తి... ఖైదు చెయ్యండి" అని ఆదేశించాడు కఠినస్వరంతో. చందనదాసు భార్యాబిడ్డలతో సహా కారాగారంలో బంధించబడ్డాడు. 


ఆ మర్నాటి ఉదయం తలారు శకటదాసుని శులారోహణం చేయించడానికి వధ్యస్థానానికి తీసుకువెళ్లారు. సరిగ్గా శూలారోహణం జరిపే సమయానికి మారువేషంలో ఉన్న సిద్ధార్థకుడు తలారుల మీదికి లంబించి ఖడ్గచాలనంతో వాళ్లని పారద్రోలి శకటదాసుని విడిపించి వెంటబెట్టుకుని నగరం విడిచి పారిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: