21, జూన్ 2023, బుధవారం

చిదంబర రహస్యం?

 శుభోదయం👏


చిదంబర రహస్యం?


 పార్ధసారధి అంబాళం వారి సౌజన్యంతో-


(మొదటి భాగం)

"దక్షిణాది దేవాలయాలలో

ఒకప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం చిదంబరం.

అది శివాలయం. ఆకాశలింగానికి స్థావరం.అంటే అక్కడ శివలింగం ఉండదు అడ్డుగా ఒకగోడమాత్రమే!

   "ఆద్యంతంఅద్భుతం .నాకోరిక మన్నించి మిత్రులు పార్ధసారధిగారు మనకు అనుగ్రహించారు.ఇది రెండు భాగాలు రోజుకొకటి విడువకుండా చదవండి!భావితరాలకోసం!!


ఇంకమొదలు పెట్టండి.


98.

దాదాపు పదేళ్ల క్రితం, బంధువులు, మిత్రులు అందరం కలిసి దక్షిణదేశ యాత్రకని బయలుదేరాము. అయితే, అది మంచి ఎండాకాలం. ఎక్కువ భాగం గుళ్లు చాలా సువిశాలమైనవి. అక్కడి ఆచారం ప్రకారం షర్ట్, బనియన్ సైతం విప్పేసి లోపలికి నడవాల్సివచ్చేది. మా అందరికీ చక్కటి, ఆనంద దాయకమైన అనుభవం కలిగింది. 


అనేక వైష్ణవ, శైవ దేవాలయాలు దర్శించుకున్నాం. అందులో చిదంబరం దేవాలయం నన్ను బాగా ఆకర్షించింది. ఆ దేవాలయం యొక్క స్థలపురాణం, భౌగోళికంగా దాని విశిష్టత తెలుసుకున్న నాకు ఆశ్చర్యం కలిగింది. అలాంటి అద్భుతమైన దేవాలయం గుఱించి, నాకు తెలిసినంతవఱకు ఈరోజు మీకు తెలియజేస్తాను.  


శివాలయాలకు, వైష్ణ్వాలయాలకు తమిళనాడు పుట్టినిల్లు లాంటిది. ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలించిన చోళులు నిజంగా అభినందనీయులు. సంస్కృత భాషలో చోళము అంటే రాగులనబడే ధాన్యము. రాగులను బాగా పండించేవారు కాబట్టి, వారిని చోళులు అని పిలిచేవారని అంటారు. చివరకు అదే వారి శాశ్వత ఇంటి పేరు, పాలకుల వంశం పేరుగా ఖ్యాతినార్జించింది. 


శివుడి పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనమే అన్ని దేవాలయాలు. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భుతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు మనకు ఇంకెక్కడా కనబడవు. వారు అపారమైన ధనం వెచ్చించి చరిత్రలో నిలబడిపోయారు. కొందరు "రాజుల సొమ్ము రాళ్ల పాలని" అంటుంటారు.  


అక్కడి సువిశాలమైన దేవాలయాలను దర్శించుకొని పులకించిపోతాము. ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధులమవుతాము. ఇన్ని వేల యేళ్ళ నుంచి శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న  ఆలయాలను దర్శించుకోవడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తుంటాము. అవకాశం వున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన దేవాలయాలవి. 


అలాంటి అనేక శైవ దేవాలయాలలో, పంచ భూత శివ క్షేత్రాలలో, నటరాజ స్వామి వేంచేసి, ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన చిదంబరం అతి ముఖ్యమైనది. ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారం అనుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారని ప్రతీతి. పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి "సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి" అనే ఐదు పారమార్థిక క్రియలను బయట పెడతారంటారు.


ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాల పైన, 13 అతి పెద్ద రాగి కలశాలతో పాటు, విశాలమైన వాకిళ్లు, అపురూపమైన శిల్ప సంపద, మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ దేవాలయంలో చిత్రాంబళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ, అనే ఐదు భాగాలున్నాయి.


చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వుంటాడు. చిత్రాంబళానికి ముందు భాగాన్ని పొన్నాంబళం అంటారు. ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకాలు చేస్తారు. పెరాంబళం అంటే దేవసభ. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అలరారుతుంటాయి. ఒకప్పుడు, నృత్తసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వ తాండవనృత్యం చేశారట. ఇక్కడ స్వామి నృత్యభంగిమ విగ్రహం ప్రతిష్టించబడి వుంది.


రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి మహర్షి, తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారట. మార్గశిర మాసంలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని, ఇతర దేవతలను ఐదు రథాలలో ఊరు ఎరిగిస్తారు (ఊరేగిస్తారు అనకూడదు).


చిత్రాంబళం ప్రాకారం బయట వున్న ప్రత్యేక ఆలయంలో శివ కామ సుందరీదేవి అమ్మవారుంటుంది. ఇక్కడే చిత్తగుప్తుడి (అందరూ అనుకుంటునట్లు చిత్రగుప్తుడు కాదు, చిత్తంలోనివి గుప్తంగా వ్రాసే వాడు) మందిరమున్నది. ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ మనల్ని కట్టిపడేసే విధంగా, చాలా బాగుంటుంది. 


నటరాజ ఆలయంలోని స్వామి మూలాట్టనేశ్వరార్. అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలోని స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనమవుతుందట. ఇక్కడి అమ్మవారి పేరు ఉమాదేవి. ముక్కురుని వినాయకర్ విగ్రహం 8 అడుగుల ఎత్తుంటుంది. ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడుంటాడు.


ఇంకా అనేక దేవీ, దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడడానికి చాలా బాగుంటాయి. నటరాజ స్వామి ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు. ఒకేచోట నుంచుని శివ, కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వుందేమో.


చిదంబరం దేవాలయ విశేషాలు తెలుసుకున్నాం కదా, మరి, ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వుంది కదా! ఒక్క 24 గంటలు ఆగి, ఆ రహస్యం ఏమిటో రేపు ఉదయం తెలుసుకుందాం.

చి దం బ ర ర హ స్యం!


       (రెండవ భాగం )

99.

నిన్నటి 'చిదంబరం దేవాలయం' గుఱించి తెలియజేసిన విషయాలకు ముఖపుస్తక పాఠకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎప్పుడో నేను నా డైరీలో వ్రాసుకున్న దేవాలయ వివరాలు మిమ్మల్ని ఇంతగా అలరిస్తాయని, నేనెప్పుడూ ఊహించలేదు. అందరికీ పేరు పేరునా మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


అయితే, నిన్న దేవాలయ బాహ్య పరిస్థితులు తెలుసుకున్నాం. మరి ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతగా వున్నారని నాకు తెలుసు. వివరిస్తాను, దయచేసి చదవండి. గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి ఎప్పుడు తెరవేసి వుంటుంది. అప్పటి ఋషులు, అక్కడ గోడలో ఒక విశిష్టమైన యంత్రం బిగించారని చెప్తారు. 


అది ఏ యంత్రమో ఎవరూ చెప్పలేక పోయారు. దాని పైన దట్టమైన చందనం పూయబడి వుంటుంది. దానిని ఎవరూ తాకడానికి వీలులేదు. ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి, యంత్రానికి పూజ చేస్తారు. ఇంకెవరూ పూజ చేయరు సరికదా, పూజా సమయంలో చూడటానికి కూడా అనుమతి ఇవ్వబడదు. 


అయితే, ఆసక్తిగల భక్తులు వూజారిని అడిగి 50 రూపాయల టికెట్ సహాయంతో, కొద్ది దూరంగా, కిటికీలోంచి ఆ యంత్ర దర్శనం చేసుకునే వీలుంది. ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి, హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అప్పుడు అదే గొప్పగా అనిపిస్తుంది.


ఆ యంత్రంపై లీలగా బంగారు బిల్వ పత్రాల మాలలు మనం గమనించవచ్చు. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి. ఎవరి భక్తి పారవశ్యం వారిది. ఎవరంతకు వాళ్లు కళ్లు మూసుకొని తన్మయత్వంలో వుండిపోతారు. ఇంతకూ, ఆ స్ధలంలో భక్తులు ఏం చూసి వుంటారు? ఇదే ఎవరికీ అంతుచిక్కని దేవ రహస్యం, 'చిదంబర రహస్యం'. 


అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన (ఆకాశతత్వం) దేవదేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం, చిదంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని చెబుతారు. ఎవరి అంతరంగ భావాలను అనుసరించి వారు, ఆ యా రూపంలో నిరాకారుడైన స్వామిని దర్శించుకుంటారని తెలుస్తుంది.


అక్కడ మాకు, చాలా కాలం క్రిందట lAS అధికారిగా పని చేసి, పదవీ విరమణ పొందిన వయో వృద్ధులు శ్రీ నావల్ పాకం నరసింహన్ గారు పరిచయమయ్యారు. వారు తెలిపిన కొన్ని రహస్యమైన విశేషాలును ఇక్కడ మీకు తెలియజేస్తాను.


కొన్ని వేల యేళ్ల క్రిందట తిరుమూలర్ అనే తమిళ శాస్త్రజ్ఙుడు, ఏదో ఒక రోజు తప్పక చిదంబర దేవాలయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందనే విషయాన్ని తెలియజేశారట. ఇప్పుడు, పాశ్చాత్య శాస్త్రజ్ఙులు పదేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత, వాళ్లు కనిపెట్టిన ఇతర విశేషాలు, ఈ క్రింది విధంగా వున్నాయట.


చిదంబరం ఆకాశ తత్వానికి, కాళేశ్వరం వాయు తత్వానికి, కంచి ఏకాంబరేశ్వరం భూ తత్వానికి చిహ్నం. అదేగాక, ఈ మూడు దేవాలయాలు, గిరిగీసినట్లుగా, ఒకే వరుసలో, భూ రేఖాంశము 79' 70" లో వున్నాయనేది, ఈనాటి ఖగోళ శాస్త్రజ్ఙుల ఊహకందని నగ్నసత్యం. తరువాత శ్రీ రంగం దగ్గర జంబుకేశ్వరం జలతత్వానికి, అరుణాచలేశ్వర దేవాలయం, అగ్ని తత్వానికి చిహ్నాలు. వీటినే మన పెద్దలు పంచ భూతాత్మకమైన ఆలయాలని అన్నారు.


మానవ దేహంలో నవ రంధ్రాల మాదిరి, చిదంబర దేవాలయానికి కూడా తొమ్మిది ద్వారాలున్నాయి. దేవాలయ ఉపరి భాగంలో 21600 బంగారు రేకులతో కప్పబడి వుందట. ఇది శాస్త్రంలో చెప్పినట్లుగా, నిముషానికి 15 ఉచ్ఛ్వాసనిశ్వాసల చొప్పున రోజుకు 15 × 60 × 24 = 21600 సంఖ్యను సూచిస్తుందని చెప్పుకొచ్చారు.


అలాగే, 21,600 బంగారు రేకులను గోపురంపై, 72,000 చిన్న చిన్న బంగారు మేకులతో తాపడం చేశారట, ఇది మన దేహంలోని 72,000 నాడులకు చిహ్నంగా ఏర్పఱిచారని, వారి ద్వారా తెలుసుకుంటుంటే ఆశ్చర్యమనిపించింది.


మానవ శరీరంలో గుండె ఎడమవైపు వున్నట్లు, పొన్నాంబళం కొంచెం ఎడమవైపుగా వుండి, అదే విషయాన్ని సూచిస్తుందని, అక్కడికి చేరాలంటే, పంచాక్షర పడిగా పిలిచే 'శి, వా, య, న, మ' అనే ఐదు మెట్లు ఎక్కవలసి వుంటుందని చెప్పారు.


అక్కడి కనక సభకు నాలుగు స్తంభాలుంటాయి. అవి, మన నాలుగు వేదాలను సూచిస్తాయి. పొన్నాంబళానికి 28 స్తంభాలుంటాయి. ఈ స్తంబాలపైన, 64 + 64 వాట్లుంటాయి (అడ్డ, నిలువు దూలాలు), ఇవి 64 కళలను, మనలో అంతర్లీనంగా వున్న 64 రక్త నాళాలను సూచిస్తాయట. జయహో! మన పూర్వీకుల గొప్పతనం. 


గోపురంపైని కలశాలు, మనలోని శక్తి కేంద్రాలని, అర్ద మంటపానికి వుండే ఆరు స్తంభాలు, ఆరు శాస్త్రాలని, ప్రక్కన మంటపానికున్న 18 స్తంభాలు,18 పురాణాలను సూచిస్తాయని ఉన్మీల నేత్రాలతో ఉదహరించిన నరసింహన్ lAS గారికి కృతజ్ఞతలు.


మన నటరాజు నృత్యం, భూమండల సంబంధమైన నృత్యంతో పోల్చారట పాశ్చాత్య శాస్త్రజ్ఙులు. ఇప్పుటి శాస్త్రజ్ఙులు చెబుతున్న విషయాలు, వేల సంవత్సరాల క్రిందటనే GPS లేని రోజుల్లో మన ఋషులు విశదపఱచిన విషయం గమనించ ప్రార్థన. 


అందుకే, హిందూత్వం అనేది మతం కాదు, మనల్ని మార్గనిర్దేశం చేసే రహదారి. ఆర్ష సనాతన ఆచార సాంప్రదాయాలన్నీ ఆచరణ యోగ్యమైనవే అని నిరూపితమైనాయి.


చదివినందులకు ధన్యవాదములు!


Very interesting - Can you guess what is common between all these prominent temples.


1. Kedarnath 79.0669°

2. Kalahashti 79.7037°

3. Ekambaranatha- Kanchi 79.7036°

4. Thiruvanamalai 79.0747°

5. Thiruvanaikaval 78.7108

6. Chidambaram Nataraja 79.6954°

7. Rameshwaram 79.3129°

8. Kaleshwaram N-India 79.9067°


If your answer is they all are Shiva temples, you are only partially correct. It is actually the longitude in which these temples are located. They all are located in 79° longitude. 


What is surprising and awesome is that how the architects of these temples many hundreds of kilometers apart came up with these precise locations without GPS or any such gizmo like that. Wow.. 

Hats off to them. See the picture.

చదివినందులకు ధన్యవాదములు 🙏

కామెంట్‌లు లేవు: