2, జూన్ 2023, శుక్రవారం

భోజన నియమాలు

 ప్ర: *భోజన నియమాలని తెలుపగలరు*.

జ: *మన శాస్త్రంలో ఎన్నో భోజన విధులని తెలిపారు*. *మనకున్నన్ని భోజన నియమాలు మరెక్కడ కనపడవు. ఎక్కడ నాగరికత ఉంటుందో అక్కడ నియమం ఉంటుంది*.

తిన్న ఆహారంలో - 

*స్థూల భాగం* - మలినంగా మారుతుంది.

*సూక్ష్మ భాగం* - ప్రాణశక్తిగా మారుతుంది.

*అత్యంత సూక్ష్మ భాగం* - మనసుగా మారుతుంది.

అందుకే మన పెద్దవాళ్ళు ఆహార విషయంలో ఇన్ని నియమాలు పెట్టారు. మనం తిన్న ఆహారమే మన మనస్సును నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆహార విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

*మన శాస్త్రాలలో చెప్పిన భోజన విధులలో కొన్ని* -

● ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ తినరాదు.

● చప్పుడు చేస్తూ తినడం, త్రాగడం చేయరాదు.

● ఆచమనం చేస్తున్నప్పుడు చప్పుడు చేస్తూ తాగుతే రక్తపాన దోషం వస్తుంది.

● పంక్తిలో కూర్చున్నప్పుడు ఇతరులు లేవకుండా లేవకూడదు.

● ఎడమ చేతిలో పట్టుకొని నుంచోని తింటే గోమాంస భక్షణ దోషం వస్తుంది.

● తింటున్న అన్నాన్ని నిందించారదు.

● ఎంత కోపం వచ్చినా విస్తరిని త్రోయరాదు.

● భోజనానికి కూర్చునే ముందు కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రం చేసుకోవాలి.

● బిగుతుగా వున్న దుస్తులను, తలపైనా టోపి వంటివి ధరించరాదు.

● తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు పెరుగుతుంది. దక్షిణ ముఖంగా చేస్తే కీర్తికరం. పశ్చిమాభిముఖం సంపత్కరం. ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు తిరిగి భుజించారాదు. కొన్ని చోట్ల - సమూహ భోజనాలలో కొన్ని సడలింపులు చెప్పారు.

● పూర్ణిమ, అమావాస్యలలో రాత్రిపూట భోజనం చేయరాదు.

● చెప్పులు వేసుకొని భుజించారాదు. మంచం మీద కూర్చొని తినరాదు. అది విషం వలె బాధిస్తుంది.

● భగవంతునికి నివేదించని ఆహారాన్ని స్వీకరించరాదు.

● తినరాని వాటిని, నివేదన చేయని వాటిని, అపరిశుద్ధమైన వాటిని తినరాదు.

● నిందిస్తూ తినరాదు. చెడు ఆహారం తినరాదు. శత్రువులు తెచ్చిన ఆహారం తినకూడదు.

● భోజన పదార్థములన్నీ ఆకులోగానీ, కంచంలోగానీ వడ్డించిన తరువాత నీటిని కుడిచేతిలోనికి తీసుకొని మంత్రాన్ని జపించి ఆ నీటిని భోజనంపై చల్లవలెను. అనంతరం మళ్లీచేతిలోకి నీరుతీసుకొని

మధ్యాహ్నమైతే - *"సత్యంత్వర్తేన పరిషించామి"* అనీ అంటూ కుడిచేతిని, ఎడమ చేతి వైపు నుంచి కుడిచేతి వరకూ ప్రదక్షిణగా విస్తరిచుట్టూ నీటిని విడువలెను.

తర్వాత ఐదుసార్లు అన్నం కొద్దికొద్దిగా తీసుకొని ప్రాణాహుతులు పఠిస్తూ నోటిలో వేసుకొని నమలకుండా మింగవలెను.

ఈ విధంగా చేయలేనివారు కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించవలెను.

*"త్వదీయం వస్తుగోవింద తుభ్యమేవ సమర్పయే*

*గృహాణ సముఖోభూత్వా ప్రసీద పరమేశ్వర"*

అంటే - "ఓ గోవిందా! నీ వస్తువును నీకే సమర్పిస్తున్నాను. నీవు నాయందు ప్రసన్నుడవై ప్రసన్నముఖముతో దీనిని గ్రహించు" అని అర్థం.

*"బ్రహ్మార్పణం బ్రహ్మహవిః  బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్*

*బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా"*

ఈ శ్లోకాలను పఠించిన అనంతరం భోజనం చేయవలెను. భోజనం చేయడం ముగించిన అనంతరం -భోజనం చేసి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవడంతో పాటు నోటియందు నీటిని పోసుకొని పుక్కలించవలెను.

అనంతరం -

*అగస్త్యం వైనతేయఞ్చ శమఞ్చ బడబానలమ్*

*ఆహార పరిపాకార్థం స్మరే ధ్బీమఞ్చ పఞ్చమమ్"*

అనే శ్లోకాన్ని పఠించవలెను. అంటే అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు, భీములను స్మరించడం వల్ల ఆహారం సమంగా జీర్ణంకాగలదు అని అర్థం.

(బ్రహ్మ శ్రీ సా.ష.శర్మ)

కామెంట్‌లు లేవు: