21, జూన్ 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 97*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️




*పార్ట్ - 97*


♦️వర్ణాశ్రమధర్మములు అన్ని వర్ణములవారికీ అనుసరణీయములు. వాటిని తప్పక పాటించవలెను. 


♦️దండనీతిని స్వపర బేధములు లేకుండా కఠినముగా అమలుపరచవలెను. 


♦️ శతృరాజులు, పరదేశీయులు, స్వదేశమునందలి దేశద్రోహులు, విప్లవకారులు, ప్రభుత్వములను కూలద్రోయుటకు కుట్రలు పన్నువారు వీరిని 'భేదోపాయము' చేతనే లొంగదీసుకొనుట శ్రేయస్కరము. భేదోపాయము ఆచరించుటచేత యుద్ధముల వంటి రక్తపాతములు, జననష్టము నివారించవచ్చును. 


♦️భేదోపాయమును సక్రమముగా అమలుపరచుటకు సమర్థులైన గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొనవలెను. 


♦️సన్మార్గుడైన ప్రభువుతో మిత్రత్వము పాటించి సంధి చేసుకొనవచ్చును సామంతునిగా అంగీకరించవచ్చును. 


♦️దుర్మార్గుడైన పొరుగురాజును ఏమాత్రం ఉపేక్షించరాదు. అట్టి ఉపేక్ష తన రాజ్యమునకు చేటు తెస్తుంది గనక - సామదాన భేద దండోపాయాల ద్వారా దుర్మార్గుడైన రాజును దండించి అక్కడ సన్మార్గుడినొక్కడిని తన ప్రతినిధిగా నియమించాలి. 


♦️చివరగా - రాజుకి ప్రజాసంక్షేమమే ముఖ్యము. ధర్మపరిరక్షణము కర్తవ్యం. కాన ధర్మస్థాపనార్థం రాజు లేక మహామంత్రి యే మార్గాన్ని అనుసరించినా దోషములేదు. తత్పలితము ధర్మపరిరక్షణమే గదా ...... !"


ఇలా చాణక్యుడు అనేక దినముల పాటు తన అర్థశాస్త్రముని కూలంకషముగా చంద్రగుప్తునికి బోధించాడు. అనంతరం...


"వత్సా ! పురాతన మనుధర్మశాస్త్రంలోని కొన్ని ప్రధాన సూత్రములను కాలానుగుతంగా నా అర్థశాస్త్రంలో ప్రస్తావించి అవసరమైన మార్పులు చేశాను. నేటి మార్పులు రేపటి కాలాన్ని బట్టి మరికొన్ని మార్పులకు దారితీయవచ్చు. మార్పు అభిలాషణీయం. అయితే ధర్మము అనునది న్యాయముపై ఆధారపడి ఉన్నది. న్యాయసమ్మతం కాని ధర్మము.... 'అది ఎంతటి ప్రాచీన ధర్మమైనా నా దృష్టిలో అధర్మమే...' ఎందుకంటే న్యాయసమ్మతం కాని, ఆచరణ యోగ్యం కాని ఏ ధర్మాన్నీ ప్రజలు ఆచరించరు. జనులు ఆచరించని ధర్మము వృధా... అంటే ధర్మం యొక్క మూలసూత్రము మారదు. ఏ రూపంలో ఆచరించినా ధర్మము ధర్మమే... అది నిరంకుశముగా నుండకుండా సర్వజనామోదముగా 'మూలసిద్ధాంతం మారకుండా ఆచరణా విధానాన్ని మార్చడమే' నా ఈ అర్థశాస్త్ర సిద్ధాంతము. అన్యాయమునకు గురియైన వానికి న్యాయం చేస్తే చాలదు. న్యాయమే జరిగిందన్న నమ్మకాన్ని కూడా కలిగించాలి. ఇదే నా అర్థశాస్త్ర సారాంశము...." అని వివరించాడు చాణక్యుడు. 


చంద్రగుప్తుడు శిరస్సు వంచి చేతులు జోడించి "కృతజ్ఞుడను ఆచార్యదేవా... అనితర సాధ్యమైన తమ అర్థశాస్త్రమును నాకు ఉపదేశించి నన్ను ధన్యుడిని చేశారు. రేపటినుంచే మీ అర్థశాస్త్రమును మౌర్య సామ్రాజ్యమంతటా అమలు చేయిస్తాను. సత్ఫలితాలు సాధిస్తాను. తమ అభీష్టాన్ని నెరవేరుస్తాను" అని చెప్పాడు శ్రద్ధాభక్తులతో. 


చాణక్యుడు మందహాసం చేసి "ఇప్పుడు మౌర్యసామ్రాజ్యం... మున్ముందు యావత్ భారతావని నీ పాలనలో, అర్థశాస్త్ర సత్ఫలితాలతో సర్వతోముఖాభివృద్ధి గాంచాలి. అదే ...... అదే ..... నా జీవితాశయం" అన్నాడు సాలోచనగా.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: